కార్తీక విరామం
ABN , First Publish Date - 2020-11-26T04:25:56+05:30 IST
ఏటా కార్తీకమాసంలో కళకళలాడే పర్యాటకరంగం కరోనా నేపథ్యంలో ఇప్పుడు వెళవెళబోతుంది.

ఉమ్మడి జిల్లాలో కళతప్పిన పర్యాటకం
కొవిడ్-19తో ‘కార్తీక’ విహారాలకు బ్రేక్
వనభోజనాలు, పుణ్యక్షేత్రాలు సందర్శన లేనట్టే
ఖమ్మం, నవంబరు 25( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏటా కార్తీకమాసంలో కళకళలాడే పర్యాటకరంగం కరోనా నేపథ్యంలో ఇప్పుడు వెళవెళబోతుంది. సందడిగా ఉండాల్సిన ఉమ్మడి జిల్లాలోని పలు ప్రదేశాలు బోసిపోతున్నాయి. పాలేరునుంచి పర్ణశాల వరకు ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడం, భద్రాచల సీతారామ పుణ్యక్షేత్రం దర్శించుకుని పాపికొండలవరకు పర్యటించేందుకు పర్యాటకులు వచ్చేవారు. పాపికొండల సీజన్ ఉన్నప్పుడు ప్రతీరోజు సుమారు రెండు వేల మంది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలంనుంచి వెళ్లేవారు. భద్రాచల రామాలయ సందర్శనకు కూడా రోజూ పదివేల మందికిపైగా భక్తులు వెళ్లేవారు. కానీ కంటికి కనిపించని వైరస్ కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సందడి కరువైంది.
వ్యాపారం కుదేలు
పాపికొండల యాత్రకు కరోనా కంటే ముందు బోటు ప్రమాద సంఘటనతో బ్రేక్ పడింది. కూనవరం నుంచి పాపికొండల వరకు పెద్దసంఖ్యలో లాంచీల్లో పర్యాటకులు శ్రీరాంగిరి, పాపికొండలకు వెళ్లేవారు. సందర్శకులు లేకపోవడంతో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ భద్రాచలం తదితర పట్టణాల్లో హోటళ్లు రెస్టారెంట్లపై ప్రభావం పడింది. కార్లు, జీపులు,బస్సుల ప్రయాణాలు కూడా తగ్గాయి. కరోనా ప్రభావం ట్రావెల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. పర్యాటకంపై ఆధారపడి ఉన్న వ్యాపార రంగం కూడా వెలవెలబోతోంది.
వనభోజనాలకు బ్రేక్
కరోనా ప్రభావం కార్తీక వనభోజనాలపై కూడా చూపించింది. ఏటా కార్తీకమాస తరుణంలో కులసంఘాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, యూనియన్ల ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమం పట్టణాలు, మండల కేంద్రాల్లో నిర్వహించడం, సభలు, సమావేశాలు పెట్టడం జరిగేది. ఈఏడాది కరోనా నేపథ్యంలో వనభోజనాల కార్యక్రమం పూర్తిగా రద్దుచేసుకున్నారు. ఎక్కడా కూడా వనభోజనాల కార్యక్రమాలు చేయడంలేదు. ఎవరికి వారు సొంత ఇంటికి పరిమితం అవుతున్నారు. మొత్తంమీద కార్తీకమాసంతో పర్యాటక, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిపైనా కరోనా ప్రభావం కనిపిస్తుంది.