సమస్యల పరిష్కారానికి అధ్యాయన కమిటీల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-19T12:13:13+05:30 IST

కొత్తగూడెం మైన్స్‌ ఏరియా పరిధిలో ఉన్న ప్రధానమైన సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేకంగా అధ్యాయన కమిటీలను

సమస్యల పరిష్కారానికి అధ్యాయన కమిటీల ఏర్పాటు

కార్మికుల సంక్షేమానికి సముచితమైన స్థానం 

కొత్తగూడెం మైన్స్‌ ఏరియా ఎస్వోటు జీఎం నారాయణరావు 

(ఆంధ్రజ్యోతి, కొత్తగూడెం) : కొత్తగూడెం మైన్స్‌ ఏరియా పరిధిలో ఉన్న ప్రధానమైన సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేకంగా అధ్యాయన కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఎస్వోటు జీఎం ఆర్‌. నారాయణరావు వెల్లడించారు. రుద్రంపూర్‌ జీఎం కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో కలిసిన విలేకరులకు ఏరియాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అవలంభిస్తున్న విధానాలను స్పష్టంగా పేర్కొన్నారు.


ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌. నరసింహారావు ఆదేశాల మేరకు తగిన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు తెలిపారు. మరో 10 రోజుల వ్యవధిలో ఈ ఏడాది వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఘనంగా నెరవేరబోతున్న నేపథ్యంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. సింగరేణి కార్మిక వాడలకు ప్రధాన కేంద్రమైన రామవరం పట్టణంలో పారిశుధ్యం పనుల నిర్వహణ, ఆ ఏరియాలో తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను అధ్యాయనం చేసేందుకు పర్సనల్‌, సివిల్‌ డిపార్ట్‌మెంట్‌లు, ఎస్టేట్స్‌ తదితర విభాగాల అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీకే-7షాఫ్ట్‌ గనిని, భూగర్భ గనిని, ఓపెన్‌ కాస్ట్‌ గనిగా మార్పులు చేయడం, జీకేఓసీని వచ్చే ఏడాది మార్చి వరకు మూసివేయడం, ఈ పనులన్ని సమాంతరంగా సాగుతున్నాయని వెల్లడించారు.


రామవరం పట్టణంపై ప్రత్యేక దృష్టి

కొత్తగూడెం మైన్స్‌ ఏరియాలోని కార్మికులు అత్యధిక శాతం నివాసముండే రామవరం పట్టణంపై ఏరియా యాజమాన్యం ప్రత్యేక దృష్టిసారించిందని వెల్లడించారు. ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌. నరసింహారావు ఆదేశాల మేరకు పారిశుధ్యం పనులను పకడ్బందీగా నిర్వహించాలనే ఆలోచనతో, రెండో టెండర్‌ అవసరమంటూ కార్పోరేట్‌కు నివేదించినట్లు వెల్లడిం చారు. ఏరియాలో రకరకాల పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు వారు కేటాయించిన పనులను సక్రమంగా నిర్వహించాలని, కార్మికుల నుంచి వారి కుటుంబాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సహించేదిలేదని హెచ్చరించారు. 

  


Updated Date - 2020-03-19T12:13:13+05:30 IST