కష్టం మిగిల్చిన కరోనా.. వైరస్‌ భయంతో తల్లడిల్లుతున్న జనం

ABN , First Publish Date - 2020-12-29T05:14:45+05:30 IST

కంటికి కనిపించని మహమ్మారి ఈ ఏడాదంతా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎన్నో ఆశలతో 2020ని ఆహ్వానించిన జనం మార్చి నుంచి ఇప్పటి వరకు ఊహించని వైరస్‌ కరోనాకు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం వచ్చే ఏడాది 2021లో అయినా ఈ మహమ్మారి అంతరించి పోయి మంచిరోజులు రావాలని కోరుకుంటున్నారు.

కష్టం మిగిల్చిన కరోనా..  వైరస్‌ భయంతో తల్లడిల్లుతున్న జనం

అన్ని రంగాలపైనా కొవిడ్‌ ప్రభావం 

తిరోగమనంలో అభివృద్ధి గ్రాఫ్‌

సడలింపులతో కుదుటపడుతున్న వ్యవస్థలు

ఖమ్మం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కంటికి కనిపించని మహమ్మారి ఈ ఏడాదంతా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎన్నో ఆశలతో 2020ని ఆహ్వానించిన జనం మార్చి నుంచి ఇప్పటి వరకు ఊహించని వైరస్‌ కరోనాకు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం వచ్చే ఏడాది 2021లో అయినా ఈ మహమ్మారి అంతరించి పోయి మంచిరోజులు రావాలని కోరుకుంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఏడాది పొడవునా చిన్నా, పెద్ద, ముసలి తేడా లేకుండా కొవిడ్‌ వైరస్‌ బారిన పడుతుండగా.. దాని నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం అన్నిరంగాలపై తీవ్రంగా పడింది.  ఓ వైపు పరిశ్రమలు, విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూత.. మరోవైపు వలసకూలీల సొంతూళ్ల బాట, ఇంకోవైపు ఊళ్లలోనే ఉన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి దీంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఆ తర్వాత లాక్‌డౌన్‌ సడలించినా తేరుకోని పరిస్థితి. ఇలా 2020 ఏడాదంతా కష్టంతోనే కరిగిపోయింది. 

జనజీవనానికి ‘లాక్‌’డౌన్‌

కరోనా వ్యాప్తి నియంత్రణకు గాను కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతకర్ఫ్యూను అమలు చేసి.. ఆ మరుసటి రోజైన 23నుంచి నిరవధిక లాక్‌డౌన్‌ విధించింది. దీంతో బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి జిల్లా వాసులు ఏదో ఒక రకంగా వాహనాలు పట్టుకుని స్వగ్రామాలకు చేరుకున్నారు. మరోవైపు విద్యసంస్థలు ముందస్తుగానే వేసవి సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డాయి.  ఈ క్రమంలో పల్లె నుంచి పట్టణం వరకు కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. వైద్య, పోలీసు, పారిశుధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సేవలు ఆగిపోయాయి. 

చతికిల పడిన చదువులు, క్రీడలు

2020లో చదువు చతికిలపడింది. విద్యారంగ చరిత్రలో ఎన్నడూలేని విధంగా పరీక్షలు రాయకుండానే పదోతరగతి పాసయ్యారు. ఇంటర్‌ పరీక్షలు కొన్ని జరగ్గా కొని మిగిలాయి.  సీబీఎస్‌ఈ 10, 12 విద్యార్థులకు మాత్రమే పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాలేదు. దీంతో ఇళ్లలోనే ఉంటూ ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. గతంలో కేవలం విదేశాలకు చెందిన విద్యాసంస్థల నుంచి మాత్రమే ఆన్‌లైన్‌లో పాఠాలు వినే మన విద్యార్థులు.. కరోనా కారణంగా ఈ సారి మన పాఠాలను కూడా ఆన్‌లైన్‌లో వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ చదువులు తమ పిల్లల భవిష్యత్‌కు ఏమేరకు ఉపకరిస్తాయోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో కనిపిస్తుండగా.. పిల్లలను విద్యనుంచి పూర్తిగా దూరం కాకుండా చూస్తూ.. ఎంతోకొంత మేర ఫీజులు వసూలు చేసి.. అటు తమ ఉపాధ్యాయులకు చేయూతనిచ్చేందుకు ప్రైవేట్‌ యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి. ఇదిలాఉంటే క్రీడారంగంపైనా కరోనా తీవ్రప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని క్రీడామైదానాలకు తాళాలు వేశారు. దీంతో క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే మైదానాలు తెరుచుకుంటున్నా పూర్తిగా క్రీడలు సాగని పరిస్థితి. ప్రతీ ఏడాదిలాగా ఈ సారి జాతీయ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్ల ఊసే కనిపించలేదు. 

