రైతుబజార్‌ను మూసివేయొద్దు
ABN , First Publish Date - 2020-10-24T10:42:36+05:30 IST
ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం పక్కనే గల రైతుబజార్ మూసివేతను నిరసిస్తూ బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది

ఉద్రిక్తంగా మారిన బీజేపీ కలెక్టరేట్ ముట్టడి
పురుగుల మందు డబ్బాలతో సెల్‌టవర్ ఎక్కిన రైతులు
ఖమ్మం, మయూరిసెంటర్, అక్టోబరు 21: ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం పక్కనే గల రైతుబజార్ మూసివేతను నిరసిస్తూ బీజేపీ కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి బీజేపీ నాయకులు, కూరగాయల రైతులతో కలిసి కలెక్టరేట్‌కు ప్రదర్శనగా బయలుదేరిన వారిని జడ్పీసెంటర్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. తీవ్ర తోపులాట నడుమ రైతులు, బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అర్బన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుబజార్ స్థలాన్ని ప్రైవేటు శక్తులకు అప్పచెప్పేందుకే మంత్రి అజయ్‌కుమార్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ కర్ణన్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా మారి అన్నదాతల కడుపు కొడుతున్నారని అన్నారు. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని, రైతుబజార్ మూసివేతను ఆపలేరని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. రైతులకు ద్రోహం చేసిన కలెక్టర్ చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చేసే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించదని, కాలగర్భంలో కలవక తప్పదని హెచ్చరించారు.
పురుగుల మందు డబ్బాలతో సెల్‌టవర్ పైకి
బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమంది కూరగాయలు అమ్ముకునే లైసెన్స్ ఉన్న రైతులు భావోద్వేగానికి గురయ్యారు. నలుగురు రైతులు స్టేషన్‌సమీపంలో పురుగులమందు డబ్బాలను చేతిలో పట్టుకొని పక్కనే ఉన్న సెల్‌టవర్‌ను ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం రూరల్‌మండలం గూడూరుపాడుకు చెందిన భట్టు నాగరాజు యాదవ్, చింతపల్లికి చెందిన విజయ్, ఖమ్మం నగరానికి చెందిన రవి దంపతులు రైతుబజార్‌ను మూసివేయద్దంటూ అధికారులను వేడుకున్నారు.
వారి చేతిలోని పురుగుల మందు డబ్బాను గుంజుకునేందుకు సెల్‌టవర్ ఎక్కిన వెంకటేష్ అనే రైతు కళ్లల్లో, ముఖంపై, శరీరంపై ద్రావకం పడటంతో అతడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, టుటౌన్ సీఐ తుమ్మా గోపి, అర్బన్ సీఐ వెంకన్నబాబు రైతులకు నచ్చచెప్పి సెల్‌టవర్ దింపారు. రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గుత్తా వేంకటేశ్వరరావు, డీ. వేంకటేశ్వరరావు, విద్యాసాగర్, సుధాకర్, ప్రభాకర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఉపేందర్‌గౌడ్, వీరూ గౌడ్, భద్రం, మహిళామోర్చా జిల్లా లధ్యక్షురాలు శ్రీదేవి, అరుణ, మురళి, ప్రియతమ్ తదితరులు పాల్గొన్నారు.