నేటి నుంచి హరితహారం

ABN , First Publish Date - 2020-06-25T10:19:04+05:30 IST

వర్షాకాలం ప్రారంభం కావడంతో ఆరో విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమైంది.

నేటి నుంచి హరితహారం

లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద మంత్రి పువ్వాడ శ్రీకారం

ఖమ్మం జిల్లాలో 1.4కోట్లు.. 

భద్రాద్రిలో 1.08కోట్ల మొక్కల లక్ష్యం

శాఖలవారీగా లక్ష్యాల నిర్ధేశం

ఈసారి నాటిన మొక్కలు ‘ఆన్‌లైన్‌’లో నమోదు


ఖమ్మం ప్రతినిధి/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభం కావడంతో ఆరో విడత హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నాటాల్సిన మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేశారు. ఖమ్మం నగరంలోని లాకారం మినీట్యాంక్‌బండ్‌ వద్ద రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్‌  హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఖమ్మం జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 1.4కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలో 584 పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కలు పెంచారు. జిల్లాలో మొత్తం 1కోటి 37లక్షల మొక్కలు పెంచారు. ఇక భద్రాద్రి జిల్లాలో 523నర్సరీల ద్వారా 1.38కోట్ల మొక్కలను పెంచారు. అటవీశాఖ ద్వారా 55.90లక్షలు, డీఆర్‌డీఏ ద్వారా 62.13 లక్షలు, హార్టికల్చర్‌ ద్వారా 5.50లక్షలు, సింగరేణి ద్వారా 10లక్షలు, టీఎస్‌ఎఫ్‌డీసీ ద్వారా 4.50లక్షల మొక్కలను సిద్ధం చేశారు. మొత్తంగా ఈ జిల్లాలో 1.08కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. 


ఈసారి నాటిన మొక్కలు ‘ఆన్‌లైన్‌’లో నమోదు

ఈసారి హరితహారంలో నాటే ప్రతి మొక్కను అటవీశాఖ ‘ఆన్‌లైన్‌’ చేయబోతోంది. అటవీ ఉత్పత్తులకు సంబంధించిన మొక్కలు అటవీ భూముల్లో నాటించనున్నారు. రహదారుల పక్కన నీడనిచ్చే మొక్కలు, మునిసిపాలిటీల్లో పూలుపూయడంతో పటు సుందరీకరణ మొక్కలు, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈతమొక్కలు, ఉద్యానశాఖ ద్వారా పండ్లతోట మొక్కలు నాటించనున్నారు. జిల్లాలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటివరకు ఇరు జిల్లాలో జరిగిన ఐదు విడతల హరితహారం కార్యక్రమాల్లో నాటిన మొక్కలో చాలా మొక్కలు చనిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ సారి మొక్కలు ఎక్కడా చనిపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు ఖమ్మం జిల్లా అటవీ అభివృద్ధి అధికారి ప్రవీణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వేసిన ప్రతి మొక్కకు ఉపాధి నిధులతో కంచె వేయడంతోపాటు ప్రతి 500మొక్కలకు ఒక వాచ్‌మెన్‌ నియమించడం, పంచాయతీ ట్రాక్టర్లతో మొక్కలకు నీరు అందించడం జరుగుతుందని, వేసిన అన్నీ మొక్కలను సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 

Updated Date - 2020-06-25T10:19:04+05:30 IST