సమాజ దివిటీ.. కవిత్వం

ABN , First Publish Date - 2020-03-21T06:20:26+05:30 IST

కాలం ఏదైనా కవిత్వం యువతను ఆకర్షిస్తూనే ఉంది. కలం తన భావాలను వెదజల్లుతూనే ఉంది. దోపిడీపై ఎలుగెత్తిన విప్లవ కవిత్వం, అంటరానితనంపై ...

సమాజ దివిటీ.. కవిత్వం

నేడు ప్రపంచ కవితా దినోత్సవం

ఖమ్మం అర్బన్‌, మార్చి 20: కాలం ఏదైనా కవిత్వం యువతను ఆకర్షిస్తూనే ఉంది. కలం తన భావాలను వెదజల్లుతూనే ఉంది. దోపిడీపై ఎలుగెత్తిన విప్లవ కవిత్వం, అంటరానితనంపై మండిపడ్డ దళిత కవిత్వం, స్త్రీ సమానత్వాన్ని కాంక్షించే స్త్రీవాద కవిత్వం, జాతీయ భావాలను ప్రోధిచేసిన జాతీయో ద్యమ కవిత్వం.. నిరసన గళాన్ని వినిపించిన దిగంబర కవిత్వం... కాలం పొడవునా తన చేవ్రాలు చెక్కుతూనే ఉంది. 


‘రవిగాంచని చోటును కవి గాంచును’.. సమాజంలో కవికి గల సముచిత స్థానానికి ఈ వాక్యం చక్కని ఉదాహరణ. కవి సూక్ష్మ గ్రహి అని ప్రతీ విషయంపై అవగాహన కలిగి ఉంటాడని, సూర్యుడి దృష్టి సోకనివి సైతం కవి దృష్టికి వస్తాయని అర్థం.. సమా జానికి దారి దివిటీగా వ్యవహరిస్తూ.. ప్రజల ను జాగృత పరచడంలో కవికిగల బాధ్యతను సైతం ఈ వాక్యం వ్యక్తపరుస్తోంది. వివిధ దినోత్సవాల తీరుగానే కవిత్వానికి ఒక ప్రత్యేక దినోత్సవం ఉంది. కాలమంతా కవిత్వమే అయినా మార్చి 21ని అంతర్జాతీయంగా కవితా దినోత్సవంగా జరుపుకొంటుండటం కవిత్వానికి గల విశ్వ ఆదరణకు నిదర్శనం. గురజాడ అప్పారావు, శ్రీరంగం శ్రీనివాసరావు వంటి వారు మహాకవులనే కీర్తిగడించారు. 


పలు రకాల కవిత్వం..

కవిత్వం సాహిత్య ప్రక్రియలో ఒక విధానమైనా.. ప్రత్యేకించి కవిత్వంలో సైతం అనేక రీతులు, విభాగాలు, శైళులు ఉన్నాయి.. రచించే కవిత్వం ఆధారంగా కవులను వర్గీకరి స్తారు. దిగంబర కవులు, విప్లవ కవులు, భావ కవులు, నయాగార కవులు, చేతనావర్తన కవులు, అనుభూతి కవులు, స్త్రీవాద కవులు, దళితవాద కవులు, ముస్లిం, మైనార్టీ వాద కవులు,  భారత కవులు, రామాయణ కవులు, జంట కవులు, శివ కవులు, ప్రబంధ కవులు, జాతీయోద్యమకవులు, పద కవులు, శతక కవులుగా గుర్తింపబడుతున్నారు.


తరగని ఆదరణ..

కవిత్వం తరగని ఆదరణ సంతరించుకుంటూ ఎప్పటి కప్పుడు నవ్యపోకడలతో సాగుతుండటమే కాక అన్ని దశాబ్దా ల్లోనూ నూతన కవులను సొంతం చేసుకుంటోంది. సాహిత్యంలో భాగమైన కవిత్వ విధానం పట్ల అన్ని కాలాల యువత ఆసక్తి కనబరుస్తూనే ఉంది. విశ్వవిద్యాలయాలు కవిత్వానికి పట్టుగొమ్మలుగా విరాజిల్లుతుండటంతో అభ్యు దయ, చైతన్యవంతమైన కవిత్వం సామాజిక ప్రయోజనాల కోణంలో ఆవిష్కృతమవుతోంది. కవితా దినోత్సవాన్ని పురస్క రించుకొని పలువురు కవుల అభిప్రాయాలు... 


