‘లెఫ్ట్ రైట్’ కరోనా
ABN , First Publish Date - 2020-03-23T09:55:36+05:30 IST
జనతాకర్ఫ్యూపై అవగాహన లేని ఛత్తీస్‌గఢ్ వాసులు ఆదివారం ఖమ్మంలో దిక్కుతోచని స్థితిలో...

దిక్కుతోచని స్థితిలో ఛత్తీస్‌గఢ్ వాసులు
ఖమ్మం అర్బన్,మార్చి22: జనతాకర్ఫ్యూపై అవగాహన లేని ఛత్తీస్‌గఢ్ వాసులు ఆదివారం ఖమ్మంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చెన్నై నుంచి భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లే క్రమంలో వారు ఆదివారం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో దిగారు. అయితే భద్రాచలం వైపు వెళ్లేందుకు బస్సులు, ఇతర వాహనసదుపాయాలేవీ లేవని తెలియడంతో వారు ఎలా వెళ్లాలో అర్థకం కాక అయోమయానికి గురయ్యారు. చివరకు ఎలాగైనా తమ ఇళ్లకు వెళ్లాలన్న ఉద్దేశంతో కాలినడకన భద్రాచలం వైపు పయనమయ్యారు.
ప్రవాసభారతీయులకు ముద్ర
కూసుమంచి, మార్చి 22: సౌదీ నుంచి ఒక యువకుడు కూసుమంచికి వచ్చాడు. దక్షిణాఫ్రికా నుంచి మరో యువకుడు చేగొమ్మకు వచ్చాడు. దీంతో ఆదివారం రెవిన్యూ సిబ్బంది సమాచారం తెలుసుకుని వాళ్ల నివాసాలకు వెళ్లి ప్రభుత్వ ఆదేశాలమేరకు మ్దుర్లు వేశారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ నెల రోజుల వరకు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. ఆరోగ్యం పట్ల శ్రద్దవహించాలని సూచించారు. ఏమాత్రం అనుమానాలున్నా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. జనాల్లో తిరగవద్దని సూచించారు.
అనుక్షణం పోలీసుల పర్యవేక్షణ
ఖమ్మంక్రైం, మార్చి22: జనతాకర్ఫ్యూ పోలీసుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాలలో ప్రధాన కూడళ్లలో కర్య్ఫూలో భాగంగా రోడ్లంతా పోలీసులు మూసివేశారు. ఎవరైనా రోడ్లపైకి వస్తే వివరాలు అడిగి రోడ్లపైకి రాకూడని అవగాహన కలిపించారు. ట్రాఫిక్‌పోలీసులు ఫ్లకార్డులతో పలుప్రధాన కూడళ్లలో ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లాలోని 600 మందికిపైగా పోలీసు సిబ్బంది, బ్లూకోర్టు వాహనాలతో పోలీసు సిబ్బంది పలు వీధులలో పర్యవేక్షించారు. బస్టాండ్, ఇల్లెందుక్రాస్‌రోడ్ ప్రాంతాలలో టౌన్ ఏసీపీ గణేష్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీరమేష్ రోడ్లపైకి వచ్చిన వాహనాలు తనిఖీ చేశారు.
రోడ్లపైకి ఎవరూ రాకుండా ఉండేందుకు లారీలతో ఎన్టీఆర్ సర్కిల్, శ్రీశ్రీసర్కిల్, రాపర్తినగర్ బ్రిడ్జివద్ద, కాల్వొడ్డు బ్రిడ్జి ప్రాంతాలలో లారీలను రోడ్డకు అడ్డంగా పెట్టి రోడ్లను మూసివేశారు. కొంతమంది విద్యార్థులు, కార్లతో, ద్విచక్రవాహనాలతో రోడ్లపైకి వస్తే వారి వద్దనుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ స్టేషన్‌కు తరలించారు. నగరంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్న 100సీసీకెమేరాలతో జనతాకర్ఫ్యూను ప్రత్యేక అధికారులు పరీక్షించారు. వన్‌టౌన్, టుటౌన్,త్రీటౌన్, మహిళ పోలీసు స్టేషన్ ముందు అధికారులు సిబ్బంది చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు.