‘పది’ పరీక్ష కేంద్రాల పెంపు

ABN , First Publish Date - 2020-05-30T10:27:41+05:30 IST

పదోతరగతి లాంగ్వేజ్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే కరోనా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో మిగిలిన పరీక్షలు వాయిదా

‘పది’ పరీక్ష కేంద్రాల పెంపు

ఖమ్మంలో 183.. కొత్తగూడెంలో 143

పాత హాల్‌టిక్కెట్లే.. కొత్తగా ఏ, బీ సెంటర్లు

పక్కాగా భౌతికదూరం అమలుకు చర్యలు

ఒక్కో బెంచీకి ఒక్కరు మాత్రమే 

ఇరుజిల్లాల్లో విద్యార్థులు, సిబ్బంది కోసం 40వేల మాస్కులు


ఖమ్మం, మే 29 : పదోతరగతి లాంగ్వేజ్‌ పరీక్షలు పూర్తయిన వెంటనే కరోనా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో మిగిలిన పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఆ పరీక్షలు మళ్లీ ఎప్పుడు, ఎలా? నిర్వహిస్తారోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కానీ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 8నుంచి నిర్వహించాలని, అందుకు అనుగుణంగా విద్యార్ధుల మధ్య భౌతికదూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. 


పరీక్ష కేంద్రాల పెంపు..

పరీక్షల సమయంలో భౌతికదూరం పాటించాల్సిరావడంతో గతంలో నిర్ణయించిన సెంటర్ల సంఖ్యను పెంచారు ఇరుజిల్లాల అధికారులు. అయితే వచ్చేనెల 8నుంచి పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో కొత్తగా హాల్‌టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో పాత హాల్‌టిక్కెట్ల ద్వారానే పరీక్షలు రాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైనంత వరకు ఆయా సెంటర్లలోని గదులను, కొత్త భవనాలను ఏ, బీ బ్లాకులుగా చేసి సెంటర్ల సంఖ్యను పెంచారు. అలా వీలులేని చోట నిర్ణయించిన కేంద్రానికి దగ్గరలో అరకిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.


అలా అరకొలోమీటరు దూరంలో ఉన్న కొత్తసెంటర్లు ఖమ్మం జిల్లాలో 31 ఉన్నాయి.  ఖమ్మం జిల్లాలో 18,657 మంది విద్యార్థులకు గాను 17854 మంది రెగ్యులర్‌, 803 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. వీరి కోసం గతంలో 94 కేంద్రాలు నిర్ణయించగా.. ప్రస్తుతం 183 కేంద్రాలకు పెంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14,674 మంది విద్యార్థులకుగాను 75 పరీక్ష కేంద్రాలు నిర్ణయించగా.. తాజాగా మరో 68కేంద్రాలు పెంచి మొత్తం 143 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 


బెంచీకి ఒక్కరు మాత్రమే..

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, సిబ్బందికి  శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచనున్నారు. మాస్కులు అందించే బాధ్యతను ఆయా జిల్లాల ఐకేపీ సెంటర్లకుఅప్పగించారు. ఖమ్మం జిల్లాలో సుమారు 23వేలు, భద్రాద్రి జిల్లాలో 15 వేల మాస్కులు అవసరం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. ఇక భౌతికదూరం అమలు చేసే క్రమంలో బెంచీకి ఒక్కరు మాత్రమే కూర్చుని పరీక్షరాసేలా ఏర్పాట్లు చేయనున్నారు.


ఇక సెంటర్లు పెంచడంతో తమ ఏ కేంద్రం కేటాయించారో ఎలా తెలుసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హాల్‌టిక్కెట్లలో ఉన్న సెంటర్లకు ఒకరోజు ముందుగానే వెళ్లి తమ కొత్తగా కేటాయించిన సెంటర్‌ ఎక్కడ ఉందో చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా ఏయే నెంబరు నుంచి ఏయే నెంబరు వరకు ఏ, బి సెంటర్లలో ఎక్కడ అన్న అంశాలతో సెంటర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఎవరు ఎక్కడి సెంటర్‌ అన్న విషయాలను విద్యార్థులకు సమాచారం అందించనున్నారు. డీఈవో సైట్‌లోనూ తమ సెంటర్‌ ఎక్కడ అన్న విషయాలను చూసుకోవచ్చు. 


దూరప్రాంతాల విద్యార్థులకు తప్పని ఇబ్బందులు.. 

హాస్టళ్లలో ఉండి, లాక్‌డౌన్‌తో ఇళ్లకు వెళ్లిన దూరప్రాంత విద్యార్థులకు పరీక్షలకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల కోసం వచ్చి స్థానికంగా ఎక్కడ ఉండాలనేదానిపై సందిగ్ధం నెలకొంది. తమ పిల్లలను పరీక్షలకు తీసుకువచ్చే బాధ్యతను ప్రభుత్వం తల్లిదండ్రులకే అప్పగించింది. ఇక ప్రైవేట్‌ హాస్టలో ఉండి చదువుకున్న వారి విషయంలో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వడం లేదు. పదోతరగతి విద్యార్థులు కొందరే ఉంటారు కాబట్టి వారిని భౌతికదూరం పాటించేలా వేర్వేరు గదుల్లో ఉంచి పరీక్షలకు పంపాలా? లేదంటే వారిని పరీక్షకు తీసుకొచ్చే బాధ్యతను తల్లిదండ్రులకు అప్పగించి, పరీక్ష రోజు మధ్యాహ్నం వేళల్లో భోజనం అందించేలా ఏర్పాటు చేయాలా అనే ఆలోచలో ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. 


తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి : డీఈవో మదన్‌మోహన్‌, ఖమ్మం జిల్లా

విద్యార్థులను పరీక్షకు తీసుకొచ్చి, తీసుకెళ్లే బాధ్యతను తల్లిదండ్రులే తీసుకోవాలి. ఒకరోజు ముందుగానే కేటాయించిన కేంద్రానికి వెళ్లి.. మార్పులు ఉన్నాయో లేదో చూసుకోవడంతోపాటుగా పిల్లల ఆరోగ్యం, చదువుపై శ్రద్ధ వహించాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, వారిని తీసుకొచ్చే వారు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించారు. భౌతికదూరం పాటించడంతోపాటు, మాస్క్‌లు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించారు. 


Updated Date - 2020-05-30T10:27:41+05:30 IST