అంతా ఆమే చేశారు

ABN , First Publish Date - 2020-05-18T10:08:19+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ బ్లీచింగ్‌పౌడర్‌ కొనుగోళ్ల వ్యవహారం మరో మలుపు తిరిగింది.

అంతా ఆమే చేశారు

డీపీవో ఒత్తిడితోనే బ్లీచింగ్‌ కొనుగోళ్లు

ప్రశ్నిస్తే చెక్‌పవర్‌ రద్దు చేస్తామన్నారు 

‘అరేయ్‌ ఒరేయ్‌’ అంటూ అవమానిస్తున్నారు

ట్రాక్టర్ల కొనుగోళ్లలోనూ కమీషన్లు తీసుకున్నారు

భద్రాద్రి డీపీవోపై పలువురు సర్పంచ్‌ల తీవ్ర ఆరోపణ

ఆరోపణల్లో నిజం లేదు: డీపీవో

 

అశ్వారావుపేట, మే 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ బ్లీచింగ్‌పౌడర్‌ కొనుగోళ్ల వ్యవహారం మరో మలుపు తిరిగింది. బ్లీచింగ్‌ కొనుగోళ్లతో తనకు సంబంధం లేదని, సర్పంచ్‌లే నేరుగా కొనుగోలు చేశారని డీపీవో ఆశాలత వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన కొందరు సర్పంచ్‌లు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యవహారంపై అశ్వారావుపేట మండలానికి చెందిన కొందరు సర్పంచ్‌లు స్పందిస్తూ జిల్లా పంచాయతీ అధికారే బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలు చేశారని,  తరువాత బిల్లులు చెల్లించాలని తమపై ఒత్తిడి కూడా తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెం సర్పంచ్‌ మొడియం నాగమణి, రామన్నగూడెం సర్పంచ్‌ మడకం స్వరూప, మద్దికొండ సర్పంచ్‌ తాటి భవాని, వినాయకపురం సర్పంచ్‌ పొడియం సత్యవతి తదితరులు డీపీవోపై తీవ్ర ఆరోపణలు చేశారు.


బ్లీచింగ్‌ను కొనుగోలు చేయాలని డీపీవోనే చెప్పారని, తాను చెప్పినట్టు వినకపోతే ఏదో ఒకరకంగా చెక్‌పవర్‌ రద్దు చేస్తామని బెదిరించారని ఆరోపించారు. కొన్ని పంచాయతీల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ పాత నిల్వలు ఉన్నా మళ్లీ కొనాల్సిందేనంటూ మండలస్థాయి అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారన్నారు. ఏపీలోని పిడుగురాళ్ల నుంచి నకిలీ బ్లీచింగ్‌ కొనుగోళ్లపై అధికారులకు అంత ప్రేమ ఏంటో అర్థం కావడం లేదన్నారు. అంతేకాకుండా పంచాయతీలకోసం తీసుకున్న ట్రాక్టర్‌లు, వాటర్‌ ట్యాంకర్ల కొనుగోళ్లల్లోనూ భారీగా కమీషన్లు దండుకున్నారని సర్పంచ్‌లు ఆరోపించారు. ముందుగా ఓ కంపెనీ ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని కొటేషన్లు తీసుకున్న జిల్లా అధికారులు హఠాత్తుగా మరో కంపెనీ నుంచి ఎందుకు కొనుగోలు చేశారో చెప్పాలని నిలదీశారు. మార్కెట్‌ కంటే అత్యధిక ధరలు చెల్లించి, నాసిరకం ట్యాంకర్లును పంచాయతీలచేత కొనుగోలు చేయించారని ఆరోపించారు.


ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే డీపీవో ఏదో ఒక వంకపెట్టి పారిఽశుధ్యం బాగోలేదంటూ సర్పంచ్‌లను అందరిలో ‘అరేయ్‌.. ఒరేయ్‌’ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. అవసరమైతే చెక్‌ పవర్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారని ఆరోపించారు. డీపీవో ఒత్తిడిలకు తలొగ్గి నకిలీ బ్లీచింగ్‌ పౌడర్‌కు బిల్లులు చెల్లించేది లేదని, ఏం చర్యలు తీసుకున్నా ఎదుర్కోడానికి తాము సిద్దంగానే ఉన్నామని సర్పంచ్‌లు తేల్చి చెప్పారు.


సర్పంచ్‌ల ఆరోపణల్లో నిజం లేదు: డీపీవో

ఈ వ్యవహారంపై భద్రాద్రి కొత్తగూడెం డీపీవో ఆశాలతను వివరణ కోరగా సర్పంచ్‌ల ఆరోపణల్లో నిజంలేదని ఖండించారు. ఆరోపణలు నిజమైతే వారి పిల్లలమీద ప్రమాణం చేసి చెప్పమన్నారు. అశ్వారావుపేట మండలంలో ఈఓఆర్‌డీ నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించడం, మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తుంటే షోకాజు నోటీసులు ఇచ్చామనే కక్షతోనే అతడు సర్పంచ్‌లను రెచ్చగొట్టి ఉంటారని డీపీవో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో బ్లీచింగ్‌ లేకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, కమిషనరేట్‌ నుంచి కొన్ని నెంబర్లు ఇచ్చి బ్లీచింగ్‌కోసం సంప్రదించాలని చెప్పారన్నారు. వాటిని మండలాల్లో అధికారులు పంపి, అవసరమైన వాళ్లు కొనుగోలు చేసుకోవాలని చెప్పామన్నారు. తానెవరికీ ప్రత్యేకంగా చెప్పలేదన్నారు. ట్రాక్టర్లు, ట్యాంకర్లను టెండర్ల ద్వారా కొనుగోలు చేశామన్నారు.

Updated Date - 2020-05-18T10:08:19+05:30 IST