ఖమ్మం ఐటీహబ్‌తో కొత్త వెలుగు
ABN , First Publish Date - 2020-12-03T05:57:27+05:30 IST
ఐటీ హబ్‌తో ఖమ్మానికి కొత్త వెలుగులు రాబోతున్నాయని, ఈ ఐటీ హబ్‌ను ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రంగా రూపుదిద్దుతున్నాం
7న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాం
నగరాన్ని అభివృద్ధి గుమ్మంలా నిలిపేలా కృషి
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయం
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఐటీ హబ్‌తో ఖమ్మానికి కొత్త వెలుగులు రాబోతున్నాయని, ఈ ఐటీ హబ్‌ను ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ పాపాలాల్, కమిషనర్ అనురాగ్ జయంతి, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ జిల్లా ఇన్చార్జ్ గుండాల కృష్ణ, తదితరులతో కలిసి ఖమ్మం ఐటీహబ్ పనులను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మం ఐటీ హబ్‌లో ఉద్యోగాల కోసం ఐదువేల మంది దరఖాస్తులు చేసుకోవడం శుభపరిణామమన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్ది ఐటీతోపాటు డిగ్రీ, ఇతర చదువులు చదుకున్న వారికి ఆయా రంగాల్లో శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఐటీ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మొదటి దశగా నిర్మించిన ఈ ఐటీ హబ్‌ను ఈ నెల 7న మంత్రి కేటీఆర్‌తో ప్రారంభింపజేస్తున్నామని, ఇక్కడ ఉన్న డిమాండ్ మేరకు 7వతేదీన రెండోఫేస్కు కూడా శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అదే రోజు ధంసలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఎన్నెస్పీ వాక్‌వేలు, పోలీస్ కమిషనర్ కార్యాలయం, ఇతర అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఐటీ హబ్‌లో 16 కంపెనీలు ఏర్పాటవుతున్నాయని, 425 సీట్లు ఏర్పాట్లు చేశామని, ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా కృషిచేస్తున్నామన్నారు. ఐటీలో ఖమ్మం.. హైదరాబాద్ నగరంతో పోటీపడటంతో పాటు అభివృద్ధికి గుమ్మంగా తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు. ఖమ్మం కొత్తబస్టాండ్‌ను సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని, ఖమ్మం నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారం మరువలేనిదన్నారు. గోళ్లపాడు ఛానల్ పనులు పూర్తిచేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, పార్కుల ఏర్పాటుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఖమ్మం అభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని పార్టీలు తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని, ఖమ్మం ప్రజలు అభివృద్ధికి పట్టం గడతారని నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 60డివిజన్లుగా విభజించే ప్రక్రియ జరుగుతోందన్నారు.
నాపై జరిగింది దాడి కాదు.. హత్యాయత్నం : పువ్వాడ
జీహెచ్ఎంసీ పోలింగ్ రోజున బీజేపీ కార్యకర్తలు తనను చంపేందుకు దాడిచేశారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న మమత ఆస్పత్రి నుంచి వెతుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు తన కాన్వాయ్‌లోని కారును అడ్డగించి దాడిచేసి హతమార్చేందుకు చూశారని పేర్కొన్నారు. పోలింగ్ రోజున డబ్బులు పంచడానికి వచ్చానని బీజేపీ గోబెల్స్ ప్రచారం నిర్వహించిందని, దుబ్బాకలో అబద్ధాలు చెప్పి లబ్ధిపొందినట్టుగా జీహెచ్ఎంసీలోనూ గెలవాలని బీజేపీ ప్రయత్నించిందని.. కానీ అది వికటించిందన్నారు. అయితే బీజేపీ వారు తనపై దాడిచేస్తే సీపీఐ నాయకుడు ‘చికెన్’ నారాయణ ఎందుకు సమర్థించారో సమాధానం చెప్పాలన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందన్నారు. తాను కమ్యూనిస్టు బిడ్డనని ఎవరికీ భయపడేది లేదని, పార్టీ ఇచ్చిన ఏ పనినైనా ధైర్యంగా నిర్వహించడమే తన కర్తవ్యమన్నారు.