దారి కష్టాలు .....
ABN , First Publish Date - 2020-03-27T11:56:24+05:30 IST
కరోనా లాక్‌డౌన్‌తో వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. బతుకుదెరువుకోసం ఇతర
లాక్‌డౌన్‌తో పూర్తిగా స్తంభించిన రవాణా వ్యవస్థ
స్వస్థలాలకు వెళ్లలేక వలసకూలీల యాతన
కాలినడకతో సొంత ఊళ్లకు పయనం
ఆంధ్రజ్యోతి కొత్తగూడెం/భద్రాచలం టౌన్, మార్చి 26: కరోనా లాక్‌డౌన్‌తో వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. బతుకుదెరువుకోసం ఇతర ప్రాంతాలనుంచి భద్రాద్రి జిల్లాకు వచ్చిన కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త మ రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు రవాణ సౌకర్యం లేకపోవడంతో కాలి బాటనే ప్రయాణం సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఏటా మిర్చి, పత్తి పనులకోసం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు చెందిన కూలీలు వలస వచ్చి పనులు చేస్తుంటారు.
ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇతర ప్రాంతాలను భారీగా కూలీలు వలస వచ్చారు. అయితే ప్రస్తుతం కోవిడ్-19 వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. దాంతో ఆయా కూలీలకు ఉపాధి లేకపోవడంతో తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక, ఇక్కడ ఉండలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడంతో చాలా మంది కూలీలు కాలినడకనే తమ స్వస్థలాలకు బయలుదేరారు.
జిల్లాలోని జూలూరుపాడు, చంద్రుగొండ, ఏన్కూరు, కొత్తగూడెం, టేకులపల్లి, ములకలపలి తదితర మండలాల్లోని కూలీలు కాలినడకన సొంత ఊళ్లకు బయలుదేరారు. ఇలా కాలిబాటన వెళుతున్నవారిలో పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. అయితే ఇంత కష్టపడి కాలినడక వెళుతున్నా తమ రాష్ట్ర సరిహద్దుల్లో తమను అనుమతిస్తారో లేదోనని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమను తమ స్వగ్రామాలకు చేరేందుకు సహాయం చేయాలని కోరుతున్నారు.
కాలినడకన 150 కిలోమీటర్లు
భద్రాచలం పట్టణంలో భవన నిర్మాణ పనులు చేసేందుకు ఛత్తీగఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుంచి వచ్చిన వలస ఆదివాసీలు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామాలకు వెళ్లేందుకు గురువారం కాలినడకన పయనమయ్యారు. కరోనా నేపధ్యంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వారంతా తిరిగి తమ గ్రామాలకు వెళ్లాల్సిందిగా కాంట్రాక్టర్లు సూచించారు. అయితే లాక్‌డౌన్ నేపధ్యంలో రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రెండు రోజులుగా పట్టణ శివారులో వేచి చూశారు. అయితే ఫలితం లేకపోవడంతో కాలిబాటన తమ గ్రామాలకు బయలుదేరారు.