‘కొత్త’వేడుకకు సిద్ధం.. ఆంక్షల నడుమ న్యూఇయర్‌ జోష్‌

ABN , First Publish Date - 2020-12-31T05:14:24+05:30 IST

ఈ ఏడాది కరోనా ఆంక్షల మధ్య.. వైరస్‌ వ్యాప్తి భయం మధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో న్యూఇయర్‌ జోష్‌ జరగనుంది. ముఖ్యంగా యువత ఎప్పటిలాగే వేడుకలకు సిద్ధమవుతున్న వేళ పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు మాత్రం హద్దు దాటితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిస్తున్నాయి.

‘కొత్త’వేడుకకు సిద్ధం.. ఆంక్షల నడుమ న్యూఇయర్‌ జోష్‌

స్వీట్లు, కేకులకు డిమాండ్‌.. పెరగనున్న ఆన్‌లైన్‌ ఫుడ్‌బుకింగ్‌లు

లిక్కర్‌ వ్యాపారం రూ.10కోట్లను దాటే అవకాశం

ఏపీ సరిహద్దుకు భారీగా తరలిన మద్యం

కరోనా నిబంధనలు పాటించాల్సిందేనంటున్న ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు

ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) /వైరా/ ఖమ్మం కమాన్‌బజార్‌/ ఖమ్మంక్రైం, డిసెంబరు 30: ఈ ఏడాది కరోనా ఆంక్షల మధ్య.. వైరస్‌ వ్యాప్తి భయం మధ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో న్యూఇయర్‌ జోష్‌ జరగనుంది. ముఖ్యంగా యువత ఎప్పటిలాగే వేడుకలకు సిద్ధమవుతున్న వేళ పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు మాత్రం హద్దు దాటితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిస్తున్నాయి. అయితే ఎవరిళ్లలో వారు వేడుకలు చేసుకోవచ్చని ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో స్వీట్లు, కేకులు, మాంసం దుకాణాలు, రెస్టారెంట్లు సందడిగా మారనున్నాయి. అమ్మకాల కోసం ఆయా దుకాణాలు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ఈ సారి కొవిడ్‌ జాగ్రత్తల నేపథ్యంలో ఎక్కువశాతం మంది ఆన్‌లైన్‌లో ఫుడ్‌ఆర్డర్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. 

మద్యం విక్రయాలే అధికం..

ప్రతీ ఏడాది డిసెంబరు వచ్చిందంటే చాలు మద్యం విక్రయాలు అమాంతం పెరుతాయి. ముఖ్యంగా కొత్త ఏడాది ప్రారంభానికి రెండు, మూడు రోజుల నుంచే వ్యాపారం పూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఈ సారి ఇదే జరిగింది. గతేడాది డిసెంబరుతో పోలిస్తే ఈ డిసెంబరులో దాదాపు రూ.60కోట్ల మద్యం విక్రయాలు పెరిగాయి. మంగళవారం ఒక్కరోజే వైరా ఐఎంఎల్‌ డిపో నుంచి రూ.14కోట్ల మద్యం అమ్ముడుపోయింది. తెలంగాణ ప్రభుత్వం న్యూఇయర్‌ వేడుకలను దృష్టిలో ఉంచుకొని గురువారం అర్థరాత్రి వరకు మద్యంషాపులు, ఒంటిగంట వరకు బార్లు తీసి ఉంచేందుకు అనుమతించిన నేపథ్యంలో ఈ మద్యం విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది. గురువారం ఒక్కరోజే మద్యం వ్యాపారం రూ.10కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వైరా ఐఎంఎల్‌ డిపోలో ఈ డిసెంబరుకు సంబంధించి హోల్‌సేల్‌ మద్యం విక్రయాలు రూ.190కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో మంగళవారం నాటికి 2.58లక్షల మద్యం పెట్టెలు, 73వేల బీరుపెట్టెలు వైన్‌షాపులకు సరఫరా చేశారు. వీటి విలువ రూ.169కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఖమ్మంజిల్లాలో 89వైన్‌షాపులు, 35బార్లు, రెండు క్లబ్‌లు మొత్తం 126ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైన్‌షాపులు 76, బార్లు 12, ఒక క్లబ్‌ మొత్తం 89ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నాలుగు వైన్‌షాపులున్నాయి. వీటన్నింటికీ వైరాలోని ఐఎంఎల్‌ డిపో నుంచే మద్యం సరఫరా జరుగుతోంది. 

