‘గోటితలంబ్రాల’ వరికోతలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-11T05:25:07+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్‌ 21న నిర్వహించే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని పురస్కరించుకొని గోటితలంబ్రాల తయారీకి వరికోతలను రామభక్తులు ప్రారంభించారు.

‘గోటితలంబ్రాల’ వరికోతలు ప్రారంభం
దేవతామూర్తుల వేషధారణలో వరికోతలు కోస్తున్న దృశ్యం

కోరుకొండలో రామభక్తుల ప్రత్యేక పూజలు

భద్రాద్రిలో తెప్పోత్సవానికి నీటిదొనె సిద్ధం

భద్రాచలం, డిసెంబరు 10: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్‌ 21న నిర్వహించే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణాన్ని పురస్కరించుకొని గోటితలంబ్రాల తయారీకి వరికోతలను రామభక్తులు ప్రారంభించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శ్రీ కృష్ణచైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. భక్తులు వానరుల వేషధారణలో పూజలు నిర్వహించి వరికోతలను ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణలోని మూడు జిల్లాల్లో 800 కేజీల ధాన్యాన్ని సేకరించి మూడువేల మందితో ధాన్యం ఒలిపించి గోటి తలంబ్రాలు సిద్ధం చేసి సీతారాముల కల్యాణానికి అందజేయనున్నట్లు శ్రీ కృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు తెలిపారు.  

‘ముక్కోటి’ తెప్పోత్సవానికి నీటిదొనె సిద్ధం

భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా 24వ తేఈన నిర్వహించే తెప్పోత్సవానికి యాగశాలలో నీటిదోనెను సిద్ధం చేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో పాటు గోదావరిలో ఇసుకమేటలు ఉండటంతో తెప్పోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదుట ఉన్న యాగశాలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. నీటిదోనె ఏర్పాటును గురువారం పూర్తిచేశారు.  


Updated Date - 2020-12-11T05:25:07+05:30 IST