ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు మూత
ABN , First Publish Date - 2020-03-23T10:12:11+05:30 IST
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు మూత

సత్తుపల్లిరూరల్ మార్చి22: జనతా కర్ఫ్యూ కారణంగా ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతాన్ని పోలీసులు మూసివేశారు. వాహనాల రాకపోకలను నిలిపివేసి వారికి కనీస అవసరాలను పోలీసులు సమకూర్చి ఔదార్యం చాటుకున్నారు. కూరగాయలు, కోళ్లు, చేపలు, గుడ్లు, ఇతర అత్యవసర సరుకుల వాహనాలను మాత్రం వదిలేశారు. మండలంలోని మేడిశెట్టివారిపాలెం వద్ద కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ చేరుకుని వాహనాల రాకపోకలను ఆపివేసినట్లు తెలిపారు. దీంతో రెండు కిలోమీటర్లకు పైగానే సరిహద్దులో వాహనాలు నిలిచిపోయాయి.
వాహనాల రాకపోకలు బంద్
రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్యుల ప్రకారం ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు నిషేదించినట్లు ఎంవీఐ దారా మనోహర్ ఆదివారం తెలిపారు. వారం రోజుల పాటు అత్యవసర సేవలకు సంబంధించి వాహనాలను మినహా ఇతర వాహనాలను అనుమతించేది లేదని, ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
ఎక్కడి వారు అక్కడే
పెనుబల్లి: జనతా కర్ఫ్యూని పురస్కరించుకొని తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లోని పెనుబల్లి మండలం ముత్తగూడెం వద్ద గ్రామం జాతీయ రహదారి 30పై ఆదివారం పోలీసులు, ఆర్టీఐ అధికారులు రహదారిని మూసివేశారు. దీంతో ఆంధ్రా నుంచి తెలంగాణలోకి, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్లే లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు కోవిడ్-19వైరస్‌ను ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూ పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం 7గంటల నుంచి రహదారి వద్ద సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్, రూరల్ సీఐ తాటిపాముల కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీస్‌బందోబస్తును ఏర్పాటుచేసి రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేయించారు.
ఆంధ్రా నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దు వద్ద నిలిపివేసి వెనక్కుపంపించివేశారు. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ చెక్‌పోస్టును ఆర్డీవో శివాజీ, కల్లూరు ఏసీపీ ఎన్.వెంకటేష్ పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద వైద్య, రెవెన్యూ, పీఆర్‌శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పహరాగా ఉన్నారు.