జయహో జనతా

ABN , First Publish Date - 2020-03-23T10:08:42+05:30 IST

జయహో జనతా

జయహో జనతా

  • ఎక్కడి జనం అక్కడే
  • వ్యాపారసంస్థలు మూత
  • నిర్మానుష్యంగా రహదారులు
  • ఉమ్మడి జిల్లాలో కర్ఫ్యూ విజయవంతం
  • పర్యవేక్షించిన ఉన్నతాధికారులు


(ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం)/ఆంధ్రజ్యోతి కొత్తగూడెం: కరోనా మహమ్మారిని ఖతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన జనతాకర్ఫ్యూ ఉమ్మడి జిల్లాలో ఆదివారం  విజయవంతమైంది. పగలు, రాత్రీ జనం, వాహనాలతో రద్దీగా ఉండే రహదారులు వెలవెలబోయాయి. ఎక్కడి జనం అక్కడ, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది.. పిల్లలు, పెద్దలు, గృహాలకు పరిమితం అయ్యారు. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ, రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. సా యంత్రం 5గంటలకు ఇళ్ల వద్ద ఎవరికి వారు చప్పట్లతో కరోనా నివారణకు మేము సైతం అంటూ సంఘీభావం ప్రకటించారు. 


రహదారులన్నీ నిర్మానుష్యం

జనతాకర్ఫ్యూ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచి బంద్‌ వాతావరణం నెలకొంది. ఖమ్మం నగరం, మధిర, సత్తుపల్లి, వైరా, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు పట్టణాలు, మండల కేంద్రాల్లో కర్ఫ్యూ సాగింది. ఆంద్రాకు సరిహద్దు రహదారులను పూర్తిగా మూసివేశారు. ఆంధ్రా నుంచి ఎవరినీ అనుమతించలేదు. వాహనాలు కూడా రానీవలేదు. పెనుబల్లి మండలం ముత్తగూడెం, ఎర్రుపాలెం అంతరరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, వైద్య సిబ్బంది నిఘా ఏర్పాటు చేశారు. రాకపోకలు లేకుండా రహదారులు మూసివేశారు. 


మధిర మండలం దేశినేనిపాలెం, ముదిగొండ మండలం వల్లబి, బోనకల్‌తోపాటు పలు చోట్ల కూడా ఆంద్రా-తెలంగాణ మధ్య సరిహద్దులను మూసివేశారు. ఖమ్మం నగరంలో పోలీసులు అన్నీ రహదారుల్లో బందోబస్తు నిర్వహించారు. వాహనాలపై ఎవరైనా వస్తే వారిని వెనక్కి పంపించారు. ఖమ్మం బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, బైపా్‌సరోడ్‌, మయూరిసెంటర్‌, కలెక్టరేట్‌ ఇతర ప్రధాన రహదారుల్లో జనసంచారం కనిపించలేదు. ఖమ్మం రీజియన్‌ పరిధిలో 630 ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ, ప్రైవుటు వాహనాలు, లారీలు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఖమ్మంలో నిరంతరం పనిచేసే గ్రానైట్‌ పరిశ్రమ వెలవెలబోయింది. దీంతో రెండు వేల మది కార్మికులు విధులకు హాజరుకాలేదు. 450 స్లాబ్‌ పరిశ్రమలు, 150టైల్స్‌ పరిశ్రమలు, 250 గ్రానైట్‌ క్వారీలు మొత్తం మూతపడ్డాయి.


ఆసుపత్రులకు కూడా అత్యవసర ఇబ్బందులున్న వారు మాత్రమే వచ్చారు. మెడికల్‌షాపులు కొన్నిమాత్రమే తీశారు. ఆదివారం అయినప్పటికీ చికెన్‌, మటన్‌, చేపల దుకాణాలన్నీ మూసివేశారు. దూరప్రాంతాలనుంచి విజయవాడ మీదు గా వెళ్లే రైళ్లు కొన్ని రావడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ వద్ద ఉండిపోగా దగ్గరి గ్రామాల ప్రజలు స్వగ్రామాలకు వెళ్లారు.


జనతాకర్ఫ్యూ సందర్భంగా ఖమ్మంలోని జూబ్లీక్లబ్‌ సమీపంలో రెవెన్యూ సిబ్బంది విధులకు వస్తుండగా పోలీసులు అడ్డుకుని దుర్భాషలాడడంతో రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసనతెలిపారు. ట్రాఫిక్‌ ఏసీపీ రామోజీరమేష్‌ విచారణకు ఆదేశించడంతో నిరసన విరమించారు. జిల్లాకలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌తోపాటు జిల్లా అధికారులు తమ నివాసాలనుంచే జనతాకర్ఫ్యూను పర్యవేక్షించారు. సాయంత్రం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ సీపీలు చప్పట్లుకొట్టి కర్ఫ్యూలో పాలుపంచుకున్నారు. కర్ఫ్యూకు సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. 


భద్రాద్రి జిల్లాలో..

 కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి ఏరియాల్లోని బొగ్గు బావుల్లో సైతం జనతా కర్ఫ్యూను సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయిలో అమలు చేసింది. దీంతో మూడు ఏరియాల్లో సింగరేణి బొగ్గు బావులు, ఓపెన్‌ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి జరగలేదు. పాల్వంచ కేటీపీఎస్‌, ఎన్‌ఎండీసీ, నవభారత్‌ వద్ద కర్ఫ్యూ వల్ల ఆయా ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా మారాయి. అయితే అత్యవసర సర్వీసుల ఉద్యోగులు హాజరై విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించి చర్ల, అశ్వారావుపేట ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను సైతం మూసివేశారు. జనం స్వంచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావడంతో పల్లె, పట్టణ రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారాయి. జిల్లాలోని గనుల ద్వారా రోజుకు 50వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కర్ఫ్యూతో ఉత్పత్తి నిలిచిపోయింది. కర్ఫ్యూ మూలంగా జిల్లాలో సుమారు 10వేల మంది కార్మికులు విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గుబా వులన్నీ వెలవెలబోయాయి.

Updated Date - 2020-03-23T10:08:42+05:30 IST