కొడిగట్టిన కుటుంబ నియంత్రణ
ABN , First Publish Date - 2020-11-03T09:57:43+05:30 IST
గతంలో బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన జిల్లా వైద్యఆరోగ్య సిబ్బంది కరోనా ప్రభావంతో పట్టించుకోవడం లేదు. ఆరు నెలలుగా పెద్దాసుపత్రిలో అపరేషన్లను పక్కకుపెట్టారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు
6 నెలలుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్లు లేవు
ప్రైవేటును ఆశ్రయిస్తున్న రెండో కాన్పు దంపతులు
ఒక్కో కేసుకు రూ.25 వేల బిల్లు వసూలు
సొమ్ము చేసుకుంటున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు
పెరిగిన భ్రూణ హత్యలు
ఖమ్మం సంక్షేమవిభాగం, నవంబరు 2: గతంలో బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన జిల్లా వైద్యఆరోగ్య సిబ్బంది కరోనా ప్రభావంతో పట్టించుకోవడం లేదు. ఆరు నెలలుగా పెద్దాసుపత్రిలో అపరేషన్లను పక్కకుపెట్టారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు పండగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ అధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే శస్త్రచికిత్సలకు ప్రైవేట్‌లో ఏకంగా రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. మరో వైపు మూడో కాన్పులో మగ శిశువు కోసం ఎదురుచూసిన దంపతులు పుట్టబోయేది ఆడ శిశువు అని తెలియటంతో ఏకంగా ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలు, ఆసుపత్రుల సాయంతో భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.
పెరిగిన భ్రూణ హత్యలు
2017 వరకు ఖమ్మం జిల్లాలోని 33ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వైద్య విదాన పరిషత్ ఆసుపత్రుల్లో ప్రతీ వారం కుటుంబ నియంత్రణ అపరేషన్లు జరిగేవి. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధ్వర్యంలో ప్రత్యేకంగా కుటుంబ నియంత్రణ శిబిరాలను ఏర్పాటు చేసి అపరేషన్లు చేశారు. డిసెంబరు నుంచి మార్చి వరకు ప్రత్యేక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, డబుల్ పంచర్ ల్యాప్ర్కోస్కోపిక్(డీపీఎల్) క్యాంపులు నిర్వహించారు. జిల్లాలో రోజుకు 200కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల లక్ష్యంగా క్యాంపులు నిర్వహించారు. తర్వాత కొన్ని అనివార్య కారణాలతో జిల్లాలో క్షేత్రస్థాయిలో కుటుంబ నియంత్రణ అపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో మూడో కాన్పు శిశు జననాల రేటు పెరిగింది. మూడో కాన్పులో మగ శిశువుకు కోసం వేసి చూసి స్కానింగ్‌లో ఆడశిశువు అని తేలటంతో భ్రూణహత్యకు అధికమయ్యాయి. ఖమ్మంలోని చిన్నపాటి ప్రైవేట్ ఆసుపత్రుల్లోని స్కానింగ్ కేంద్రాలతో దందా సాగిస్తున్నారని వైద్యశాఖ అధికారులు పలు సందర్భాల్లో గుర్తించారు. హెచ్చరికలలు జారీ చేశారు. అరు నెలలుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో 50వరకు భ్రూణ హత్యలు జరిగినట్లు విమర్శలు వెలువడుతున్నాయి.
కుటుంబ నియంత్రణకు మూడు వేల మంది ఎదురుచూపు
కరోనా ప్రభావం కుటుంబ నియంత్రణ విభాగంపై పడింది. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో జరిగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రస్తుతం జిల్లా ఆసుపత్రికే పరిమితం చేశారు. అయితే కుటుంబ నియంత్రణ విధులు నిర్వహించే డాక్టర్‌కు ఆరు నెలల క్రితమే కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత కుటుంబ నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఆరు నెలలుగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగటం లేదు. ప్రతీ రోజు సాధారణ కాన్పులు జరిగినవారు కనీసం పది నుంచి పన్నెండు మంది కుటుంబ నియంత్ర శస్త్ర చికిత్స లేకుండానే ఇళ్లకు వెళుతున్నారు. ఇవే కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. కాని జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగకపోవటంతో సుమారుగా మూడువేల మంది వరకు దంపతులు కుటుంబ నియంత్రణ కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రైవేట్‌లో రూ.25వేల దోపిడీ
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధ్వర్యంలో ఉచితంగా జరగాల్సిన కుటుంబ నియంత్రణ ఆరు నెలలుగా నిర్వహించకపోవడంతో ప్రైవేటు దవాఖానాలు పండగ చేసుకుంటున్నాయి. కుటుంబ నియంత్రణ అపరేషన్‌కు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని, పీపీఈ కిట్స్ వాడాలని ఏకంగా రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు.
20రోజులుగా ఎదురుచూపు..జుంజు భవాని, రెండో కాన్పు బాలింత, ఖమ్మం
20రోజుల క్రితం ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సాదారణ కాన్పు జరిగింది. మొదటి కాన్పులో అబ్బాయి, రెండో కాన్పులో అమ్మాయి జన్మించారు. రెండో కాన్పు జరిగిన మూడో రోజు కుటుంబ నియంత్రణ అపరేషన్ చేయించుకోవాలని అనుకున్నాం. కాని జిల్లా ఆసుపత్రిలో అపరేషన్లు నిర్వహించటం లేదు. పలుమార్లు జిల్లా ఆసుపత్రికి వెళ్లి కుటుంబ నియంత్రణ అపరేషన్లు గురించి అడిగినా ఇంకా ప్రారంబం కాలేదన్నారు. త్వరగా కుటుంబ నియంత్రణ అపరేషనన్లు చేయాలి.
కొవిడ్-19తో అపరేషన్లు నిలుపుదల..డాక్టర్ మాలతి, జిల్లా వైద్యాధికారి, ఖమ్మం
కొవిడ్-19 కారణంతో అన్ని అపరేషన్లు వలే జిల్లా ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ అపరేషన్లు నిలుపుదల చేయటం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి తిరిగి కుటుంబ నియంత్రణ అపరేషన్లు జరిగేలా కార్యచరణ చేస్తాం.