నెలాఖరు వరకు లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-23T10:09:30+05:30 IST
నెలాఖరు వరకు లాక్‌డౌన్

- పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం
- తెల్లకార్డు ఉన్న కుటుంబానికి రూ.1500 సహాయం
- అత్యవసర సేవలకే పరిమితం
- నిత్యావసర షాపులకు అనుమతి
- విధుల్లో రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఎలక్ర్టిసిటీ, పబ్లిక్‌హెల్త్, మీడియా
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం): కరోనా వైర్‌సను కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కేంద్ర ప్రభుత్వం కరోనా పాజిటివ్ నమోదైన జిల్లాలను లాక్‌డౌన్‌లో ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాలకు లాక్‌డౌన్ ప్రకటించి ఈనెల 31వరకు ఎవరి ఇంటిలో వారు ఉండాలని స్వీయనియంత్రణ పాటించాలని ఆదేశించింది.దీంతోఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే నిత్యావసర దుకాణాలకు అనుమతి ఉంటుంది. అలాగే అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం ఉచితంగా పంపిణీచేయనున్నారు.కార్డు ఉన్న కుటుంబాలకు రూ.1500లు కూడా సహాయం అందించనున్నారు.
రెవెన్యూ, పోలీసు, ఫైర్, హెల్త్, ఎలక్ర్టిసిటీ, పబ్లిక్‌హెల్త్, మీడియా తదితర శాఖల ఉద్యోగులు, అధికారులు విధులు నిర్వహించాలి. వీరికిమాత్రమే తిరిగేందుకు అనుమతి ఉంటుంది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అనుమతి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. ఈనెల,వచ్చేనెలలో ప్రసవం కావాల్సిన గర్భిణీల జాబితాలు పరిశీలించి కాన్పుల తేదీలను దృష్టిలో ఉంచుకుని వారిని ముందుజాగ్రత్తగా ఆసుపత్రికి తరలించనున్నారు.ఇందుకు అమ్మవడి వాహనాలు వాడనున్నారు. కరోనా అనుమానితులు, వచ్చిన వారికి, అత్యవసర వైద్యం అవసరమైన వారికి మాత్రమే ప్రభుత్వాసుపత్రిలో సేవలందుతాయి.
అత్యవసరం కాని సర్జరీలు వాయిదా వేయాలని ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు సూచించింది. కూరగాయలకు, నిత్యావసర వస్తువులు వెళ్లినప్పుడు ఐదుగురికి మించి ఉండకూడదని సూచించారు. దూరం పాటించాలని తెలిపారు. నెలాఖరు వరకు ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు నిలిపివేస్తామని ప్రకటించారు. జిల్లాకు సరిహద్దు చెక్‌పోస్టుల్లో మరింత పకడ్బందీగా కర్ఫ్యూ నిర్వహించనున్నారు. సరిహద్దులన్ని 31వరకు మూసివేయనున్నారు. ఇంటర్ పరీక్షపత్రాల వాల్యుయేషన్ 31వరకు వాయిదా వేశారు. స్వచ్ఛందంగా లాక్‌డౌన్ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు.