పదే పది నిమిషాలు.. ‘100’కు డయల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న సగటు సమయమిది..
ABN , First Publish Date - 2020-12-30T04:46:36+05:30 IST
ఎక్కడైనా నేరం, ఘోరం జరిగిందన్న సమాచారం వస్తే చాలు.. పది నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుంటున్నారు ఉమ్మడి జిల్లా పోలీసులు. కేసుల వివరాలు తెలుసుకోవడంతోపాటు వాటిని రోజుల వ్యవధిలోనే ఛేదించే దిశగా ముందుకుసాగుతున్నారు. అక్రమాలపై నిఘా పెట్టడంతోపాటు పక్కా సమాచారంతో నేరస్తులకు చెక్ పెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఉమ్మడి ఖమ్మంలో గతేడాది కన్నా మెరుగ్గా సేవలు
క్షణాల్లో ఘటనా స్థలాలకు చేరుకుంటున్న యంత్రాంగం
లాక్‌డౌన్ వేళ విధుల్లోనే కాదు.. ఆపన్నులకు చేయూతనందించడంలోనూ భేష్
ఖమ్మం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఎక్కడైనా నేరం, ఘోరం జరిగిందన్న సమాచారం వస్తే చాలు.. పది నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుంటున్నారు ఉమ్మడి జిల్లా పోలీసులు. కేసుల వివరాలు తెలుసుకోవడంతోపాటు వాటిని రోజుల వ్యవధిలోనే ఛేదించే దిశగా ముందుకుసాగుతున్నారు. అక్రమాలపై నిఘా పెట్టడంతోపాటు పక్కా సమాచారంతో నేరస్తులకు చెక్ పెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. తక్కువ సమయంలో పురోగతి సాధిస్తున్నారు. ఓ వైపు సేవా కార్యక్రమాలు.. మరో వైపు సమాజహిత కార్యక్రమాలతో ఫ్రెండ్లీ పోలీసులుగా ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కింద 1895 మొక్కలు నాటారు.
డయల్ 100కు స్పందన..
డయల్ 100కు వచ్చిన స్పందన చూస్తుంటే.. పోలీసులు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో అర్థం అవుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సగటున ఐదు నిమిషాల తక్కువ సమయంలోనే స్పందిస్తున్నట్టు అర్థమవుతోంది. ఖమ్మంజిల్లాలో గతేడాది డయల్ 100కు 37,463 ఫోన్ కాల్స్ రాగా వాటిపై 1167 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఆయా ఫోన్ కాల్స్‌పై పోలీసులు స్పందన సగటు 16 నిమిషాలు కాగా ఈ ఏడాది 35,683 ఫోన్ కాల్స్ రాగా 1034 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు ఆయా కాల్స్‌కు సగటున 11.32 నిమిషాలుగా చూపుతోంది. ఈ ఏడాది మొత్తం 28మర్డర్లు జరగ్గా అందులో కుటుంబ కలహాల కారణంగా తొమ్మది, వరకట్న వేధింపులతో రెండు, భూ వివాదంలో ఒకటి, ఆస్తి తగాదాలు రెండు, పెట్టీ కేసులకు సంబంధించి మూడు, ఒక రేప్ అండ్ మర్డర్ ఉన్నాయి. వాటితోపాటుగా మూడు పీడీయాక్ట్ కేసులు నమోదయ్యాయి.
కరోనాతో తగ్గిన క్రైం రేట్..
హత్యలు... అత్యాచారాలు.. ఆత్మహత్యలు ఈ ఏడాది కొంతమేర తగ్గాయనే చెప్పాలి. ఇక కరోనా వేళ అయితే అసలే లేవు. గతేడాదితో పోల్చుకుంటే మోసం కేసులూ తగ్గాయి. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో నిత్యం ఏదో ఒక కారణంతో ప్రతిరోజు పదులసంఖ్యలో పోలీస్‌స్టేషన్ మెట్లెక్కేవారు. ఆయా బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి.. కేసు పూర్వాపరాలు పరిశీలించేవారు. కానీ కరోనా సమయంలో జిల్లా ప్రజలు పోలీసులకు ఆ పని కాస్తంత తగ్గించేశారనే చెప్పుకోవాలి. ఫలితంగా గతేడాది కంటే ఈ ఏడాది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు శాతం తగ్గడం దానికి ఉదాహరణ. గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది ఎఫ్‌ఐఆర్‌ల నమోదు శాతం కూడా తగ్గింది. 2019లో 7166 నమోదవగా ఈ ఏడాది 6586 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే కరోనా వేళల్లో మాత్రం లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారీతిన తిరిగిన వారిపై పోలీసులు తమ వైఖరి ప్రదర్శించారు. ఫలితంగా కరోనా వేళ మార్చి 22 నుంచి ఆగస్టు వరకు పాండమిక్ డిసీజ్ యాక్ట్ కింద 965 కేసులు నమోదు చేశారు జిల్లా పోలీసులు. 104 వాహనాలు సీజ్ కేసులు, 46షాపు సీజ్ కేసులు, ఈడీ యాక్ట్ వెహికిల్ కింద 331 కేసులు నమోదు చేసి 1427 వాహనాలు, ఈడీ యాక్ట్ షాప్స్ కింద 207 కేసులు నమోదు చేసి 330 దుకాణాలు, ఈడీయాక్ట్ వాకర్స్‌పై 830 మందిపై 62 కేసులు నమోదు చేశారు.
దూకుడు పెంచిన టాస్క్‌ఫోర్స్..
ఈ ఏడాది 22 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేశారు. 795 కిలోల గంజాయి, 229 పేకాట, మట్కా 3, 26 క్రికెట్ బెట్టింగ్, 51 లిక్కర్ కేసులు, 278 గుట్కా కేసులు, 81 ఇసుక కేసులు, 10 ఆటవీశాఖకు సంబంధించి కేసులు, 38 సివిల్ సప్లై కేసులు నమోదయ్యాయి. అందులో మొత్తం 320 దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 68 పీడీఎస్, 4 కిరోసిన్, 103 ఇసుక రవాణా, 66 గుట్కా, 10 ఎన్డీపీఎస్, 12 పేకాట, 7 కాయిన్ టాసింగ్, 6 వ్యభిచారం, 22 బెల్ట్‌షాపులు, ఒక బాణసంచా దుకాణం ఇతర టాస్కులు 21 నమోదు చేశారు. ఆయా కేసుల్లో మొత్తం రూ. 93.20 లక్షల విలువ కలిగిన 1512 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 2830 లీటర్ల కిరోసిన్, 198 వాహనాలు, రూ. 84.56 లక్షల గుట్కా, ర. 6.81 లక్షల గంజాయి, పేకాటలో రూ. 1.78 లక్షలున్నాయి.
ప్రాపర్టీ రికవరీ..
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ రికవరీ 22శాతం పెరిగింది. 2019లో 515 కేసులు నమోదవగా రూ.4.50కోట్ల వరకు సొత్తు పోయింది. అందులో 285 కేసులు ఛేదించి రూ.1.58కోట్లు సొత్తును పోలీసులు రికవరీ చేశారు. ఈ ఏడాది మొత్తం 333 కేసులు నమోదవగా అందులో రూ.3.41కోట్లు సొత్తు పోయింది. వాటిల్లో అందులో 12 దోపిడీ కేసులు, 29 పగటిౄపూట, 103 రాత్రి వేళల్లో జరిగిన ఇంటి దొంగతనాలు, 8 చైన్ స్నాచింగ్, 180 ఇతర దొంగతనాలున్నాయి. అందులో 179 కేసులు చేధించిన పోలీసులు రూ.1.93 కోట్లు రికవరీ చేశారు.
15శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు..
గతేడాదిలో 245 ప్రమాదాలు జరగ్గా ఆ ప్రమాదాల్లో 263 మంది చనిపోయారు, 741 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 230 ప్రమాదాలు జరగ్గా అందులో 240 మంది చనిపోగా 667 మంది గాయపడ్డారు. కాగా ఆ ఏడాది కెమెరా కేసులు 3,35,551 నమోదు చేశారు. 9432 ఈ చలాన్ కేసులు నమోదు చేశారు. రూ.3.76కోట్లు కాంపౌండింగ్ ఫీజులు వసూలు చేశారు. 851 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
మహిళలకు సంబంధించిన కేసులు ఇలా...
