సీఎం సూచనల మేరకే నడుచుకుంటున్నాం
ABN , First Publish Date - 2020-12-18T04:51:26+05:30 IST
అధికార పక్షంలో ఉండి కూడా ప్రభుత్వం నుంచి ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు తేవటం చేతకాక.. అమాయక ఆదివాసీలను అడ్డుపెట్టుకొని అధికారులపై జులుం ప్రదర్శించటం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సరికాదని ఖమ్మం జిల్లా అటీవీశాఖ అధికారులు మండిపడ్డారు.

అధికార పక్షంలో ఉండి ఆదివాసీలను రెచ్చగొడుతున్నారు
ఎమ్మెల్యే రేగా వ్యాఖ్యలపై అటవీశాఖ అధికారుల నిరసన
ఖమ్మం కమాన్‌బజార్, డిసెంబరు 17 : అధికార పక్షంలో ఉండి కూడా ప్రభుత్వం నుంచి ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు తేవటం చేతకాక.. అమాయక ఆదివాసీలను అడ్డుపెట్టుకొని అధికారులపై జులుం ప్రదర్శించటం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సరికాదని ఖమ్మం జిల్లా అటీవీశాఖ అధికారులు మండిపడ్డారు. తమ శాఖపై ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్రవరి, వైస్ ప్రెసిడెంట్ దుగ్గిరాల శ్రీను ఆధ్వర్యంలో అధికారులు ఖమ్మంలో గురువారం నల్లబ్యాడ్జీలు దరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్న తమపై ఆదివాసీలను రెచ్చగొట్టటమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు తేవటం చేతకాక అమాయకులను అడ్డుపెట్టుకొని అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని, తాము ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే నడుచుకుంటూ హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామన్నారు. సీఎం ఆలోచనలకు, ఆశయాలకు వ్యతిరేకంగా రేగా కాంతారావు వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం తాము ఎవరి మాట వినాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్, సురేష్‌కుమార్, విజయ్‌కుమార్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.