ఇదేంపని సార్? ఓ ఉపాధ్యాయుడి వికృత చేష్టలు
ABN , First Publish Date - 2020-12-16T04:53:11+05:30 IST
పాఠాలు చెప్పి.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయుడు వికృతానికి ఒడిగట్టాడు. తానొక ఉన్నతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరిచి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నతాధికారుల చర్యలకు గురయ్యాడు. ఈ సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

ఆన్‌లైన్ తరగతుల మాటున విద్యార్థినులతో అసభ్యకర ప్రవర్తన..
దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
భద్రాద్రి జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఘటన
ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేసిన డీఈవో
లక్ష్మీదేవిపల్లి, డిసెంబరు 15: పాఠాలు చెప్పి.. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయుడు వికృతానికి ఒడిగట్టాడు. తానొక ఉన్నతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరిచి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నతాధికారుల చర్యలకు గురయ్యాడు. ఈ సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఈ ఉదంతంపై విద్యార్థినుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుతో అతడి బాగోతం వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తుండగా చింతవర్రె పాఠశాల పరిధిలోని విద్యార్థులకు దొడ్డ సునిల్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడిగా నియమితులయ్యాడు. ఈ క్రమంలో అతడు కొందరు విద్యార్థినులను పాఠశాలకు పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాదు గిరిజన ప్రాంతం కావడంతో గ్రామస్థులు పొలం పనులకు వెళుతుంటారు. ఈ క్రమంలో విద్యార్థినులు ఒంటరిగా ఉన్నప్పుడు వారి ఇళ్లకు వెళ్లడం లాంటివి చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో కొందరు విద్యార్థినులు అనారోగ్యం బారిన పడగా.. వారిని స్థానిక వైద్యులకు చూపించినా వారు కోలుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు విద్యార్థినుల గట్టిగా నిలదీయడంతో ఆ విద్యార్ధినులు తమ పట్ల ఉపాధ్యాయుడి చేస్తున్న వికృత చేష్టల గురించి వివరించారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహంతో మంగళవారం సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. వెంటనే మండల విద్యాధికారి వెంకట్ విచారణ జరిపి వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మకు తెలియజేశారు.
ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు
బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చింతవర్రె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దొడ్డా సునిల్‌కుమార్‌పై భద్రాద్రి కొత్తగూడెం డీఈవో సోమశేఖర శర్మ విచారణ జరిపి మంగళవారం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా డీఈవో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఎవరైనా ఉపాధ్యాయులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.