సీవోడీ దిశగా బీటీపీఎస్‌

ABN , First Publish Date - 2020-03-21T06:23:39+05:30 IST

మణుగూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంలో జెన్కో శుక్రవారం ఒక మైలురాయిని అధిగమించింది. 2019లో యూనిట్‌-1 సింక్రనైజేషన్‌ను పూర్తి చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి సీవోడీ కోసం పరుగులుపెడుతున్న...

సీవోడీ దిశగా బీటీపీఎస్‌

  • లక్ష్యాన్ని సాధించిన యూనిట్‌-1 
  • 279 మెగావాట్ల విద్యుదుత్పత్తి
  • జెన్కో, బీటీపీఎస్‌ అధికారుల్లో ఉత్సాహం 
  • కమర్షియల్‌ అన్‌ డే సిద్ధమవుతున్న జెన్కో అధికారులు

మణుగూరురూరల్‌, మార్చి 20: మణుగూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ నిర్మాణంలో జెన్కో శుక్రవారం ఒక మైలురాయిని అధిగమించింది. 2019లో యూనిట్‌-1 సింక్రనైజేషన్‌ను పూర్తి చేసుకుని విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించి సీవోడీ కోసం పరుగులుపెడుతున్న విషయం విధితమే. విద్యుదుత్పత్తి ట్రయల్‌లో భాగంగా తొలుత ఆయిల్‌ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించిన జెన్కో అధికారులు జనవరి నుంచి సింగరేణి నుంచి బొగ్గును వినియోగించి ఉత్పత్తిని చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రోజుకు 150, 170 మెగావాట్ల చొప్పున యూనిట్‌-1లో విద్యుదుత్పత్తి సామార్థ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చిన అధికారులు యూనిట్‌ లక్ష్యమైన 270మెగావాట్ల విద్యుదుత్పత్తిని శుక్రవారం అధిగమించారు. యూనిట్‌-1 లక్ష్యం 270 మెగావాట్ల ఉత్పత్తి సామార్థ్యం ప్రతిరోజు సాధించేలా కృషి చేస్తూ పరీక్షించనున్నారు. నిలకడగా లక్ష్యాన్ని సాధించడం ప్రారంభంకాగానే కమర్షియల్‌ అన్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జెన్కో అధికారులు సిద్ధమవుతున్నారు. గతేడాది డిసెంబరు చివరివారంలో సీవోడీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉండగా.. బీహెచ్‌ఈఎల్‌ నుంచి సబ్‌ కాంట్రాక్ట్‌గా పనులు నిర్వహించేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్న ఏజెన్సీలు సక్రమంగా పనిచేయక పోవడం, లేబర్‌ కొరత, సీవోడీ కార్యక్రమం ఆలస్యమవడానికి కొంతకారణంగా తెలుస్తోంది.


ఏది ఏమైనా అధికారులు ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా కార్యాచరణను చేపట్టారు. డైరైక్టర్‌ ఆపరేషన్స్‌ సచ్చిదానందం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి పనులను పర్యవేక్షించడంతోపాటు యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పాదనను పరిశీలిస్తున్నారు. ఎట్టకేలకు మణుగూరు భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌ యూనిట్‌-1 నుంచి 270మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగడం అధికారుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సందర్భంగా బీటీపీఎస్‌ సీఈ బాలరాజు మాట్లాడుతూ కోల్‌ వెసులుబాటును చూసుకుని అతి త్వరలోనే సీవోడీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు కార్యాచరణను చేపట్టినట్టు తెలిపారు. యూనిట్‌-2లో కూడా శుక్రవారం సాయంత్రం లైటప్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, లైటప్‌ చేసిన వందరోజుల తర్వాత యూనిట్‌-2 సింక్రనైజేషన్‌ను చేపడతామని సీఈ తెలిపారు.

Updated Date - 2020-03-21T06:23:39+05:30 IST