ధాన్యం వ్యాపారం ‘బస్తా’వ్యస్తం
ABN , First Publish Date - 2020-12-18T04:24:06+05:30 IST
జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వ్యాపారం అస్తవ్యస్తంగా మారింది.

ఇప్పటికీ తేలని గోనె సంచుల మాయం వ్యవహారం
లెక్క సరిచేసేందుకు అధికారుల ముడుపుల మంత్రం
నాలుగు వేల సంచులు రూ.40వేలకు విక్రయించిన తీరు
సంబంధం లేని మహిళా సమాఖ్యలపై రికవరీ కొర్రీ
దుమ్ముగూడెం డిసెంబరు 17: జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వ్యాపారం అస్తవ్యస్తంగా మారింది. సంఘాల లాభార్జన మాట అటుంచితే, కొందరు సిబ్బంది అక్రమార్కుల అవతారం ఎత్తి లాభాలను మూటగట్టుకుంటున్నారు. పౌరసరఫరాల శాఖలో కొందరు సిబ్బంది వీరికి సహకరించడంతో అక్రమాలు సక్రమాలుగా మారాయి. 2018-19లో లక్షకు పైగా గోనె సంచులు మాయం వ్యవహారంలో జిల్లాలోని పలు సహకార సంఘాల లాభాల్లో రూ.80 లక్షలు కోతపడింది. ధాన్యం కొనుగోలు వ్యవహారాల ఇన్‌చార్జ్ సిబ్బందిపై చర్యలు తీసుకొని నగదు రికవరీ చేయాల్సి ఉండగా, సంఘాలకు రావాల్సిన ధాన్యం కొనుగోలు కమీషన్లలో కోత విధించడం గమనార్హం. మాయమైన గోనె సంచుల లెక్కను సరిచేసేందుకు సహకార సంఘం సిబ్బంది ఏకంగా మిగిలిన బస్తాలనే అమ్మేసి వ్యవహారాన్ని సరిచేసేందుకు యత్నించారు. 2018-19లో వ్యాపారులకు బస్తాలను అక్రమంగా కట్టబెట్టగా, మిగిలిన వాటిని ఈ ఏడాది మార్చి నెలలో రూ.40 వేలకు విక్రయించారు. సంచుల కొరత లేకుండా లెక్క సరిచేయడానికి ఆ సొ మ్మును జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల శాఖలోని సిబ్బందికి ముట్టచెప్పారు. అయినప్పటికీ బస్తాల లెక్కలు సరిపోల కపోవడంతో తానే వ్యవహారాన్ని సర్దుబాటు చేస్తానని సంఘం అధ్యక్షుడికి లిఖిత పూర్వక హామీ పత్రం రాసిచ్చినట్లు సమాచారం.
సరైన చర్యలు లేకపోవడంతో..
