అరణ్య రోదన

ABN , First Publish Date - 2020-05-10T10:34:57+05:30 IST

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కాలంలో పేదల ప్రజలకు ప్రకటించిన

అరణ్య రోదన

గిరిజనులకు తక్షణ ఉపాధి కరువు

రేషన్‌కార్డులున్నా అందని బియ్యం, నగదుసాయం

కరోనా వేళ సాయంకోసం ఎదురు చూపు 

ఒప్పందాలు ఖరారు కాకపోవడంతో ప్రారంభంకాని తునికాకు సేకరణ

  

భద్రాచలం/ఇల్లెందు, మే 9: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ కాలంలో పేదల ప్రజలకు ప్రకటించిన 12 కిలోల బియ్యం, రూ.1500 నగదు అర్హులందరికి పూర్తి స్థాయిలో అందకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గత 45రోజులుగా బయటకు వెళ్లే అవకాశాలు లేక, ఉపాధి పనులు లభ్యం కాక తల్లడిల్లుతున్న ప్రజలు ప్రభుత్వం ఇప్పటికి రెండు విడతలుగా బియ్యం, నగదు పంపిణీ చేస్తున్నప్పటికీ ఒక్కసారికూడా తమకు ప్రభుత్వ సాయం అందలేదని పలువురు తెల్లరేషన్‌ కార్డులు కలిగిన పేదలు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డు కలిగిన వారికి ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, కుటుంబానికి రూ.1,500 నగదు చొప్పున రెండు విడతలుగా విడుదల చేసింది. అయితే జిల్లా వ్యాపితంగా వందలాది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న కరోనా సాయానికి నోచుకోలేదు. తెల్ల రేషన్‌ కార్డులు కలిగివున్నప్పటికి వేలిముద్రలు పడటం లేదని, బ్యాంకుల్లో వివిధ సాంకేతిక కారణాలతో రూ.1500నగదులు జమ కాకపోవడంతో ప్రజలు మండుటెండల్లో సైతం బ్యాంకుల చుట్టు, రేషన్‌ షాపుల చుట్టు, పోస్టాఫీసుల చుట్టురా ప్రదక్షిణాలు చేస్తున్నారు.


అర్హత కలిగిన తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సహయం అందుతుందా లేదా అన్న విషయాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వకపోవడంతో లభ్దిదారులు తల్లడిల్లుతున్నారు. తమతోపాటు నివసిస్తున్న అనేక మంది తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇప్పటికే రెండు పర్యాయాలు 12 కేజీల చొప్పున బియ్యంతోపాటు రెండు పర్యాయాలు రూ.1500 చొప్పున నగదులు లభించడంతో కరోనా లాక్‌డౌన్‌ సాయం అందని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాతలు ఇచ్చే నిత్యావసర వస్తువులతో రోజులు గడుపుతున్న నిరుపేద కుటుంబాలు తమ వద్ద తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నప్పటికి ప్రభుత్వ సాయం అందడం లేదని, తమను అదుకోవాలని కోరుతున్నాయి. ఇదిలా వుండగా వలస కార్మికులకు సైతం ప్రభుత్వం బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేసింది. అయితే తెల్ల రేషన్‌ కార్డులు లేని వందలాది కుటుంబాలకు మాత్రం నేటి వరకు ఎలాంటి తోడ్పాటు అందించలేదు. తుదకు ఆవేదనకు గురైన బాధిత కుటుంబాలు ఇటీవల ఇల్లెందు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు కూడా పూనుకోవడం గమనార్హం. గత రెండేళ్ళుగా తెల్ల రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసి తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పేదల గోడు పట్టించుకునే నాధులే కరువయ్యారు.


జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మందికి పైగా తెల్ల రేషన్‌ కార్డుల కోసం చేసిన దరఖాస్తులు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నప్పటికి పట్టించుకునే నాధులే కరువయ్యారు. నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది లాక్‌డౌన్‌ మూలంగా స్వతహాగా పనులు చేసే పరిస్థితులు లేక, ప్రభుత్వం అదుకోకపోవడంతో తల్లడిల్లుతున్నారు. గుండాల మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచి పరిధిలో ఖాతాదారులకు రూ.1,500  ప్రభుత్వ సాయం వారి ఖాతాల్లో పడినా డ్వాక్రా రుణాలు చెల్లిస్తేనే తీసుకునే సౌకర్యం కల్పిస్తామని ఎకౌంట్లను హోల్డ్‌లో పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి, ములకలపల్లి, చర్ల, దుమ్ముగూడెం తదితర మండలాల్లో ఇప్పుపువ్వు సేకరణలో ఆదివాసీలు నిమగ్నమయ్యారు. 


ప్రారంభంకాని తునికాకు సేకరణ

ఏటా వేసవి కాలంలో ఏజెన్సీలోని ఆదివాసీలు చేపట్టే తునికాకు సేకరణ ఒప్పందాలు ఖరారు కాకపోవడంతో ఈ సంవత్సరం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం తునికాకు సేకరణకు అనుమతి ఇవ్వడంతో ఆరు అటవీ డివిజన్‌లలో 38,500 స్టాండర్డు బ్యాగుల తునికాకు సేకరణ చేపట్టాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన పనులు రాబోయే రెండు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 


వేలి ముద్రలు పడటం లేదని బియ్యం, నగదు ఇవ్వలేదు :  ఎల్‌ ముత్యాలి, రొంపేడు 

తెల్లరేషన్‌ కార్డు ఉన్నా వేలిముద్రలు పడటం లేదని లాక్‌డౌన్‌ సాయం ఇవ్వలేదు. వృద్దాప్యంలో ఉన్న మాకు ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌కార్డులు ఉన్నా నేటికీ ఎలాంటి సాయం అందించలేదు. 


రూ.1500 నగదు రాలేదు :  సయ్యద్‌ మహబూబ్‌ బీ,  ఇల్లెందు 

ఇల్లెందు పట్టణంలోని నెంబర్‌-2 బస్తీలో ఉంటున్న మాకు బియ్యం ఇచ్చారు. కానీ రూ.1500 రాలేదు. మండుటెండల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాధులే లేరు. నాలుగుసార్లు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లినా  సాయం మాత్రం అందలేదు

Updated Date - 2020-05-10T10:34:57+05:30 IST