కవిత్వం.. ఒక అనివార్య సంభాషణ : డాక్టర్‌ సీతారాం, కాళోజీ అవార్డు గ్రహీత

కవిత్వం ఒక అనివార్య సంభాషణ. ప్రతి హృదయం ఒక ప్రచురించని కవితా సంపుటి స్పందన, ప్రతిస్పందన, సంవేదన, సహానుభూతి, కలిగిన ప్రతి మనిషి ఒక మహాకవి. మాటలను బయటికి చెప్పుకోలేక కన్నీటిని వొంపలేక, పొంగుకొచ్చే దుఃఖాశ్రువులను కొంగు అడ్డం పెట్టుకొని కుమిలే తల్లులంతా కవులే. వచ్చీరాని భాష భావాల పిల్ల లంతా కవులే. కవిత్వం కాని చోటు ఏదీ లేదు. కవులు లేని సమాజానికి అర్థం లేదు. కవులున్నచోట శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. మనిషిని మరో మనిషితో కలిపి కుట్టే కన్నీటి దారమే కవిత్వం.


కవులు.. సామాజిక శాస్త్రవేత్తలు: ప్రసేన్‌, కవి, జర్నలిస్ట్‌..

కవులు అసలు సిసలైన సామాజిక శాస్త్రవేత్తలు. ప్రాపంచిక ఎత్తుపల్లాలను సవరించటంలో అర్థరహిత భావోద్వేగాలను నియంత్రించటంలో కవుల పాత్ర పెద్దది. సమాజ మార్గ నిర్దేశనంలో కవుల భాగస్వామ్యం అధికం. కదిలే సమాజపు రూట్‌ మార్కర్లుగానూ టార్చ్‌ బియర్లుగానూ కవులు నడుస్తారు. కవులు సమాజ రుగ్మతలను అంతం చేసేందుకు తగిన పరిష్కారాల పనిలో ఉంటారు. 


జీవితం నిత్య కవిత్వం: ఎంవీ రమణ, యువ కవి

ప్రపంచమొక పద్మవ్యూహం. కవిత్వమొక తీరని దాహం.. అని మహకవి శ్రీశ్రీ అన్నట్టుగా ప్రపంచం నిండా కవిత్వం నిబిడీకృతమై ఉంది. జీవితానికి జీవన అనుభవానికి ఆలంబన కవిత్వమే. సంక్ష్లిష్ట సమాజాన్ని అర్థం చేసుకోవటానికి  అవ సరమైన సాధనం కవిత్వమే. నిద్రాణమైన జాతిని, మనిషిని మేల్కొల్పడానికి సరైన సాధనం కవిత్వమే. మనిషిని మనిషిగా మిగిల్చేది కవిత్వమే. ప్రతి అనుభవం కవితాక్షరాల సజీవతకు దర్పణం.


కవిత్వం సౌందర్యాత్మక కళాఖండం : ఇబ్రహీం నిర్గున్‌, యువ కవి...

కవిత్వం మానవ అనుభూతుల నైసర్గిక కల్పనతో జనించే ఒక సౌందర్యాత్మక కళాఖండం.. కవి హృదయంలోని స్వాభావిక భావోద్వేగం ఒక అలజడిని ఒక యుద్ధ భీభత్సాన్ని సృష్టించుకొని పదాలు, వాక్యాలు ప్రవాహమై పోటెత్తుతాయి.. బాధితుల, ఆక్రోషితుల, అసహాయుల, అభాగ్యులకు నేనున్నానని నిండుగ పలికే స్వరమే కవిత్వం.. కాలం కంట తడి పెట్టినప్పుడల్లా.. కన్నీరు కవి కలంలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు వెలువడే వాక్యాలే కవిత్వం.. కవిత్వం సమాజపు ఆస్తి. కవిత్వంతోనే సామాజిక ప్రగతి.. ప్రతి కవి ఒక స్వచ్ఛంధ సైనికుడు.

Updated Date - 2020-03-21T06:20:26+05:30 IST