ధాన్యం కొనుగోలు వ్యాపారం, వ్యవసాయ రుణాల లెక్కల తారుమారు వంటి విషయాల్లో కొన్ని సహకార సంఘాల సిబ్బంది ఏళ్ల తరబడి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సరైన చర్యలు లేకపోవడంతో వీరి దోపిడీ కొనసాగుతోందనే విమర్శలున్నాయి. అక్రమ వ్యవహారాలను చూసీ చూ డకుండా ఉండేందుకు జిల్లా సహకారశాఖలోని ఓ అఽధికారికి ధాన్యం కమీషన్ల లాభాల నుంచి కొంత నగదును చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నట్లు తెలుస్తోంది. పలు ఖర్చుల పేరిట సంఘాలకు అందాల్సిన కమీషన్‌లో 2.5 శాతం నగదును జిల్లా స్థాయిలో ముందుగానే కోత విధించి, మిగతాది సంఘాల ఖాతాలకు జమచేస్తున్నట్లు సమాచారం. లక్షకు పైగా గోనె సంచుల మాయం, బాధ్యులపై చర్యలు, సంచుల మార్పిడిలో పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాత్రపై విచారణ జరిపితే పలు అక్రమాలు బయట పడతాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
సంబంధం లేని వీవోలపై రికవరీల కొర్రీ
పౌరసరఫరాల శాఖ అలసత్వం కారణంగా గోనె సంచుల నష్టం రికవరీని సంబంధం లేని మహిళా సమాఖ్యల నెత్తిన రుద్దారనే విమర్శలున్నాయి. 2018-19లో ధాన్యం వ్యాపారం చేసిన జిల్లాలోని పలు మహిళా గ్రామ సమాఖ్యల కమీషను లాభాల్లో కోతపడింది. ఆర్లగూడెంలో సాయిరాం గ్రామసమాఖ్యలోని ఒక మహిళా సభ్యుల బృందం 2017-18లో ధాన్యం కొనుగోలు వ్యాపారం చేశారు. ఆ ఏడాది పెద్ద సంఖ్యలో గోనె సంచులు లెక్క తేలలేదు. ఐతే వారి నుంచి సంచుల నష్టం రికవరీ చేయకుండానే వారికి పూర్తి కమీషన్‌ను అందజేశారు. తదుపరి ఏడాది 2018-19లో వ్యాపారం నిర్వహించిన మ హిళా సమాఖ్య నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేశారు. దీంతో వారు 10,500 క్వింటాళ్ల ధాన్యంపై ఆర్జించిన కమీషను రూ 3,28,116ల లాభంలో రూ2,22,000 కోత విధించారు. వారి చేతికి కేవలం రూ1,06,116 చేతికి వచ్చాయి. 17-18లో వ్యా పారం చేసిన సంఘం నష్టాలను తమపై మోపడం ఏంటని 18-19లో వ్యాపారం చేసిన మహిళా సమాఖ్య లీడర్ కొర్సా చిన్నక్క ప్రశ్నిస్తున్నారు. సమస్యను పలువురు అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. కాగా ఇదే తరహా రికవరీ కోతలు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల జరిగినట్లు సమాచారం.
సంచులు రైతుల వద్దే ఉన్నాయి:డీసీవో
దుమ్ముగూడెం సహకార సంఘం పరిదిలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లెక్కతేలని గోనె సంచులు రైతుల వద్దే ఉన్నాయని జిల్లా సహకార శాఖ అధికారి మైఖేల్‌బోస్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. రైతులు తమ అవసరానికంటే ఎక్కువగా సంచులు తీసుకొని, మిగిలినవి కేంద్రాలకు అప్పగించలేదని దుమ్ముగూడెం సీఈవో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన సంచులకు గానూ రూ.10వేలు వసూలు చేశామని అన్నారు. రైతుల వద్ద మిగిలిన ఖాళీ సంచులతో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు తరలిస్తామని ప్రకటించారు. సంఘానికి ఎటువంటి ఆర్ధిక నష్టం జరగకుండా చూసుకుంటామని సీఈవో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గోనె సంచుల రికవరీ పేరిట పలు సహకార కేం ద్రాల కమీషను లాభాల నుంచి రూ80లక్షల కోత విధించగా, కేవలం దుమ్ముగూడెం సహకార కేంద్రానికి సంబంధించిన ప్రకటన మాత్రమే చేయడం కంటితుడుపు చర్యగా కనబడుతోంది. మిగతా సహకార కేంద్రాల నుంచి గోనె సంచుల రికవరీ పేరిట రూ.80లక్షలు కోత విధించడంపై మాత్రం స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. గోనె సంచులు తీసుకున్న రైతుల పేర్లు, వారి వివరాలకు సంబందించిన రిజిష్టర్ల నిర్వహణ అసలు జరగలేదని తెలుస్తోంది. సంచులు ఎలా మాయమయ్యాయి? దానికి బాధ్యులెవరు? సహకార సంఘాలకు కోత పెట్టిన రూ.80లక్షల నష్టాన్ని ఎలా రికవరీ చేస్తారనేది? ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.