ఐక్యతా జ్యోతి
ABN , First Publish Date - 2020-04-05T10:32:08+05:30 IST
కరోనా కోవిడ్-19 వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై జనంలో మరింత స్ఫూర్తిని నింపేందుకు వైరస్ కట్టడిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రతి ఇంటా

ప్రధాని మోదీ పిలుపుతో నేడు ఇంటింటా దీపాలు
రాత్రి 9గంటలకు 9నిమిషాల పాటు నిర్వహణ
లైట్లు బంద్ చేయండి.. విద్యుత్ పరికరాలు ఆన్‌లో ఉంచండి
సబ్స్టేషన్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ట్రాన్సుకో
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం)
కరోనా కోవిడ్-19 వైరస్ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై జనంలో మరింత స్ఫూర్తిని నింపేందుకు వైరస్ కట్టడిపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రతి ఇంటా విద్యుత్ లైట్లు ఆపి జ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో ఉమ్మడి జిల్లాలో కూడా ప్రజలు జ్యోతులు వెలిగించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఒకేసారి లైట్లు ఆపడం వల్ల విద్యుత్ సరఫరా గ్రిడ్‌లో ఇబ్బందులు తలెత్తుతాయన్న ప్రచారంతో ట్రాన్సుకో అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. ఆదివారం ఆరు గంటలనుంచి రాత్రి పదిగంటల వరకు ట్రాన్సుకో సిబ్బంది సబ్స్టేషన్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. నేడు రాత్రి 9గంటలకు ప్రతి ఇంటా విద్యుత్ టైట్లు ఆపి కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్ ఫోన్ లైట్లు వెలిగించడం ద్వారా కరోనా నియంత్రణ స్ఫూర్తిని పెంచబోతున్నారు.
ఇప్పటికే జనతాకర్ఫ్యూతో కరోనాపై పూర్తి అవగాహన పెంచుకున్న ప్రజలకు ‘జ్యోతి’ వెలిగించే కార్యక్రమం ద్వారా మరింత అవగాహన కలగనుందని ప్రధాని మోదీ భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 7,46,767 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో 390మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఇందులో ఖమ్మం జిల్లాలో 240మెగావాట్లు, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో 150మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంది. అయితే రాత్రివేళ విద్యుత్ వినియోగం మరింత తక్కువగా ఉంటుంది.
ఖమ్మంలో 150మెగావాట్లు, భద్రాద్రి జిల్లాలో 100మెగావాట్ల వరకు రాత్రి సమయాల్లో వినియోగిస్తారు. 9గంటల ప్రాంతంలో అందరు లైట్లు ఆపినా ఉమ్మడి జిల్లాలో 50మెగావాట్ల లోపే విద్యుత్ సరఫరా తగ్గనుందని ట్రాన్సుకో అధికారులు పేర్కొన్నారు. అయితే గ్రిడ్‌పై ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాన్సుకో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం 6గంటలనుంచి పదిగంటల వరకు సబ్‌స్టేషన్‌లో సిబ్బంది అందరు విధిగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. లోడ్ తగ్గినప్పుడు కెపాసిటీ బ్యాంకు లోడును తగ్గించుకోవడం, లైన్లు మార్చుకోవడం, వంటి చర్యలు చేపట్టి ఆ తర్వాత విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ట్రాన్సుకో చర్యలు చేపట్టింది. అయితే ప్రధాని మోదీ పిలుపుతో జ్యోతి వెలిగింపు కార్యక్రమంపై కొందరు అసంతృప్తిగా ఉన్నా ఎక్కువమంది జ్యోతులు వెలిగించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.