ఫ్రంట్‌లైన్‌ ‘వర్రీ’యర్స్‌!

ABN , First Publish Date - 2020-09-05T07:02:04+05:30 IST

కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో ముందు వరుసలో ఉండేది ల్యాబ్‌టెక్నీషియన్లే. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వీరిపై ఉన్నతాధికారులు కరుణ చూపడం లేదు...

ఫ్రంట్‌లైన్‌ ‘వర్రీ’యర్స్‌!

ఖమ్మం పెద్దాసుపత్రిలో ఆరుబయటే పరీక్షలు

గ్లౌజ్‌లు మార్చలేక... నిర్ధారణ బాక్సులు పక్కకు

ప్రాణాలు పణంగా పెడుతున్న ల్యాబ్‌టెక్నీషియన్లు

90శాతం ఉద్యోగులకు కొవిడ్‌-19 పాజిటివ్‌?


ఖమ్మం సంక్షేమవిభాగం, సెప్టెంబరు 4: కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో ముందు వరుసలో ఉండేది ల్యాబ్‌టెక్నీషియన్లే. రోగికి పరీక్షలు చేసే దగ్గర్నుంచి వ్యాధిని నిర్ధారించే దాకా వీరు చేసే పని అంతా ఇంతా కాదు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వీరిపై ఉన్నతాధికారులు కరుణ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ టెక్నిషియన్లు వైర్‌సకు గురికాకుండే ఉండేందుకు ప్రత్యేకంగా పరీక్షా బాక్సులను అందజేసింది. అయితే వాటిని వినియోగించే క్రమంలో నెల రోజులకే బాక్సులతో పాటుగా వచ్చిన టెస్టింగ్‌ గ్లౌజ్‌లు చిరిగిపోయాయి. వాటిని తిరిగి తెప్పించటం కేవలం తక్కువ ఖర్చుతో కూడిన పనే. కానీ అధికారులు రెండు నెలలుగా గ్లౌజ్‌లు తెప్పించలేదు.


ఇప్పటికే జిల్లా ఆసుపత్రిలోని 90శాతం ల్యాబ్‌ ఉద్యోగులు పాజిటివ్‌కు గురయ్యారని విశ్వసనీయ సమాచారం. కొంతమంది రెండో సారి పాజిటివ్‌కు గురయ్యారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆసుపత్రికి రోజురో జుకూ రోగులు ఎక్కువగా వస్తుండటంతో కరోనా పరీక్షలను ఆరుబయటే చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో కొంతమంది ముక్కులో పరీక్ష స్ట్రిప్‌ పెట్టిన తర్వాత ఒక్కసారిగా తుమ్ముతున్నారు. తుంపర్ల మీద పడి తాము కొవిడ్‌ బారిన పడుతున్నామని ల్యాబ్‌ టెక్నిషియన్లు వాపోతున్నారు. ఉన్నతాదికారులు స్పందించి కరోనా పరీక్షా బాక్సులకు గ్లౌజ్‌ లు తెప్పించాలని కోరుతున్నారు.


Updated Date - 2020-09-05T07:02:04+05:30 IST