ఏపీ సరిహద్దులకు భారీగా...

ఏపీ సరిహద్దుల్లోని ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని వైన్‌షాపులకు మద్యం సరఫరా ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. ఖమ్మంతోపాటు ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలంలోని ఎర్రుపాలెం, మీనవోలు, బనిగండ్లపాడు అలాగే బోనకల్‌, వేంసూరు, అశ్వారావుపేట, సారపాక తదితర ప్రాంతాల్లోని వైన్‌షాపులకు ఈ నెలలలో వైరా నుంచి మద్యం సరపరా ఎక్కువగా జరిగింది. ఆంధ్రాలో సరైన బ్రాండ్లు దొరకకపోవడం, రేట్లు కూడా అధికంగా ఉండటంతో అక్కడి మందుబాబులు తెలంగాణలోని వైన్‌షాపులకు బారులుతీరుతుండగా.. న్యూఇయర్‌ రోజున మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన సరిహద్దు మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లో మద్యం నిల్వలు పెంచుకున్నట్టు తెలుస్తోంది. 

పర్మిట్‌ రూమ్‌లు ఓపెన్‌.. ఆదేశాలు జారీ...

కొత్తఏడాదికి స్వాగతం పలుకుతూ సంబరాలు జరగనున్న వేళ మద్యం దుకాణాలకు అనుసంధానంగా ఉన్న పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ చేసి.. అనంతరం సడలింపులతో తెరిచినా.. పర్మిట్‌రూమ్‌లకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. ఈ క్రమంలో మద్యం వ్యాపారుల వినతి, అధికారులు నివేదికల ఆధారంగా పర్మిట్‌రూమ్‌లకు అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే పర్మిట్‌రూంల వద్ద కరోనా నిబంధనలను పాటించాలని సూచించింది. 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : ఎక్సైజ్‌శాఖ 

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో వైన్‌షాపులు, పర్మిట్‌రూంలు, బార్లు, క్లబ్‌ల వద్ద కరోనా నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ అడిషన్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారని ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ అధికారి సోమిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. వైన్‌షాపులు రాత్రి 12గంటల వరకు, బార్లు, క్లబ్‌లు రాత్రి 1గంట వరకు  అనుమతి ఉందని, వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించొద్దని సూచించారు. 

మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు: ఖమ్మం సీపీ

న్యూఇయర్‌ వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని, ఖమ్మం నగరంలోనిలకారం ట్యాంక్‌బండ్‌పై మాత్రమే అధికారికంగా సంబరాలు జరుగుతాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం సీపీ తఫ్సీర్‌ఇక్బాల్‌ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రెస్టారెంట్లు, పార్కులు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలలో సంబరాలకు ఎలాంటి అనుమతి లేదన్న ఆయన నిబంధనలకు విరుద్ధంగా న్యూఇయర్‌ వేడుకల పేరుతో మద్యం తాగి అర్ధరాత్రి వేళ వాహనాలు నడిపితే అదుపులోకి తీసుకుని కేసులు నమోదుచేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ద్విచక్రవాహన ర్యాలీలు, బాణసంచా పేలుడు నిషేధమని, పలు ప్రధాన కూడళ్లలో హైస్పీడ్‌ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటుచేయాలన్నారు. రాత్రి 12:30గంటల తర్వాత రోడ్లపై ఎవరూ తిరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం దుకాణాలు, దాబాలు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లను నిర్ణీత సమయంలోనే మూసివేయాలన్నారు. ప్రస్తుత కరోనా భయం నేపథ్యంలో ప్రతీ ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించి.. సంతోషకర వాతావరణంలో ఎవరికి వారు వేడుకలు జరుపుకోవాలని సీపీ ఆకాంక్షించారు. 

Updated Date - 2020-12-31T05:14:24+05:30 IST