అసలు మాటున నకిలీ
ABN , First Publish Date - 2020-12-07T04:52:14+05:30 IST
డబ్బా పోలీన డబ్బా.. పేరులో అక్షరం కూడా మారదు. లేబుల్ నుంచి మొదలుకుని సీల్‌వరకు అన్నీ అసలును పోలినట్టుగానే కనిపిస్తాయి.

అమాయక రైతులకు కల్తీ మందులు
బ్రాండెడ్‌ను పోలిన లేబుళ్లతో విక్రయాలు
నేరుగా ఎరువులు, పురుగులమందుల దుకాణాల్లోనే నిల్వలు
ఖమ్మం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): డబ్బా పోలీన డబ్బా.. పేరులో అక్షరం కూడా మారదు. లేబుల్ నుంచి మొదలుకుని సీల్‌వరకు అన్నీ అసలును పోలినట్టుగానే కనిపిస్తాయి. కంపెనీ గుర్తు, బార్‌కోడ్‌తో సహా అచ్చుగుద్దినట్టు దింపేస్తారు. ఎంతో అనుభవజ్ఞులు సైతం ఆయా నకిలీ మందులను ఏమాత్రం గుర్తుపట్టలేరు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నకిలీ పురుగుల మందులు దందా జోరుగా సాగుతోంది. అసలు మందులను పోలిన నకిలీలను అయాయక రైతులకు అంటగట్టి, అందినకాడికి దండుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇటీవల కూసుమంచిలో వెలుగులోకి రాగా ఏన్కూరులో పలువురిని అరెస్టు చేశారు.
బ్రాండెడ్‌ను పోలిన లేబుళ్లతో విక్రయాలు
ఎక్కడి రైతులైనా తమ పంటకు కావాల్సిన పురుగుల మందులపై ఓ అవగాహన కలిగి ఉంటారు. ప్రతీ సంవత్సరం ఆయా బ్రాండ్‌లు, పేర్లు ఉన్న మందులనే కొనుగోలు చేస్తుంటారు. ఒకవేళ అదే రోగానికి పనిచేసే వేరే బ్రాండు మందు ఉన్నప్పటకీ వారు గతంలో వాడిన మందులను కొనుగోలు చేసేందుకే మక్కువ చూపుతారు. దాన్నే ఆసరాగా చేసుకుంటున్న సదరు అక్రమార్కులు పేరొందిన బ్రాండ్లతో కూడిన మందులను అమ్మకాలు చేసేందుకు తెరలేపుతున్నారు. ప్రముఖ బ్రాండెండ్ కంపెనీల మందులపై ఉండే లేబుళ్లతో సహా.. అదే పేరును మందు డబ్బాలపై పెట్టి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాగా నకిలీ మందుల విక్రయాలను సైతం నేరుగా ఫెర్టిలైజర్ దుకాణాల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ఆయా ఫెర్టిలైజర్ దుకాణదారులకి అధిక మొత్తంలో నగదు ఆశచూపి.. లాభాలు ఎక్కువ వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చదువురాని, అమాయక రైతులకు నేరుగా సదరు బ్రాండ్‌తో పోలి ఉండే నకిలీ మందులను అంటగడుతున్నారు. అయితే ఆయా నకిలీ మందులకు సంబంధించి ఒరిజనల్ మందుల కంపెనీ యాప్‌ల ద్వారా బార్‌కోడ్ స్కాన్ చేస్తే విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ రైతులు అలా చేయలేకపోవడంతో నకిలీల వ్యాపారం సులువైనట్టు తెలుస్తోంది.
ధర తక్కువ.. లాభం ఎక్కువ
అసలు పోలిన నకిలీలను అక్రమార్కులు అటు ఫెస్టిసైడ్స్ వ్యాపారుల నుంచి రైతుల వరకు అంటగట్టడానికి ఒకే పథకాన్ని ఎంచుకున్నారు. ఎలాగూ అసలు మందుల డబ్బా ఉన్నట్టుగానే ఉంటుంది కాని అసలు కంపెనీ లభించే ధర కంటే అతి తక్కువ ధరకు విక్రయాలు చేయడమే వారి అస్త్రం. నకిలీ మందే కాబట్టి వారు ఆ మందు తయారు చేయడానికి చాలా తక్కువ వ్యయం అవుతుండటం.. అధిక లాభాలు రావడంతో అక్రమార్కులు ఆయా వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కాగా ఫెస్టిసైడ్స్ వ్యాపారులకు అతి తక్కువ ధరకు రావడం.. దానిపై అమ్మకాలు సాగించగా మూడింతలు లాభాలు రావడంతో వారు కూడా నకిలీల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. కాగా దీనిని కొందరు వ్యాపారులే నిర్వహించడం.. అక్కడ తక్కువ ధరకు వస్తుందని ప్రచారం చేయడంతో రైతులు కూడా అక్కడే కొనుగోలు చేసి మోసపోతున్నారు. అయితే ఏపీలోని గుంటూరు, తెలంగాణలోని హైద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా సాగే పలు చిన్నపాటి బయో కంపెనీల మాటున ఈ వ్యవహారం అంతా సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ నాయకుల హస్తంపై అరోపణలు
కాగా ఈ నకిలీల విక్రయాలు నేరుగా ఫెర్టిలైజర్ దుకాణాల్లోనే సాగుతుండగా.. అధికారులు మాత్రం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికితోడు ఎక్కడైనా అధికారులు నకిలీలను పట్టుకుంటే రాజకీయ అండదండలతో సదరు అక్రమార్కులు సులువుగా బయటపడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కాగా ఇటీవల ఓ ప్రముఖ కంపెనీకి చెందిన డీలర్‌కు తాను అమ్మకాలు పెట్టని బ్రాండ్ ఒకటి కూసుమంచిలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో ఉందని తెలిసి వెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సదరు కేసు ఏన్కూరు మండలం వరకు పాకగా.. సంబంధిత కేసులో నుంచి కొందరు అక్రమార్కులను తప్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఆ సంఘటనలో సుమారు 15 మంది వ్యక్తుల వరకు ఉండగా... కొంతమంది మాత్రమే తెరమీదకు వచ్చారన్న ప్రచారం సాగుతోంది. కాగా దీనివెనుక కొందరు రాజకీయ నాయకుల హాస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నిఘా ఏర్పాటు చేయాలని దుకాణాల్లో దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.