విన్నపాలు వినరుగా.. నగరంలో పరిష్కారానికి నోచుకోని సమస్యలెన్నో

ABN , First Publish Date - 2020-12-28T04:57:10+05:30 IST

ఇటీవలే నగరంలో రూ.218కోట్లతో చేపట్టిన 11పనులను నలుగురు మంత్రులు ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అభివృద్ధి నాణేనికి ఒకవైపేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామంటున్న నగరపాలక సంస్థ పలు కాలనీల్లో అంతర్గతంగా తిష్టవేసిన ఎన్నో ప్రధాన సమస్యలను పట్టించుకోవడంలేదని, అదేమంటే సరిపడా బడ్జెట్‌ లేదని అధికారులు సమాధానం చెబుతున్నారని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

విన్నపాలు వినరుగా.. నగరంలో పరిష్కారానికి నోచుకోని సమస్యలెన్నో

అంతర్గత సమస్యలతో పలు డివిజన్ల ప్రజల ఇబ్బందులు

గ్రీవెన్స్‌లో ఫిర్యాదులిచ్చినా.. కానరాని ఫలితం

చిన్న సమస్యలైనా బడ్జెట్‌ లేదంటూ కాలయాపన

స్థానిక నేతలపై పెరుగుతున్న అసంతృప్తి..!

ఖమ్మం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ట్యాంకుబండ్లు, పార్కుల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణాలు, రోడ్లవిస్తరణ, కూడళ్ల సుందరీకరణ, అందమైన బొమ్మల ఏర్పాటు, సెంట్రల్‌ లైటింగ్‌, వాక్‌వేలు, ఫ్లైఓవర్లు.. ఇదీ ప్రస్తుతం ఖమ్మం నగరంలో జోరుగా జరుగుతున్న అభివృద్ధి. ఇటీవలే నగరంలో రూ.218కోట్లతో చేపట్టిన 11పనులను నలుగురు మంత్రులు ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అభివృద్ధి నాణేనికి ఒకవైపేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామంటున్న నగరపాలక సంస్థ పలు కాలనీల్లో అంతర్గతంగా తిష్టవేసిన ఎన్నో ప్రధాన సమస్యలను పట్టించుకోవడంలేదని, అదేమంటే సరిపడా బడ్జెట్‌ లేదని అధికారులు సమాధానం చెబుతున్నారని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. పలు డివిజన్లలోని అంతర్గత సమస్యల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇలా ఉంటే.. కార్పొరేషన్‌ ఎన్నికల అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నగరంలోని పలు డివిజన్లలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై చర్చ జరుగుతోంది. 

ఫైనాన్స్‌ ఇంప్లిమెంటేషన్‌ పేరిట కాలయాపన..

గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఆయా ఫిర్యాదుల స్థితిని పరిశీలించడానికి వెళ్తున్న అధికారులు ఆ తర్వాత స్థానిక సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆ సమస్య పరిష్కారమయ్యే దిశగా చొరవ చూపాల్సి ఉంది. కానీ ఫిర్యాదు వచ్చిన అనంతరం అక్కడకు వెళ్తున్న అధికారులు ఆ తర్వాత సమస్యను మర్చిపోతున్నారు. పైగా రూ.వందల కోట్లు నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఖమ్మం నగరంలో చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ‘ఫైనాన్షియల్‌ ఇంప్లిమెంటేషన్‌’ అన్న సాకు చూపి తప్పించుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆ కారణం చూపి నెలల తరబడి కాలయాపన చేయడం పరిపాటిగా మారిందని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని సమస్యలయితే నెలల తరబడి ప్రాసెసింగ్‌లోనే ఉంటున్నట్టుగా చూపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రూ.100కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న ఖమ్మం నగరపాలకంలో మాత్రం పన్నులు చెల్లించి నివసించే చోట ఉన్న అంతర్గత సమస్యలను మాత్రం పట్టించుకోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. స్థానిక నేతలపై అసంతృప్తి..!

కార్పొరేషన్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పలు డివిజన్లలోని అంతర్గత సమస్యల పరిష్కార అంశం తెరపైకి వస్తుండటంపై చర్చ జరుగుతోంది. స్థానిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. పలుమార్లు గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేసినా అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం ప్రభావం స్థానిక నేతలపై పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని డివిజన్లలో స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. చిన్న సమస్యలే అని అధికారులు వదిలేస్తోండగా... ఆయా సమస్యలు పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కారానికి నెలల సమయం పడుతుండటంతో ఆయా డివిజన్లలోని ప్రజలు స్థానిక నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా రానున్న ఎన్నికల్లో ఇలాంటి అంతర్గత సమస్యల ప్రభావం పడే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు నగరంలోని డివిజన్లలో అంతర్గత సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

గ్రీవెన్స్‌కు వచ్చి పరిష్కారం వాటిలో కొన్ని..

‘రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. వర్షాకాలంలో నడిచేందుకు కూడా విలుండని పరిస్థితి. ఈ సమస్యను పరిష్కరించండి’ అంటూ ఇచ్చిన ఫిర్యాదు. అయితే ఆ సమస్యకు ఒక రోడ్డు మంజూరు కానీ, గుంతలు పూడ్చి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కానీ చేయాల్సి ఉంది. ఈ దరఖాస్తు జూలై 9న గ్రీవెన్స్‌కు రాగా నేటికీ పరిష్కారం కాలేదు. ఫిర్యాదు చేసినరోజు మినహా మళ్లీ అటువైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. 

(ఖమ్మం సిటిజన్‌ సర్వీస్‌ మానిటరింగ్‌ సెల్‌ గ్రీవెన్స్‌ నెంబరు : 3,99,013)


‘డ్రెయినేజీ పూర్తిగా ధ్వంసమైంది. డ్రెయినేజీ పైపులు పగిలిపోయి ఇళ్లల్లో వాడుకున్న నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. పైపులు పగిలిన గుంతల్లో ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పైపులు మార్చాలి’ అంటూ అక్టోబరులో ఫిర్యాదు అందింది. కానీ అది ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 

(గ్రీవెన్స్‌ నెంబరు : 4,33,135)


‘మా ఇంటి ముందు ఉన్న పెద్ద చెట్టు ఒరిగిపోయి ఉంది. కింద వేర్లు కూడా భూమి నుంచి బయటకు వస్తున్నాయి. పెద్దగా గాలిదుమారం లాంటివి వస్తే చెట్టు కూలి చిన్నపాటి ఇల్లు అయిన రేకుల షెడ్డు మీద పడటమే కాకుండా కింద ఉన్న కరెంటు తీగలు తెగి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. చెట్టును తొలగించగలరు’ అంటూ మే 11న ఫిర్యాదు చేశారు. కానీ ఆ సమస్య పరిష్కారం కాకపోగా.. అసలు ఆ సమస్య తమ పరిధిలోకి రాదు అంటూ చేతులేత్తేశారు కార్పొరేషన్‌ అధికారులు. 

(గ్రీవెన్స్‌ నెంబరు : 3,84,595)

Updated Date - 2020-12-28T04:57:10+05:30 IST