ఇసుక రవాణాపై పటిష్ఠ నిఘా
ABN , First Publish Date - 2020-12-04T04:52:03+05:30 IST
జిల్లాలో ఇసుక అక్రమరవాణపై గ్రామస్థాయిలోనే ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో పటిష్ఠ నిఘా పెట్టాలని, మండల స్థాయిలో తనిఖీ కమిటీలు ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

మండలస్థాయిలో తనిఖీ కమిటీలు
జనవరి నుంచి అభివృద్ధి వేగం
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పువ్వాడ
ఖమ్మం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : జిల్లాలో ఇసుక అక్రమరవాణపై గ్రామస్థాయిలోనే ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో పటిష్ఠ నిఘా పెట్టాలని, మండల స్థాయిలో తనిఖీ కమిటీలు ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు చోట్ల జరుగుతున్న ఇసుక, మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాపై పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్తావించారు. ఇందుకు స్పందించిన మంత్రి ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు ప్రభుత్వం నపకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, కేవలం అధికారులతోనే కాకుండా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఈ దందాను అడ్డుకోవాలని సూచించారు. ఇకపై మైనింగ్ రెవెన్యూ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో మండలస్థాయిలో తనిఖీ కమిటీలు, జిల్లాలో టాస్కుఫోర్సు బృందాలు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. సాయంత్రం 6గంటలలోపు మాత్రమే ఇసుక ట్రాక్టర్లు, లారీలకు అనుమతి ఉంటుందని, రాత్రివేళ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఖమ్మంలో కూడా టీఎస్ఎండీసీ ద్వారా ఇసుక కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయడం జరిగిందని, ఇళ్లకు ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రఘునాధపాఎం మండలంలో పేదలకు ఇచ్చిన ఇళ్లస్థలాల్లో కూడా క్వారీలు పెట్టి గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగించారని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కూడా పడివేశారని మంత్రి వివరించారు. ఇక 2020లో కొవిడ్ ఒక చాలెంజ్‌గా నిలిచిందని, దాన్ని ఎదుర్కొన్నామని, పూర్తిగా నివారించగలిగితే రాబోయే కొత్త ఏడాదిలో అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలకు సీడీపీ నిధులు కూడాలేవని, వచ్చే ఏడాదిలో సీడీపీ నిధుల ద్వారా కూడా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. జిల్లాలో ఆయాసంక్షేమశాఖల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని ప్రకటించారు. వైరా జడ్పీటీసీ సభ్యురాలు ప్రమీల మాట్లాడుతూ కనీసం 9,10 తరగతుల విద్యార్థులకైనా పాఠశాలలు ప్రారంభించాలని, గ్రామాల్లో పేదవర్గాలకు చెందిన పిల్లలు ఎన్ఆర్ఈజీఎస్ పనులకు వెళుతున్నారని దీంతో వారి చదువులు దెబ్బతింటున్నాయని, సమావేశంలో ప్రస్తావించారు. దీంతో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కొత్త ఏడాది జనవరినుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే విషయంపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ప్రస్తుతం పాఠశాలలు లేనందున అన్నిచోట్ల మరమ్మతులు చేపడుతున్నామన్నారు. స్ర్తీశిశుసంక్షేమశాఖ, అంగన్వాడీల నిర్వహణ, ధాన్యం కొనుగోలు, యాసంగి సాగు ప్రణాళిక, నీటి పారుదలశాఖ తదితర అంశాలపై చర్చించారు. మధిర, కల్లూరు మధ్య ఏపీలోని గ్రామాల మీదుగా బస్సులు పునరుద్ధరించాలని సూచించారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు మరణధృవీకరణపత్రాలు ఇచ్చే అధికారం లేదని పంచాయతీ గ్రామ కార్యదర్శులే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇసుక ట్రాక్టర రవాణా సమయంలో వాహనానికి అనుమతి పత్రాన్ని ఫ్లెక్సీగా తయారు చేసి పెట్కుటకోవాలన్నారు. ఎక్కడినుంచి ఎక్కడికపోతుందో వివరించాలని తెలిపారు. జిల్లాపరిషత్చైర్మన్ లింగాల కమల్‌రాజ్ మాట్లాడుతూ సభ్యులు ప్రస్తావించిన సమస్యలను అధికారులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు పక్కాభవనాలు, పిల్లలకు అందించే అంగన్వాడీ సామగ్రి, రహదారులపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని, తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రియాంక, అదనపు కలెక్టర్ స్నేహలత, తదితరులు పాల్గొన్నారు.