మహిళలకు సంబంధించి ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో ఐదు వరకట్న మర్డరు,్ల ఏడు ఇతర మర్డర్లు జరిగాయి. 17మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 259 వేధింపులు, 71 రేప్ కేసులు, 61 కిడ్నాప్ కేసులు, 22 ఈవ్‌టీజింగ్, 79 పోస్కో యాక్ట్, 7 వ్యభిచార కేసులు నమోదయ్యాయి. ఈ యేడాదిలో 271 మహిళలు తప్పిపోగా 245 మందిని పోలీసులు గుర్తించారు. 89 మంది బాలికలు కిడ్నాప్ అవ్వగా 42 మందిని గుర్తించారు. వారితోపాటుగగా 108 మంది పురుషుల తప్పిపోగా 77 మందిని గుర్తించారు. 14 మంది బాలురు కిడ్నాప్ అవ్వగా 9 మందిని గుర్తించారు. వీటితోపాటుగా సైబర్ ల్యాబ్ పోలీసులు 26 ఓటీపీ ఫ్రాడ్ కేసులు, 12 ఫేస్‌బుక్ ఎనాలసిస్ కేసులు, 2 ఇన్‌స్ట్రాగ్రాం కేసులు చేధించారు. 55 పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 3504 సీసీ కెమెరాలు అమర్చారు.
లాక్‌డౌన్ అమల్లో కీలకపాత్ర
ప్రతీ ఒక్కరూ భార్యాపిల్లలతో ఇంటిపట్టునే ఉండండి అని కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు చెప్పిన పోలీసులు.. తాము మాత్రం తమ కుటుంబాలన వదిలి సేవలందించారు. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బందివరకు ఉమ్మడిజిల్లాలో సుమారు 1800 మంది పోలీసులు రోడ్లపై మకాం వేసి.. కరోనా నుంచి ప్రజలను రక్షించే క్రమంలో తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి కరోనా వారియర్స్‌లో ముందునిలిచారు. లాక్‌డౌన్ సమయంలో రాత్రి, పగలు తేడా భయంకరమైన పరిస్థితులను కూడా లెక్క చేయకుండా పనిచేశారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ నిబంధనలను పక్కనపెట్టి అకారణంగా రోడ్లపైకి వచ్చిన ఆకతాయిల పట్ల సామదానబేధ దండోపాయాలను ప్రదర్శించారు. సాధ్యమైనంత వరకు శాంతియుతంగానే ప్రజలను లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా ప్రవర్తించారు. కొందరు పోలీసులైతే చేతులెత్తి మొక్కి మరీ బయటకు రావొద్దంటూ బతిమిలాడారు. అంతేకాదు లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన అభాగ్యులకు తామున్నామంటూ అండగా నిలిచారు. దాతలు, స్వచ్ఛంద సంఘాల సాయంతో నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు శానిటైజర్లు, మాస్కులను పేదలకు అందించి శభాష్‌పోలీస్ అనిపించుకున్నారు.
భద్రాద్రి జిల్లాలో క్రైమ్ రేట్ ఇదీ..
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టినట్టు లెక్కలు చెబుతున్నాయి. మార్చి 22నుంచి ఏకధాటిగా ఐదు విడతల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో నేరాలు, ఘోరాలు, ప్రమాదాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. జిల్లాలో మొత్తం 155 రోడ్డుప్రమాదాలు జరగగా, 168 మంది మృతిచెందారు. 27 కేటగిరీల్లో జిల్లా వ్యాప్తంగా 4,185 కేసులు నమోదవగా, అందులో మిస్సింగ్స్ 60, ఫైర్ 4, తదితర ఘటనలున్నాయి. ముఖ్యంగా జూన్ నెలలో జరిగిన 14ఏళ్ల మైనర్ బాలిక రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద మృతి మిస్టరీగానే మిగిలిపోయింది. సింగరేణి సంస్థలో ఈఅండ్‌ఎం పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ జరగగా నిందితులను అరెస్ట్‌చేసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించినా పూర్తిస్థాయి దర్యాప్తు జరగకపోవడం నిరుద్యోగుల్లో నిరాశగా మిగిలిపోయింది. తాజాగా లక్ష్మీదేవిపల్లి మండలం చింతవర్రె గ్రామంలో ఓ ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.