కాస్త మెరుగ్గా వ్యవసాయరంగం.. 

తొలిరోజుల్లో లాక్‌డౌన్‌ ప్రభావం వ్యవసాయరంగంపై పడినా.. క్రమంగా కోలుకుంది. మార్చినాటికి పంటలు చేతికి వస్తే సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మిర్చి, పుచ్చ, బొప్పాయి కోతలు నిలిచిపోయాయి. వ్యవసాయ మార్కెట్లు మూతపడంతో అమ్ముకొనే పరిస్థితి కనిపించలేదు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కోలుకుని కొంత వెసులుబాటు ఇవ్వడంతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. ఇదిలా ఉంటే ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిస్సా, ఏపీల నుంచి వచ్చిన 50వేలమందికి పైగా వలస కూలీలు తిరుగుపయనం కావడంతో ఉమ్మడి జిల్లాలో కూలీల కొరత ఏర్పడింది. కానీ తర్వాత తర్వాత అ పరిస్థితి కూడా ఆశాజనకంగా మారింది. ఈ సారి సగటు వర్షపాతం ఎక్కువగా నమోదవడంతో ఉమ్మడిజిల్లాలో లక్ష50వేల ఏకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. 

దెబ్బతిన్న పారిశ్రామికం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. రూ.వెయ్యికోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు టర్నోవర్‌ జరిగే గ్రానైట్‌ కుదేలైంది. ఇతర రాష్ట్రాల కార్మికులపై ఆధారపడిన గ్రానైట్‌ పరిశ్రమ విలవిల్లాడింది. వేలాది మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో 450కుపైగా గ్రానైట్‌ పరిశ్రమలు, పలు క్వారీలు మూతపడ్డాయి. సడలింపులతో కొందరు కార్మికులు తిరిగి వచ్చినా ఇంకా కోలుకోని పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో సుమారు 150 గ్రానైట్‌ పరిశ్రమలు నడుస్తున్నాయి. ఇక భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని సింగరేణి సంస్థ కార్యకలాపాలు కొనసాగినా.. కరోనా భయంతో కార్మికులు గైర్హాజరవడంతో సంస్థ షిప్టులను కుదించాల్సి వచ్చింది. ఐటీసీ, హెవీవాటర్‌ప్లాంట్‌, కేటీపీఎస్‌, నవభారత్‌ లాంటి భారీపరిశ్రమలు కూడా షట్‌డౌన్‌ అయ్యాయి.  

వైద్యరంగంపైనా ప్రభావం..

కరోనా మహమ్మారి వైద్యరంగాన్ని కూడా దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆసుపత్రులు మూతపడగా.. అత్యవసర రోగులకు మాత్రమే వైద్యులు సేవలందించారు. అప్పటి వరకు వైద్యం వ్యాపారంలా సాగగా.. ప్రైవేట్‌ వైద్యశాలల యాజమాన్యాల ఆదాయానికి బ్రేక్‌పడింది. మెడికల్‌షాపులు మాత్రం నిరంతరం తెరిచేఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగ్గా.. వైద్యం అందించడంలో ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల డాక్టర్లు, సిబ్బంది ప్రశంసనీయమైన సేవలందించారు. ఆతర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లోను కరోనా ఓపీ సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. 

