పంటల రక్షణకు వినూత్న ఆలోచన
ABN , First Publish Date - 2020-03-16T12:37:10+05:30 IST
రైతులు పంటలను పండించటం ఒక ఎత్తైతే వాటిని జంతువులు, పక్షుల నుంచి కాపాడుకొని ఇంటికి తెచ్చుకోవడం పెద్ద
పెనుబల్లి, మార్చి 15: రైతులు పంటలను పండించటం ఒక ఎత్తైతే వాటిని జంతువులు, పక్షుల నుంచి కాపాడుకొని ఇంటికి తెచ్చుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ తరుణంలోని ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన సానిక పాపయ్య అనే రైతు తమ పంటను కాపాడుకొనేందుకు వినూత్న ప్రక్రియను చేపట్టి విజయం సాధించి పలువురి రైతులకు ఆదర్శంగా నిలిచాడు.
పంటలను సాగుచేసేందుకు దుక్కి, విత్తనం, నాటడం ఆ తర్వాత కాపాడుకోవడం అనేక సమస్యలతోపాటు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికొచ్చే సమయంలో కోతులు, పక్షులు, అడవిజంతువులు పంటను నాశనం చేస్తుండటంతో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. పనికిరాని వస్తువులుగా భావించే ఖాళీ బీరుసీసా, అట్టముక్కలు, ఇనుప మేకు కర్రలో తాడు సహాయంతో గాలికి పంట కదిలితే బీరుసీసాకు మేకు తగిలి శబ్ధం వచ్చేవిధంగా ఏర్పాటుచేశాడు. ఈ తరహాలో పంట చుట్టూ సుమారు పది అడుగులకు ఒకటి చొప్పున ఏర్పాటుచేయటంతో గాలి వీస్తున్న సమయంలో చేను మొత్తం సీసాల శబ్ధం వస్తుండటంతో కోతులు, పక్షులు, అడవిజంతువులు అటువైపు రావడం మానేశాయి. ఈ ప్రయత్నం చేసి తాను చేను వద్ద ఉండకుండానే పంటను రక్షించుకోవడంలో పాపయ్య సఫలీ కృతులయ్యాడు. దీనివల్ల తనకు వేరే పనులకు వెళ్లే అవకాశం కలుగుతుందని గతంలో కోతులు, అడవిజంతువులు, పక్షులు పంటను నాశనం చేసేవని ఈ ప్రయత్నం చేయటం వల్ల ఈ శబ్ధాలకు చేను వైపు ఏమీ రావడం లేదని తెలిపాడు.
ఇదే తరహాలో మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటలను సాగుచేసుకోవచ్చునని రైతులు అడవి జంతువులకు భయపడి పంటలను సాగుచేయటం మానివేయోద్దని పాపయ్య చెపుతున్నాడు. రైతు పాపయ్య చేసిన వినూత్న ప్రయత్నాన్ని మండలంలోని పలు గ్రామాల రైతులు కూడా ఈ ప్రయత్నాన్ని చేపడతామని తెలుపుతున్నారు.
పంటను కాపాడుకొనేందుకు చేసిన ప్రయత్నం విజయవంతమైంది
తనకు రెండెకరాల భూమి చౌడారం అడవి సమీపంలో ఉందని భూమిలో ఏ పంటలు సాగుచేసినా అడవి జంతువులు, కోతులు పంటను ఇంటికి రానివ్వటం లేదని, ఈ దశలో బీరుసీసాకు ఇనుప మేకు తగలటంతో శబ్ధం వస్తున్న విషయాన్ని గమనించి సీసాకు మేకు తగిలేవిధంగా అట్టను ఏర్పాటుచేశానని తెలిపాడు. ఒకటి ఏర్పాటుచేసిన తర్వాత వచ్చే శబ్ధానికి కొంతమేరకే కోతులు రాకుండా ఆగటంతో పొలం చుట్టూ పది అడుగులకు ఒకటిచొప్పున సీసా ఏర్పాటుచేయటం వల్ల పంటకు నీరు, మందులు వేయటానికి తప్ప కాపలాకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.