నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-03-27T11:58:50+05:30 IST

చదువు, ఉపాధి, ఉద్యోగ కారణాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రాకు చెందిన

నో ఎంట్రీ

అశ్వారావుపేట వద్ద ఆంధ్రా విద్యార్థుల నిలిపివేత 

స్వరాష్ట్రంలోకి అనుమతించని ఏపీ పోలీసులు

కాలినడకన వెళ్లినవారిని కూడా వెనక్కు పంపిన వైనం

గత్యంతరం లేక తిరిగి వసతిగృహాలకు పయనం

అశ్వారావుపేటలోనే 100 మంది విద్యార్థుల పడిగాపులు

ఆంధ్రాలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు


అశ్వారావుపేట రూరల్‌/కల్లూరు, మార్చి 26: చదువు, ఉపాధి, ఉద్యోగ కారణాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఆంధ్రాకు చెందిన యవకులు కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని సరి హద్దు చెక్‌పోస్టువద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అడ్డుకు న్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించటంతో విద్యార్థులు, యువకులు దాదాపు 15గంటల పాటు వేచి ఉన్నా అనుమతివ్వకపోవడంతో వారంతా తిరిగి హైదరాబాదుకు పయనమయ్యారు.కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరిలారు. తెలంగాణలోని హైదరాబాదు తదితర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు, కూలి పనులు చేసుకునేవారు తమ స్వగ్రామాలకు వెళ్లటానికి హైదరాబాద్‌ పోలీసులు అనుమతులు ఇచ్చారు.


టీఎస్‌ ప్రభుత్వం అందించిన అనుమతిపత్రంతో ఆంధ్రాలోని రాజమండ్రి, కాకినాడ, తణుకు, రాజోల్‌, విశాఖ ప్రాంతాలకు చెందిన దాదాపు వెయ్యిమంది విద్యార్థులు, ఇతర వ్యక్తులు బుధవారం అర్ధరాత్రికి సొంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో అశ్వారావుపేటకు చేరుకున్నారు. అయితే ఆంధ్రా సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద అధికారులు, పోలీసులు విద్యార్థులను, కూలీలను తమ రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు నిరాకరించారు. దాంతో దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రాలోకి అనుమతింకపోవడంతో విద్యార్థులు అశ్వారావుపేట చెక్‌ పోస్ట్‌ వద్దనే గురువారం ఉదయం 10గంటల వరకు పడిగాపులు కాశారు. స్థానిక పోలీసులు ఇతర అధికారులను సంప్రదించగా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, ఆంధ్రా అధికారులే అనుమతి నిరాకరిస్తున్నారని, వారినే సంప్రదించాలని సూచించారు.


అయితే ఆంధ్రా పోలీసులు, అధికారులు ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించేది లేదని స్పష్టం చేయడంతో వారంతా చెట్ల కిందనే కాలం గడిపారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లలోకి వెళ్లాలని, లేదంటే తిరిగి వసతిగృహాలకు వెళ్లాలని ఆంధ్రా పోలీసులు తెలపటంతో దిక్కుతోచక విద్యార్థులంతా అలాగే ఉండిపోయారు. ఓవైపు ఆహారం కూడా లేకపోవటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  తమకు పరీక్షలు చేసైనా స్వరాష్ట్రంలోకి అనుమతించాలని కోరారు. అయినా అధిఽకారుల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటంతో చేసేదేమీ లేక కొందరు క్వారంటైన్‌కు వెళితే ఎక్కువ మంది తిరిగి హైదరాబాదుకు పయనమయ్యారు. 


అశ్వారావుపేటలో 100 మంది ఆంధ్రావాసులు

అశ్వారావుపేటలో అంతరాష్ట్ర చెక్‌పోస్టు ఉండగా రాత్రి నుంచి అనేకమంది రాగా సరిహద్దులో ఆంధ్రా పోలీసులు అడ్డు చెప్పటంతో దాదాపు వచ్చిన వారంతా తిరిగి వచ్చిన ప్రదేశాలకే వెళ్లారు. కాని సాయంత్రం సుమారు మరో వందమంది వరకు అశ్వారావుపేట వచ్చారు. వీరంతా ఆంధ్రాలోని కొంతదూరం వెళ్లాక అక్కడ పోలీసులు తిరిగి మళ్లీ అభ్యంతరం పెట్టి బోర్డర్‌ దాటి వచ్చినవారిని తిరిగి తెలంగాణాలోకి పంపించారు. దీంతో వారంతా అశ్వారావుపేటలో ఇరుక్కుపోయారు. వీరు ప్రయాణించిన వాహనాలు తిరిగి వెళ్లిపోవటంతో వీరంతా ఎటూ వెళ్లలేక చెక్‌పోస్టు వద్దనే ఉండిపోయారు. వీరిని స్థానిక అధికారులు నూజివీడులోని క్వారంటైన్‌కు పంపాలని నిర్ణయించి ప్రత్యేకంగా బస్‌లు ఏర్పాటు చేశారు. అయితే నూజివీడు అధికారులు అనుమతి నిరాకరించటంతో బాధితులంతా అశ్వారావుపేటలోని తహసీల్దారు కార్యాలయం వద్దే పడిగాపులు పడుతున్నారు. తమను ఎలాగైనా తమ ఇళ్లకు పంపాలని వేడుకున్నారు. ఇదే విషయమై స్థానిక అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న వీరికి స్థానికులు భోజన వసతిని కల్పించారు. 


ఆంధ్రాలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

ఇక ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తున్న విద్యార్థులను గురువారం ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో బ్యాంకు ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న తెలంగాణ విద్యార్థులు తమ గ్రామాలకు తరలివచ్చే క్రమంలో బుధవారం రాత్రి ఏడుగంటలకు పోలీస్‌శాఖ వారి అనుమతులు తీసుకొని వస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగేడు గ్రామ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఉదయం 7గంటలకు వారిని అడ్డుకున్నారు. సదరు విద్యార్థులు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కూడా ఆకలితో అలమటించి తాగేందుకు నీరు కూడా దొరక్క నానా అవస్థలు పడ్డారు. విద్యార్థుల వద్ద తమ రాష్ట్ర పోలీసుశాఖ అనుమతి పత్రాలు ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు తమను అడ్డుకున్నారని విద్యార్థులు కంటతడిపెట్టారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన సుమారు 20మంది విద్యార్థులు గుంటూరు సరిహద్దులో చిక్కుకున్నారు.


ఖమ్మంజిల్లా కల్లూరుకు చెందిన ఒక విద్యార్థి కుటుంబసభ్యులు ఆంధ్రా పోలీసులు మన విద్యార్థులను అడ్డుకున్న విషయమై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దృష్టికి తీసుకురాగా తంగేడు ఆలయ అర్చకులతో మాట్లాడి భోజన సౌకర్యం ఏర్పాటుచేయించారు. ఆ తర్వాత విద్యార్థులు కాలిబాటన 20కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ సరిహద్దుకు చేరుకున్నట్లు తెలిసింది.


Updated Date - 2020-03-27T11:58:50+05:30 IST