కరోనాతో భద్రగిరికీ క(న)ష్టం.. వైరస్‌ భయంతో తగ్గిన భక్తుల రాక

ABN , First Publish Date - 2020-12-31T05:08:43+05:30 IST

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం భద్రాద్రి దేవస్థానంపైనా తీవ్రంగానే పడింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దేవస్థానం ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

కరోనాతో భద్రగిరికీ క(న)ష్టం.. వైరస్‌ భయంతో తగ్గిన భక్తుల రాక
భద్రాచలం రామాలయం వ్యూ, ఈ ఏడాది రామాలయ ప్రాంగణంలో జరిగిన నవమి కల్యాణం

కొన్ని నెలలుగా అంతరంగికంగానే రామయ్యకు సేవలు

నిరాడంబరంగా సాగిన ప్రధాన ఉత్సవాలు

భారీగా పడిపోయిన దేవస్థానం ఆదాయం 

భద్రాచలం, డిసెంబరు 30: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం భద్రాద్రి దేవస్థానంపైనా తీవ్రంగానే పడింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో దేవస్థానం ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. మార్చి నెలాఖరు నుంచి నుంచి జూన్‌ మొదటి వారం వరకు కరోనా లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో రామయ్యకు నిర్వహించే సేవలన్నీ ఏకాంతంగానే సాగాయి. దేవస్థానంలో జరిగే శ్రీరామనవమి, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు లాంటి ప్రధాన వేడుకలన్నీ నిరాడంబరంగా జరిగాయి. దేవస్థానంలో పనిచేసే వైదిక పరిపాలనా సిబ్బందిలో సుమారు 16మంది కరోనా బారిన పడి ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది భద్రాద్రికి ప్రముఖులు, భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆదాయం భారీగా పడిపోయింది. రామాలయ పరిసరాల్లో చిరు వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబరు ముగిసే నాటికి దేవస్థానం ఆదాయంలో భారీ లోటు ఏర్పడినట్టు దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సాధారణంగా దేవస్థానం వార్షికాదాయం రూ.26 కోట్ల వరకు ఉంటుండగా 2020లో జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.11.86కోట్లు మాత్రమే ఆదాయం సమకూరింది. ప్రతినెలా హుండీల ద్వారా వచ్చే ఆదాయంలోనూ భారీ వ్యత్యాసం కనిపించింది. సాధారణ రోజుల్లో ఒకనెలకు సగటున రూ.60 నుంచి రూ.70లక్షలు ఆదాయం సమకూరేది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో ఆరు నెలలకు కేవలం రూ.60 లక్షలే సమకూరింది. ఇదిలా ఉండగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో 50 నవమి  కల్యాణాలను నిర్వహించి ప్రధాన అర్చకుడిగా ఉద్యోగ విర మణ చేసిన కోటి రామకృష్ణమాచార్యులు ఈ ఏడాది  మృతి చెందారు. అలాగే భద్రాద్రి దేవస్థానానికి మూడుసార్లు పాలకమండలి చైర్మన్‌గా పని చేసిన అల్లూరి మూర్తిరాజు ఈ సంవత్సరమే మృతి చెందారు.

 తగ్గని వ్యయం  

భద్రాద్రి దేవస్థానానికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నా వ్యయం మాత్రం ఎప్పటిలాగే ఉండటం గమనార్హం. దేవస్థానం ఉద్యోగులకు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందికి ప్రతి నెల రూ.కోటి వరకు జీతాల కోసం వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఉద్యోగులు, సిబ్బంది జీతాల చెల్లింపు కోసం ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానానికి చెందిన రూ.6కోట్ల ఫిక్సిడ్‌ డిపాజిట్లను విత్‌డ్రా చే సి జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. అలాగే ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు సైతం గతంతో పోలిస్తే కొంత మేరకు తగ్గినా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు సుమారు రూ.80లక్షల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఖర్చులు ఏమాత్రం తగ్గకున్నా ఆదాయం అదేస్థాయిలో రాకపోవడంతో దేవస్థానం ఆర్ధికభారంను ఎదుర్కొంటోంది. భద్రాద్రి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2020 సంవత్సరంలో దేవస్థానం ఆర్థికంగా తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కోవలసి వచ్చిందని దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2021లో అయినా దేవస్థానం ఈ ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కాలని రాముడిని ప్రార్ధిస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.

నిరాడంబరంగా ఉత్సవాలు

భద్రాద్రా రామాలయంలో ఈ సంవత్సరం శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు నిరాడంబరంగానే నిర్వహించారు.  వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఆంతరంగికంగా నిర్వహిస్తామని అధికారులు ప్రకటించినా ఆచరణలో మాత్రం విఫలమై విమర్శల పాలయ్యారు.  దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే దమ్మక్క సేవా యాత్ర, శబరి స్మృతి యాత్రలు, పవిత్రోత్సవాలు ఆంతరంగికంగానే నిర్వహించారు. 

తలనీలాలపై ప్రభావం

భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే అనేకమంది భక్తులు తలనీలాల మొక్కు చెల్లించుకుంటారు. కానీ కరోనా ఆంక్షలకు అనుగుణంగా మార్చి 21 నుంచి నవంబరు 11 వరకు  కల్యాణకట్టను మూసివే శారు. సాధారణ రోజుల్లో కల్యాణకట్టలో రోజుకు 600 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించేవారు. కానీ నవంబరు 12న పున:ప్రారంభమైన తరువాత రోజుకు 200మంది మాత్రమే తలనీలాలు సమర్పించుకుంటున్నారు. ఇలా అన్ని విధాలుగా కరోనా ఎఫెక్ట్‌ భద్రాద్రి రామాలయంపై చూపింది. 

Updated Date - 2020-12-31T05:08:43+05:30 IST