రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-11-06T10:24:18+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జిల్లాలో 438 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ఉచిత చేపపిల్లలు

రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

పాలేరులో ధాన్యం కొనుగోలు ప్రారంభం

జలాశయంతో 15లక్షల విలువైన చేప పిల్లల విడుదల


పాలేరు (కూసుమంచి), నవంబరు 5: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ వానాకాలంలో సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖమ్మంజిల్లాలో 438 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు.


అందుకు అవసరమైన 60 లక్షల గన్నీ బస్తాలు అందుబాటులో ఉన్నాయని, మరో 40 లక్షల బస్తాల కొనుగోలు టెండర్‌ ఖరారు కానుందని తెలిపారు. రైతులకు అవసరం ఉన్న చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  రైతులు తేమశాతం అధికంగా లేకుండా పూర్తిగా అరబెట్టుకుని ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకరావాలని సూచించారు. దళారులకు విక్రయించి మోసపోవద్దని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. ఈసారి ధాన్యం బయటి జిల్లాలకు పోకుండా జిల్లాలోనే మిల్లర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. 


మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూత

 మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో, చెరువుల్లో, కుంటల్లో ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. పాలేరు జలాశయంలో రూ.15లక్షల విలువైన చేపపిల్లలను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు, జలాశయాల్లో 3.5 కోట్లు చేపపిల్లలను వేసేందుకు మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  మత్స్యకారులకు సబ్సీడీపై టాటాఏస్‌ మోపెడ్‌ వాహనాలు, అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  


పార్కు నిర్వహణపై అసంతృప్తి

పాలేరు పార్కు నిర్వహణపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  పార్క్‌ నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖ నుంచి పాలేరు గ్రామపంచాయతీ యాజమాన్యానికి అప్పగించాలని ఆదేశించారు. సర్పంచ్‌ యడవల్లి రమణారెడ్డిని పిలిచి పార్క్‌ను సందరంగా తీర్చిదిద్ది, జలాశయంలో బోటింగ్‌ పునఃప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతు రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతుధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత, మధుసూధన్‌రావు, శిక్షణకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, సర్పంచ్‌ యడవల్లి మంగమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు ఇంటూరి బేబి, ఎంపీపీ బాణోతు శ్రీనివాస్‌, జిల్లాపౌరసరఫరాల అధికారి రాజేందర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఏపీడీ జయశ్రీ, మార్కెటింగ్‌ డీపీఎం దర్గయ్య, ఏపీఎంలు శ్రీనివాస్‌, ఎఫ్‌డీవో బుజ్జిబాబు,సత్యవర్ధన్‌రాజు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T10:24:18+05:30 IST