అడవి జల్లెడ

ABN , First Publish Date - 2020-04-08T10:05:27+05:30 IST

మావోయిస్టులు సంచరిస్తున్నారనే అనుమానంతో 2000 మంది పోలీసులు, మూడు జిల్లాల సరిహద్దు అడవుల్లో గత రెండు రోజులుగా గాలింపు చేపట్టారు.

అడవి జల్లెడ

‘కరోనా’ లాక్‌డౌన్‌ విధుల్లో పోలీసులు

ఇదే అదునుగా ఏజెన్సీలో దళాల సంచారం ?

మూడు జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం గాలింపు

బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ ప్రజలు

  

గుండాల/ఇల్లెందు టౌన్‌, ఏప్రిల్‌ 7: మావోయిస్టులు సంచరిస్తున్నారనే అనుమానంతో 2000 మంది పోలీసులు, మూడు జిల్లాల సరిహద్దు అడవుల్లో గత రెండు రోజులుగా గాలింపు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేతలైన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, భద్రు దళాలు ఛత్తీస్‌గఢ్‌ నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల సరిహద్దు అడవుల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు ఉప్పందడంతో, ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, పినపాక, కరకగూడెం, ఆశ్వాపురం, పాల్వంచ, ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట, మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం, పాఖాల సరిహద్దు అడవుల్లో పోలీసులు మావోల కోసం వేట ప్రారంభించారు.


నెల రోజులుగా మూడు జిల్లాల సరిహద్దు అడవుల్లోకి మావోలు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, కరకగూడెం మండలంలోని నీలాంద్రిపేట అడవుల్లో మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో మావోయిస్టులు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు, నెలరోజుల క్రితం సైతం అడవులను జల్లెడ పట్టారు. ప్రస్తుతం మళ్లీ మావోయిస్టుల సంచారం ఉన్నట్లు ఉప్పందుకున్న పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పోలీసులు ఆ విధుల్లో నిమగ్నమవ్వడంతో మావోయిస్టులు గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు మావోయిస్టు దళాలను మట్టు పెట్టాలన్న లక్ష్యంతో  పావులు కదుపుతున్నారు. దీంతో మారుమూల గ్రామాల్లో ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-08T10:05:27+05:30 IST