ప్రభుత్వ స్థలాలను మునిసిపాలిటీలకు అప్పగించాలి

ABN , First Publish Date - 2020-03-13T12:15:26+05:30 IST

పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను చేపట్టేందుకు నగరపాలక సంస్థ, జిల్లాలో మూడు మునిసిపాలిటీల్లో తహసీల్దార్లు గుర్తించిన ప్రభుత్వ స్థలాలను ఆయా మునిసిపాలిటీలకు

ప్రభుత్వ స్థలాలను మునిసిపాలిటీలకు అప్పగించాలి

ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలి కలెక్టర్‌ కర్ణన్‌

పట్టణ ప్రగతిపై  తహసీల్దార్లతో సమీక్ష


ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 12: పట్టణ ప్రగతిలో గుర్తించిన పనులను చేపట్టేందుకు  నగరపాలక సంస్థ, జిల్లాలో మూడు మునిసిపాలిటీల్లో తహసీల్దార్లు గుర్తించిన ప్రభుత్వ స్థలాలను ఆయా మునిసిపాలిటీలకు అప్పగించాలని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి లాండ్‌ ఆడిట్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధికారులు తహాసీల్దార్లతో కలెక్టర్‌ సమీక్షించారు. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు వైరా సత్తుపల్లి, మధిర మునిసి పాలిటీల్లో పట్టణ ప్రగతి కింద చేపట్టనున్న పబ్లిక్‌ టాయిలెట్స్‌, డంపింగ్‌ యార్డులు, శ్మశానవాటికలు, సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు.


ఈ స్థలాలను జిల్లాస్థాయి అధికారులు సంబందిత మునిసిపల్‌ కమిషనర్లకు అప్పగించాలన్నారు. రాష్ట్ర స్థాయి అధికారుల అనుమతి పొందాల్సి ఉంటే వాటి వివరాలను అందచేయాలని, వాటికి ర్యాటిఫ్‌కేషన్‌ కోరనున్నట్లు  కలెక్టర్‌ వివరించారు. ఖమ్మం నగరంలో 1,2,6,7 వ డివిజన్‌లో ప్రభుత్వ పాఠశాలలు శాంతినగర్‌ జూనియర్‌ కళాశాలతో పాటు రోడ్డుపక్కన ఉన్న ఇతర విద్యాసంస్థలల్లో పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో ఎక్కువగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.  ఎన్నెస్పీ భూములు సేకరించిన వాటికి రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ర్యాటిఫికేషన్‌ పొందడానికి సమగ్ర వివరాలతో భూమి విస్తీర్ణం రెవెన్యూ శాఖకు సమర్పించాలన్నారు. డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలకు సంబందించి అటవీభూములను అప్పగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ, వైరా సత్తుపల్లి, మధిర మునిసిపాలిటీల్లోని ప్రభుత్వ స్థలాలు భవనాలను అనధికారికంగా ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేసి నిర్ణీత గడువులోగా ఖాళీ చేయించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


ఈ   సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూధన్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఆర్వో ఆర్‌ శిరీష, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, సింగరేణి జనరల్‌ మేనేజర్‌ సిహెచ్‌ వి.నర్సింహారావు, నీటి పారుదల శాఖ ఈఈ స్వర్గం నర్సింహారావు, ఎన్నెస్పీ ఈఈ శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్‌ఎం ఎస్‌వీ కృష్ణమూర్తి, డీఈవో మధన్‌మోహన్‌, జిల్లా రవాణాశాఖ అధికారి వి.రవీందర్‌, మార్కెటింగ్‌ అధికారి సంతోష్‌కుమార్‌, ఖమ్మం, కల్లూరు ఆర్డీవోలు రవీంద్రనాధ్‌, థశరద్‌, జిల్లా పరశ్రమల మేనేజర్‌ కృష్ణారావు, సర్వేలాండ్‌ ఏడీ వోరుగంటి రాము, ఖమ్మంఅర్భన్‌, సత్తుపల్లి, వైరా, మధిర, రఘునాధపాలెం, కూసుమంచి తహాసీల్దార్లు కె శ్రీనివాసరావు, మీనన్‌, డి సైదులు, రమ్య, నాగేశ్వరరావు, జి శిరీష తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T12:15:26+05:30 IST