ఎటుపాయె జీవాలు..?

ABN , First Publish Date - 2020-03-04T12:32:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో సరిగా అమలు కావట్లేదు. జీవాల పెంపకంపై

ఎటుపాయె జీవాలు..?

జిల్లాలో మొదలుకాని రెండో గొర్రెల పంపిణీ

తొలి విడతలోనూ 325 యూనిట్ల బాకీ!

రెండో విడత పంపిణీ లక్ష్యం 16,200 యూనిట్లు

ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు


ఖమ్మం వ్యవసాయం, మార్చి 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో సరిగా అమలు కావట్లేదు. జీవాల పెంపకంపై ఆధారపడి బతుకుతున్నవారికి గొర్రెలు పంపిణీ చేయడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగు పర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం చేపట్టింది. అయితే... ఇప్పటికీ మొదటి విడత గొర్రెల పంపిణీయే పూర్తి కాకపోవడం గమనార్హం. దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


జిల్లాలో 331 సొసైటీలు..

జిల్లాలో మొత్తం 331 సొసైటీలు ఉన్నాయి. ఇందులో మొత్తం 33,584 మంది సభ్యులు ఉన్నారు. రెండు విడతలు కలిపి మొత్తం 32,524 గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో తొలి విడత 16,324 యూనిట్లుకాగా.. రెండవ విడత 16,200 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే.. మొదటి విడతలోనే ఇప్పటి వరకు 15,099 యూనిట్లు మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 325 యూనిట్లు లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. పథకం అమలు మొదలై ఇన్నాళ్లైనా.. ఇంతవరకు మొదటి దశ పంపిణీయే పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, రెండో విడత యూనిట్ల పంపిణీ ఈ ఏడాది ఆగస్టులోనే ప్రారంభం కావల్సి ఉండగా.. ఇప్పటి వరకు ప్రారంభించలేదు. రెండో జాబితాను అధికారులు రూపొందించినప్పటికీ.. సదరు లబ్ధిదారులతో కనీసం డీడీలు కూడా కట్టించుకోకపోవటం గమనార్హం.


సబ్సిడీ ఇలా..

గొర్రెల పంపిణీకి సంబంధించి ఒక యూనిట్‌ విలువ రూ.1.25లక్షలు. ఇందులో ప్రభుత్వం 75శాతం రాయితీ ఇస్తోంది. అంటే.. రూ.93,750 ప్రభుత్వం భరిస్తుండగా.. లబ్ధిదారుడు 25శాతం వాటా భరించాలి. అంటే.. రూ.31,250 చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని బ్యాంకు డీ.డీ. రూపంలో చెల్లించాలి. పథకం ప్రవేశపెట్టిన తొలి నాళ్లలో చకచకా లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల పంపిణీ జరిగిపోయింది. కానీ.. రెండో విడతకొచ్చే సరికి పరిస్థితి తలకిందులైంది. ఈ విడత ఇప్పటికీ మొదలు కాలేదు. దీంతో ఎంపికైన లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


ఆగస్టులోనే ఇవ్వాల్సి ఉన్నా..

రెండవ విడత ఈ ఏడాది ఆగస్టులోనే ప్రారంభం కావాల్సిఉంది. కానీ.. ఇప్పటి వరకు ప్రారంభించలేదు. గత నెలలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభించిన సమయంలో జిల్లాలోనూ పంపిణీ చేస్తారని లబ్ధిదారులు ఆశించారు. కానీ.. జరగలేదు. జిల్లా అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అదేశాలు రాలేదని, స్థానికంగానూ కొన్ని సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండవ విడత గొర్రెల పంపిణీ ఎన్నడు జరుగుతుందో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-03-04T12:32:01+05:30 IST