లాక్‌డౌన్ కేసులు@846
ABN , First Publish Date - 2020-05-09T10:29:51+05:30 IST
నిపించని మహమ్మారి కరోనా.. ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో? ఎవరెవరిని కలుస్తున్నారో? తెలియని
ఖమ్మం జిల్లాలో పెరిగిన ఉల్లంఘనలు
43రోజుల్లో 1,844 వాహనాలు స్వాధీనం
840మంది వాకర్లపైనా కేసులు
ఖమ్మం, మే 8 (ఆంధ్రజ్యోతి) : కనిపించని మహమ్మారి కరోనా.. ఈ వైరస్ సోకిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో? ఎవరెవరిని కలుస్తున్నారో? తెలియని భయం అందరిలోనూ ఉంది. చివరకు సొంత మనుషులపై కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పోలీసులు, ఇతర అధికారులు దండాలుపెట్టి మరీ బతిమి లాడినా రోడ్లపైకి వస్తున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ విధించగా.. ఇతర క్రైం రేట్ తగ్గింది. కానీ లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు మాత్రం రోజురోజుకీ పెరిగాయి. జిల్లాలో మొత్తంలో కరోనా అనుమానిత వైద్య పరీక్షలు 757 మందికి నిర్వహించగా.. పోలీసులు నమోదు చేసిన లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు మాత్రం 846 ఉండటం గమనార్హం.
గడిచిన 20రోజుల్లో భారీగా పెరుగుదల..
మొదట లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత కొద్దిరోజుల వరకు పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఎంతచెప్పినా కొందరు ఆకతాయిలు వినకపోవడంతో కేసులు నమోదు చేయడం మొదలు పెట్టారు. అయితే మొదటిసారి లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో కొద్దోగొప్పో బయటకు వచ్చిన జనం, ఆ తర్వాత ఎక్కువస్థాయిలో రావడం మొదలు పెట్టారు. దీంతో గత 20రోజుల్లో కేసుల సంఖ్య మూడింతలు పెరిగింది. మార్చి23 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతుండగా మొదటి 20 రోజుల్లో కేవలం 214 కేసులు నమోదు అయ్యాయి. అందులో 97 వాహనాల సీజింగ్ కేసులు నమోదు చేసి 394 వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 44 షాపులపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద 43 కేసులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద 30 కేసులు ఉన్నాయి. కాగా ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య బాగా పెరిగింది. సగటున రోజుకు 15 నుంచి 20 కేసుల వరకు నమోదవుతున్నాయి. కాగా గడిచిన 20 రోజుల్లోనే 600 పైగా కేసులు నమోదవడం గమనార్హం.
లాక్‌డౌన్‌లోనూ ఆగని వాకర్లు..
ఒకవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి ఎవరూ రావొద్దని చెబుతున్నా వారి మాటలను లెక్కచేయని కొందరు వ్యక్తులు వాకింగ్, జాగింగ్ పేరుతో రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారిపై 63 కేసుల్లో 840 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల్లో 435 కేసుల్లో 1,819 వాహనాలు స్వాధీనం చేసుకోగా అందులో 1,626 ద్విచక్రవాహనాలు, 116 ఆటోలు, 69కార్లు, 33ఇతర వాహనాలున్నాయి. వాటితోపాటు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 405దుకాణాలపై 260 కేసులు నమోదు చేశారు. మరో 82ఇతర కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు కేసుల సంఖ్య సీజ్ వివరాలు
వాహనాలు సీజ్ 104 392 వాహనాలు
షాపు సీజ్ 46 62 దుకాణాలు
ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 81 2,099 బాటిల్స్ (రూ.3,96,920)
ఈడీ యాక్ట్ వెహికిల్ 337 1452 వాహనాలు
ఈడీ యాక్ట్ షాప్స్ 214 343 దుకాణాలు
ఈడీయాక్ట్ వాకర్స్ 63 840మందిపై కేసులు