ఉస్మానియాకు ఖమ్మం బాలిక
ABN , First Publish Date - 2020-10-07T05:40:41+05:30 IST
తాను పనిచేస్తున్న ఇంటి యజమాని కుమారుడి చేతి అఘాయిత్యానికి గురై.. 70శాతం కాలిన శరీరంతో ఖమ్మం

మెరుగైన వైద్యం కోసం తరలింపు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన భట్టి
నిందితులను శిక్షించాలంటూ పలు సంఘాల ఆందోళన
రిమాండ్‌కు అత్యాచారయత్న ఘటన నిందితుడు
ఖమ్మం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తాను పనిచేస్తున్న ఇంటి యజమాని కుమారుడి చేతి అఘాయిత్యానికి గురై.. 70శాతం కాలిన శరీరంతో ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12ఏళ్ల ఖమ్మం బాలికను మెరుదైన వైద్యం కోసం మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సుమారు 17రోజులుగా ఖమ్మంలోని ఓ పైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి సాధారణ వైద్యచికిత్సలు అందించారు. సోమవారం విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే అధికారులు సోమవారం రాత్రికి ఆమెను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు పరిశీలించారు. అయితే 70 శాతం శరీరం కాలిపోవడంతో బాలిక చర్మం, శరీరంలోని పలు భాగాలు మడతలు వచ్చాయని, అందుకే ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు.
అక్కడి బర్నింగ్ వార్డులో మూడు సెక్షన్ల ప్టాస్టిక్ సర్జరీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే ఖమ్మం డీఎంహెచ్‌వో మాలతి ప్రైవేటు ఆసుపత్రికి బాలికను పరామర్శించి వివరాలు సేకరించారు. సదరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం మెడికో లీగల్ కేసుగా పరిగణించి పోలీసులకు, వైద్యశాఖకు ఎందుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదన్న కోణంలో విచారణ నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్‌వో ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మంగళవారు సదరు బాలిక కుటుంబసభ్యులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధులను కఠినంగా శిక్షిస్తే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ ఘటనను నిరసిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేవీపీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా, పీవోడబ్ల్యూ, పీడీఎస్‌యూ తదితర మహిళా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. పలు చోట్ల ‘కామంధుల పిశాచి’ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రిమాండ్‌కు నిందితుడు..
12ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. ఆమె ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలోని నిందితుడు ఎ.మారయ్యను ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. అతడిని మంగళవారం ఖమ్మం జిల్లా కోర్టులో హాజరుపరచగా 14రోజుల రిమాండ్ విధించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఖమ్మం పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, అత్యాచారయత్నం, పోక్సోయాక్ట్, బెదిరింపు చట్టాల్లోని ఐపీసీ 376, 511, 307, 354, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటు ఆ బాలికను పనిలో పెట్టుకున్న విషయమై విచారణ చేయాలంటూ పోలీసులు బాలకార్మికశాఖ, స్త్రీశిశు సంక్షేమ శాఖలకు సిఫారసు చేశారు.