దెబ్బతిన్న వ్యాపార రంగం..

కొవిడ్‌ 19వైరస్‌ వ్యాప్తితో 2020లో వ్యాపార రంగానికి తీరని నష్టం మిగిలింది. జనతాకర్ఫ్యూనాటి నుంచి లాక్‌డౌన్‌ సడలింపుల వరకు వ్యాపారాలు సక్రమంగా సాగకపోవడంతో వ్యాపారులు నష్టాలు మూటగట్టుకున్నారు. వస్త్రాలు, బంగారం, హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, షోరూంలు మూతపడ్డాయి. కిరాణా, కూరగాయలు, నిత్యావసరాలు మినహా అన్ని వ్యాపారాలు స్తంభించాయి. దీంతో మధ్యతరహా, చిన్న వ్యాపారులు ఇళ్లు, దుకాణాల అద్దెలు చెల్లించలేక అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారాలు వదిలేసి సొంతూళ్లకు కూడా పయనమయ్యారు. గతంతో పోలిస్తే సగానికిసగం టర్నోవర్‌ తగ్గిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడిన పడుతున్నాయని చెబుతున్నారు. క్రమంగా శుభకార్యాలు ఊపందుకోవడంతో ఫంక్షనుహాళ్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాహాళ్లు కూడా క్రమంగా తెరుచుకుంటున్నాయి. 

రాజకీయాలపైనా ప్రభావం..

రాజకీయ రంగంపైనా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఆందోళనలు, ఉద్యమాలు, సభలు, సమావేశాలతో అధికార, విపక్షపార్టీల మాటలయుద్ధాలు సాగే ఉమ్మడిజిల్లాలో కొంతకాలం నేతలంతా సైలెంట్‌ అయ్యారు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో స్వచ్ఛందసంస్థలతో కలిసి పేదలకు, కరోనాబారిన పడినవారికి పోటాపోటీగా సేవలందించారు. నిత్యావసరాలు, కూరగాయలు అందజేశారు. ఏడాది ప్రారంభంలో డీసీసీబీ, డీసీఎంఎస్‌కు ఎన్నికలు జరిగాయి. ఆతర్వాత కరోనా లాక్‌డౌన్‌తో రాజకీయం స్తబ్ధుగా మారింది. రాజకీయపార్టీలన్నీ వీడియోకాన్ఫరెన్సులు, ఆన్‌లైన్‌ సమావేశాలు, సభలు నిర్వహించాయి. 

అభివృద్ధి, సంక్షేమానికి విరామం..

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విరామం వచ్చింది. కరోనా కాలం కావడంతో అధికారులు శాఖపరమైన కార్యక్రమాలకు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వ నిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల కోటా సొమ్ములను కరోనా సేవలకు మళ్లించడంతో పనులు స్తంభించాయి. ఆ తర్వాత కొంతకాలానికి కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వశాఖలు విధులను ప్రారంభించాయి. ఇంజనీరింగ్‌ శాఖల్లో నిధులున్నా పనులకు ఇబ్బందులు తలెత్తాయి. సుమారు రూ.15వేల కోట్లతో చేస్తున్న సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం మందగించింది. కానీ ఖమ్మంలో ఆగిన ఐటీహబ్‌ పనులు మంత్రి పువ్వాడ చొరవతో వేగం పుంజుకున్నాయి. ఇటీవల ఆ పనులు పూర్తవడంతో ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఖమ్మంతోపాటు కొత్తగూడం, సత్తుపల్లి, వైరా, మధిర, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ పట్టణాల్లో ఆగిన అభివృద్ధి పనులు పునఃప్రారంభయ్యాయి. మరోవైపు నిర్మాణ రంగం కూడా గాడిన పడింది. 

Updated Date - 2020-12-29T05:14:45+05:30 IST