భద్రాద్రికి ఐటీసీ నిధులివ్వకుంటే ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2020-12-12T04:40:50+05:30 IST

భద్రాద్రి అభివృద్ధికి ఐటీసీ ఏటా రూ.కోటి సీఎ్‌సఆర్‌ నిధులు ఇవ్వాల్సిందేనని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రముఖులను కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

భద్రాద్రికి ఐటీసీ నిధులివ్వకుంటే ఉద్యమిస్తాం
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బాలసాని

 ఏటా రూ.కోటి సీఎ్‌సఆర్‌ నిధులు ఇవ్వాల్సిందే

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఫైర్‌

భద్రాచలం, డిసెంబరు 11: భద్రాద్రి అభివృద్ధికి ఐటీసీ ఏటా రూ.కోటి సీఎ్‌సఆర్‌ నిధులు ఇవ్వాల్సిందేనని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రముఖులను కలుపుకొని ఉద్యమానికి సిద్ధమవుతామని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హెచ్చరించారు. భద్రాచలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీసీ సంస్థ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భద్రాద్రివాసులు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. నిధులు కేటాయించాల్సి ఉన్నా పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. భద్రాద్రి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన ఐటీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. భద్రాచలంను సుందరంగా తీర్చిదిద్దాలన్నది తమ తపన అని బాలసాని స్పష్టం చేశారు. ఇందుకోసం జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, తాను ఇకపై తరచూ భద్రాద్రి అభివృద్ధిపై సమీక్షిస్తామన్నారు. భద్రాద్రి రామాలయ అభివృద్దికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అయితే అవసరమైన స్థలం అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.  భద్రాచలంకు భవిష్యత్తులో ముంపు సమస్య ఉండకుండా శివారు ప్రాంతంలో మరో 400 మీటర్లు కరకట్టను పొడిగించాలని  ముఖ్యమంత్రిని కోరానన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంను పరిశీలించి సత్వరమే పనులు చేపట్టి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కొత్త మార్కెట్లో షాపింగ్‌లకు కాకుండా గోడౌన్లకు వినియోగించే వారి కాంట్రాక్టు రద్దు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, తహసీల్దారు ఎస్‌.శ్రీనివాసయాదవ్‌,  నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ బాధ్యుడు డాక్టర్‌ తెల్లం వెంకట్రావు, చర్ల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య, దుమ్ముగూడెం టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు అన్నెం సత్యనారాయణమూర్తి టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:40:50+05:30 IST