కొనుగోళ్లు లేక రైతుల దిగాలు

ABN , First Publish Date - 2020-12-21T04:39:27+05:30 IST

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేవాలు లేక అన్నదాతలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

కొనుగోళ్లు లేక రైతుల దిగాలు
కొనుగోలు లేక మిగిలిన ధాన్యం రాశులు

 కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు

 ఎలాట్‌మెంట్‌ పూర్తికావడంతో

 ముందుకురాని రైస్‌మిల్లర్లు

 తక్షణమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్‌

కల్లూరు, డిసెంబరు 20: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసేవాలు లేక అన్నదాతలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి ధాన్యం రాసుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇదీ కల్లూరు మండలంలోని అన్నదాతల దుస్థితి. అసలే ఈ ఏడాది వానాకాలం పంట తుఫాన్‌, అధిక వర్షాలతో దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను రైస్‌మిల్లర్లకు ప్రభుత్వం కేటాయించింది. ఎఫ్‌సీఐ నిబంధనలను సాకుగా తీసుకున్న కల్లూరు ప్రాంతానికి చెందిన పలువురు మిల్లర్లు తమ ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు జరుపుతూ రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కల్లూరు మండలంలో ఈ వానాకాలం సీజన్‌లో 30వేల ఎకరాల్లో రైతులు ధాన్యం పండించగా 6.66లక్షల క్వింటాళ్లు ధాన్యం దిగుబడి కాగా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తరపున సొసైటీ, ఐకేపీ, డీసీఎంఎ్‌సల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే సివిల్‌సప్లయి శాఖ  మిల్లర్లకు కేటాయించిన ఎలాట్‌మెంట్‌ ప్రకారం ఇప్పటికే మూడులక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని(50శాతం)కొనుగోలు చేశారు. ఇంక మూడులక్షల క్వింటాళ్ల ధాన్యం ఆయా కేంద్రాల వద్ద కొనుగోళ్లు లేక నిల్చిపోయాయి. 


హామీ నిలబెట్టుకోని ప్రభుత్వం


రైతులు పండించిన ధాన్యం ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ వాటిని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం సరైన దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఇంకను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోళ్లు లేక ధాన్యంరాశులు కుప్పలుతెప్పలుగా పడిఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తమ ధాన్యం కొనుగోలు చేస్తారని ఎంతో ఆశపడిన చివరకు కొనుగోళ్లు లేక అర్థాంతరంగా నిల్చిపోవడంతో దిగాలుపడాల్సి వస్తుందని మండలంలోని పుల్లయ్యబంజర్‌ గ్రామానికి చెందిన బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్లూరు శివాలయ ప్రాంగణంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేంద్రంలోనే ఇంకను ఐదువేల బస్తాలతోపాటు పోచవరం, చిన్నకోరుకొండి, చెన్నూరు, పెద్దకోరుకొండి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు లేక అలాగే ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవ తీసుకొని తమను ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.


పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి: కాంగ్రెస్‌ నాయకుల డిమాండ్‌


రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభు త్వం కొనుగోలు చేయాలని కల్లూరు కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. పుల్లయ్యబంజర్‌ గ్రామంలోని శివాలయ ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు లేక మిగిలిఉన్న ధాన్యం రాశులను వారు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, ఎంపీటీసీ కొండూరి కిరణ్‌కుమార్‌, నాయకులు దారా రంగా, అప్రోజ్‌లు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పిందని ఆచరణలో మాత్రం అది అమలుకావడం లేదని విమర్శించారు. 


Updated Date - 2020-12-21T04:39:27+05:30 IST