ఆటలోనూ.. చదువులోనూ మేటి అఖిల

ABN , First Publish Date - 2020-12-20T03:43:57+05:30 IST

ఫుట్‌బాల్‌ అదో జెంటిల్‌మెన్‌ గేమ్‌... అలాంటి క్రీడను బాలికలు ఆడాలంటే శరీరంలో దమ్ముతో బాటు ధైర్యం ఉండాలి.

ఆటలోనూ.. చదువులోనూ మేటి అఖిల

ఫుట్‌బాలర్‌గా రాణిస్తున్న పేదింటి కుసుమం

రాష్ట్ర జట్టులో ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారం

జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా సాధన

ఫుట్‌బాల్‌ అదో జెంటిల్‌మెన్‌ గేమ్‌...  అలాంటి క్రీడను బాలికలు ఆడాలంటే శరీరంలో దమ్ముతో బాటు ధైర్యం ఉండాలి. అంతటి కష్టతరమైన క్రీడను ఇష్టంగా ఎంచుకుంది ఓ పేదింటి కుసుమం. ఆరో తరగతిలోనే ఈ క్రీడపై పట్టు సాధిస్తూ.. రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. అంతేకాక చదవులోనూ ఆమె ఉత్తమ ప్రతిభ చాటుతోంది. 

ఖమ్మంస్పోర్ట్స్‌, డిసెంబరు19: రఘునాధపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన తానూరి అఖిల చిన్నతనం నుంచి ఫుట్‌బాల్‌ క్రీడపై ఆసక్తి పెంచుకుంది. ఆమె తండ్రి ఇస్ర్తీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అఖిల తన పదవ తరగతిలో 9.8 జీపీఏ మార్కులు సాధించింది. ఇంటర్‌లో 878 మార్కులు సాధించి చదువులో కూడా టాప్‌ గేర్‌లో దూసుకు పోయింది. ప్రస్తుతం ఆమె ఎస్‌బీఐటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతోంది. కళాశాల ఛైర్మన్‌ గుండాల కృష్ణ  ఫీజు లేకుండా సీటు ఇచ్చారు. 

ఆటల్లో మేటీ

అఖిల 2015- 16లో కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల అండర్‌- 14 పోటీలలో ప్రతిభ చూపింది. దీంతో 2017- 18లో ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ పోటీలలో తన సత్తా చాటింది. అనంతరం 2018- 19లో హర్యాణా రాష్ట్రంలోని అంబాలాలో జరిగిన అండర్‌- 19 బాలికల తెలంగాణ  రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఉత్తమ క్రీడాకారిణిగా బహుమతి సాధించింది. 2019- 20లో ఏపీలోని గుంటూరులో జరిగిన అండర్‌- 19 బాలికల టోర్నీలో రాష్ట్ర జట్టు తరుపున టోర్నీలోనే అత్యధిక గోల్స్‌ సాధించింది.

 జాతీయ జట్టుకు పంపడానికి కృషి

ఆదర్శ్‌కుమార్‌, జిల్లా ఫుట్‌బాల్‌ సంఘం కార్యదర్శి

అఖిల లాంటి ప్రతిభ ఉన్న క్రీడాకారిణిని జాతీయ మహిళా జట్టుకు ఎంపిక అయ్యే వరకు కృషి చేస్తాం.  తల్లిదండ్రులు క్రీడల పట్ల తమ పిల్లలను ప్రోత్సహించాలి. క్రీడల్లో రాణించడం ద్వారా వారికి క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయి. 

Read more