గురుకులానికి దారేదీ?

ABN , First Publish Date - 2020-12-14T04:29:24+05:30 IST

రిజన బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని రూ.ఐదుకోట్లతో నిర్మిస్తుండగా, రహదారి మాత్రం ఏర్పాటు చేయలేదు.

గురుకులానికి దారేదీ?
తాటిపూడి-ముసలిమడుగు మధ్య పొలాలగుండా వెళ్లే రోడ్డు, రూ.ఐదుకోట్లతో నిర్మిస్తున్న ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల భవనం

కొత్తముసలిమడుగులో పూర్తికావస్తున్న భవనం

రైతుల అవసరాలకోసం ఏర్పాటు చేసుకున్న దారే దిక్కు

రహదారినిర్మించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

వైరా, డిసెంబరు 13: గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని రూ.ఐదుకోట్లతో నిర్మిస్తుండగా, రహదారి మాత్రం ఏర్పాటు చేయలేదు. మండలంలోని తాటిపూడి- ముసలిమడుగు గ్రామాల మధ్య కొత్త ముసలిమడుగు గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఈ గురుకుల పాఠశాల భవన నిర్మానాన్ని ఐదేళ్ల కిందట చేపట్టారు. నిధుల కొరత ఇతరత్రా కారణాల వలన ఈభవన నిర్మాణం లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు చివరిదశకు చేరుకుంది. ఈ గురుకుల పాఠశాల వైరా నుంచి తాటిపూడి మీదుగా 9కిలోమీటర్ల దూరం, గండగల పాడు, స్నానాల లక్ష్మీపురం, ముసలిమడుగు మీదుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే పొలాల మధ్యనుంచి రైతుల అవసరాల కోసం వేసిన మట్టి రోడ్డు మాత్రమే ముసలి మడుగు-తాటిపూడి గ్రామాల మధ్య ఉంది. ఇది మొత్తం గుంతలు, బురదతో నిండి ఉంది. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా వీల్లేదు. పాదచారులే అతికష్టంగా ఈ రోడ్డుమీద తిరుగుతున్నారు. రైతుల ట్రాక్టర్లు మాత్రం వ్యవసాయ పనుల నిమిత్తం విధి లేని పరిస్థితుల్లో ఈ బురదలోనే తిరుగుతున్నాయి. వైరా నుంచి మధిర, జగ్గయ్యపేట వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులోని తాటిపూడి నుంచి మూడుకిలోమీటర్ల దూరం మట్టిరోడ్డుపై వెళ్తే గురుకుల పాఠశాలకు చేరుకోవచ్చు. ముసలిమడుగు మీదుగా రెండు కిలోమీటర్లు మట్టి రోడ్డుపై ప్రయాణిస్తే గురుకుల పాఠశాల వస్తుంది.  ఈ రోడ్డు అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని అనేకసార్లు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయినా ఇంతవరకు దిక్కూమొక్కూ లేదు. ప్రస్తుతం ఎస్టీబాలికల గురుకుల పాఠశాల తనికెళ్ల సమీపంలోని ప్రైవేట్‌ భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలను కొత్తగా నిర్మించిన భవనాల్లోకి షిప్టు చేసిన పక్షంలో రహదారి సౌకర్యం లేక విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురి కానున్నారు. ఈ పాఠశాల భవనం పక్కనే బీసీ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆపాఠశాల కొద్దిరోజుల కిందటి వరకు రెబ్బవరంలో నిర్వహించి తర్వాత ఖమ్మం సమీపా నానికి తరలించారు. ఇంకా ఆభవన నిర్మాణం మొదలు కాలేదు. రెండు బాలికల గురుకుల పాఠశాలలు నిర్మిస్తు న్నందున ఆర్‌అండ్‌బీకి నిధులు మంజూరు చేసి తాటిపూడి-ముసలిమడుగు మధ్య రోడ్డును అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. 


Updated Date - 2020-12-14T04:29:24+05:30 IST