ఏం జరిగింది ? బాలిక అదృశ్యం ఘటనపై ముమ్మరంగా విచారణ
ABN , First Publish Date - 2020-12-20T04:56:09+05:30 IST
ఖమ్మం జిల్లాలో బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ వ్యవహారంలో క్షుద్రపూజల నిర్వాహకులే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బాలిక అదృశ్యం ఘటనపై ముమ్మరంగా విచారణ
ఇంకా లభించని ఆచూకీ
క్షుద్రపూజల నిర్వాహకులపైనే అనుమానాలు
బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: మధిర సీఐ
ఖమ్మం(ప్రతినిధి)/ఎర్రుపాలెం, డిసెంబరు 19: ప్రపంచం రోజురోజుకూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పురోగమిస్తున్నా గ్రామాల్లో మాత్రం ఇంకా మూఢనమ్మకాలు తగ్గడంలేదు. చేతబడులు క్షుద్రపూజల వంటి జాఢ్యాలు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఆరోగ్యం కోసం ఆర్థిక లాభాల కోసం మూఢనమ్మకాలతో సాగించిన క్షుద్రపూజల నేపధ్యంలో ఇంటర్ చదువుతున్న బాలిక అదృశ్యం కావడం ఖమ్మం జిల్లాలో సంచలనమైంది. బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ వ్యవహారంలో క్షుద్రపూజల నిర్వాహకులే బాలికను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో గద్దె నర్సింహారావు అనే వ్యక్తి ఇంట్లో గురువారం రాత్రి క్షుద్రపూజలు జరిగాయి. అయితే శుక్రవారం నర్సింహారావు బంధువైన ఇంటర్ విద్యార్థిని(మైనర్) అదృశ్యం కావడం, అదే సమయంలో క్షుద్రపూజల నిర్వాహకుల ఆచూకీ కూడా లభించకపోవడంతో బాలికను వారే కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు మధిర సీఐ మురళి, ఎర్రుపాలెం ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఆమె ఫిర్యాదుతోనే మొత్తం క్షుద్రపూజల వ్యవహారం బయటపడిన విషయం తెలిసిందే.. రేమిడిచర్ల గ్రామానికి చెందిన నర్సింహారావు గేదెల వ్యపారం చేస్తుంటాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ఇటీవల తన గ్రామానికి చెందిన ఒక పూజారిని సంప్రదించగా పలు గ్రహాలు అడ్డుగా ఉన్నాయని, పరిష్కారంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. అంతేకాకుండా తనకు తెలిసిన క్షుద్రపూజల నిర్వాహకుడి గురించి తెలియచేయడతో అతడిని పిలిపించమని కోరగా నెలరోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామానికి చెందిన ప్రకాష్‌శర్మ అనే క్షుద్రపూజల నిర్వాహకుడుని రేమిడిచర్లకు రప్పించారు. అతడు వచ్చి నర్సింహారావు స్థితిగతులను పరిశీలించి ఇంట్లో ఉన్న ఇబ్బందులు తొలిగించడంతోపాటు ఇంటిలోపల లంకెబిందెలు ఉన్నాయని, వాటికి పూజలు చేయాలని వారిని నమ్మించాడు. అందుకు నర్సింహారావు కుటుంబం అంగీకరించడంతో వారంరోజుల క్రితం ప్రకాష్‌శర్మ తన అనుచరులతో నర్సింహారావు ఇంటికి వచ్చి ఇంట్లో 20 అడుగుల గొయ్యి తవ్వకం ప్రారంభించారు. ఈ సమయంలో అదే గ్రామంలో ఉంటున్న నర్సింహారావు బావమరిది కుమార్తె బంధువైన నర్సింహారావు ఇంటికి వచ్చివెళ్లేది. గురువారం రాత్రి క్షుద్రపూజ ఉండడంతో బాలిక వారింటికి వెళ్లగా తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో తనను కూడా పూజ దగ్గర ఉండమని నర్సింహారావు కుటుంబీకులు చెప్పడంతో బాలిక ఆ రాత్రి అక్కడే ఉంది. శుక్రవారం ఉదయం నర్సింహారావు తన భార్యతోపాటు అదృశ్యమైన బాలిక తల్లిని తీసుకుని దేవుడు మొక్కు తీర్చుకొనేందుకు గుంటూరు జిల్లా కాకానికి వెళ్లారు. అప్పటికే క్షుద్రపూజల నిర్వాహకులు కూడా తాము తమ ఊరు వెళతామని చెప్పి వెళ్లిపోయారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి బాలిక అదృశ్యం కావడంతో క్షుద్రపూజల నిర్వాహకులే బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొక్కు తీర్చుకునేందుకు కాకాని వెళ్లివచ్చిన నర్సింహారావు ఆయన భార్యతోపాటు అదృశ్యమైన బాలిక తల్లి ఇంటి వద్ద కుమార్తె లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు క్షుద్ర పూజల నిర్వాహకుడు ప్రకాష్‌శర్మ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గ్రామంలో శర్మకు సంబంధం ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శర్మ ఆచూకీ కోసం గుంటూరు జిల్లా పోలీసులను కూడా ఎర్రుపాలెం పోలీసులు సంప్రదించారు. విద్యార్థిని తనవెంట తీసుకెళ్లిన ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండడంతో బాలిక అదృశ్యంపై బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఎటువెళ్లిందన్నది మిస్టరీగా మారింది. క్షుద్రపూజల నిర్వాహకులు కిడ్నాప్‌చేసి తీసుకెళ్లి పూజల కోసం ఏమైనా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షుద్రపూజల నిర్వాహకులు దొరికితేనే బాలిక అదృశ్యంపై మిస్టరీ వీడే అవకాశం ఉంది. పోలీసులు నర్సింహారావు ఇంట్లో ఉన్న గొయ్యిని పరిశీలించారు. సగం పూడ్చి ఉన్న ఆ గొయ్యలో మట్టిని తీయించారు. అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు.
బాలికల అదృశ్యానికి కారకులైన వారిని శిక్షిస్తాం: మధిర సీఐ
క్షుద్రపూజల నేపథ్యంలో మైనర్ బాలిక అదృశ్యానికి కారుకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని మధిర సీఐ మురళి హెచ్చరించారు. రేమిడిచర్ల గ్రామంలో లంకెబిందెలు, గుప్తనిధుల కోసం తీసిన గుంత ప్రదేశాన్ని శనివారం స్థానిక ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ క్షుద్రపూజల్లో భాగంగా గురువారం రాత్రి బాలికతో పూజలు చేయించి శుక్రవారం గద్దే నర్సింహారావు, అతడి భార్య రోశమ్మ బాలిక తల్లిని తీసుకొని గుంటూరు జిల్లా కాకానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి బాలిక కనిపించకపోవడంతో గద్దే నర్సింహారావు, రోశమ్మలపై అనుమానంతో బాలిక తల్లి తమ కుమార్తె ఎక్కడికి వెళ్లిందని వారిని అడిగిందన్నారు. వారు నిర్లక్ష్యం సమాధానాలు చెప్పటంతో అనుమానంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. మాంత్రికుడి భార్య బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చ చేస్తుండగా, అతడు బెంగుళూర్‌లో ఒక ఆశ్రమం నడుపుతున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ప్రకాశ్‌శర్మ ఫోన్ స్వీచ్చాఫ్‌లో ఉండడంతో ఎలాంటి ఆచూకీ తెలియలేదన్నారు. బాలిక అదృశ్యమైందా లేక బలి ఇచ్చారా అనే అంశాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.