రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదు

ABN , First Publish Date - 2020-12-12T04:52:58+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదు

రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాటం ఆగదు
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం


14న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు

సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సుజాతనగర్‌, డిసెంబరు 11 : కేంద్రం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యేవరకు ఈ పోరాటం ఆగదు అని, ఆయా చట్టాలను,  కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 14న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్‌ మండలం సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అన్ని కమ్యూనిస్టు పార్టీలను కలుపుకొని పోతామని, రైతు సంఘాలన్నీ ఏకమై ఈ చట్టాలను వ్యతురేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను నరేంద్రమోదీ తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పదిహేను రోజులుగా హర్యానా, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలనుంచి 1.20కోట్ల మంది రైతులు ఢిల్లీ నడిబొడ్డున చేరి పోరాటాలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం చర్చలపేరుతో కాలయాపన చేస్తోందని హోంమంత్రి అమిత్‌షా చట్టాల్లో సవరణలు చేస్తాం, తప్ప చట్టాలను రద్దు చేయడం అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చక ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు కావస్తున్నా చేసిన వాగ్దానాలు మర్చిపోయారని, గతంలో బీజేపీని సమర్థించిన టీఆర్‌ఎస్‌ రైతు చట్టాల విషయంలో వ్యతిరేకించడాన్ని ఆయన సమర్థించారు. రాబోయే రోజుల్లో సీపీఎం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం  రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, గుగులోత్‌ ధర్మా, మండల కార్యదర్శి వీర్ల రమేష్‌, గండమాల భాస్కర్‌, బచ్చలికూర శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-12T04:52:58+05:30 IST