తుది దశలో ‘ధరణి’

ABN , First Publish Date - 2020-10-24T10:38:32+05:30 IST

వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ ఖమ్మం, భద్రాదిర కొత్తగూడెం జిల్లాల్లో తుది దశకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని 584 గ్రామపంచాయతీల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి

తుది దశలో ‘ధరణి’

ఖమ్మం జిల్లాలో 96.62 శాతం వ్యవసాయేతర ఆస్తుల నమోదు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 99.53 శాతం


ఖమ్మం  కలెక్టరేట్‌/ కొత్తగూడెం, అక్టోబరు 23:  వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ ఖమ్మం, భద్రాదిర కొత్తగూడెం జిల్లాల్లో తుది దశకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలోని 584 గ్రామపంచాయతీల్లో ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. గతనెల 29నుంచి అన్ని గ్రామాల్లోనూ సర్వే నిర్వహించారు. పంచాయతీల్లో వ్యవసాయేతర భూములను గుర్తించి ధరణి పోర్టల్‌లో నమోదు పక్రియను జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. దసరా నాటికి ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో అప్పటి వరకు వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పొందుపరచాలన్న లక్ష్యంతో జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం నాటికి జిల్లాలో 3లక్షల5వేల 728 గుర్తించిన ఆస్తులలో 2లక్షల 83వేల 155 ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దాదాపు ఈ ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఇప్పటి వరకు 92.62శాతం పూర్తయ్యింది. 


ఖమ్మం జిల్లాకు ఏడో స్థానం

రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఏడో స్థానంలో నిలిచింది. రెండు రోజుల్లో సర్వే పూర్తిచేసి మూడు రోజుల్లో ఆన్‌లైన్‌ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది గత 25 రోజుల క్రితం సర్వే నిర్వహించారు. 56 అంశాలతో కూడిన సమగ్ర సమచారాన్ని ఇంటింటికీ తిరిగి సేకరించారు. తొలివిడతగా గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదు కాని కట్టడాలను నమోదు చేశారు. ఇంటి విస్తీర్ణం, ఇంటి నెంబర్‌, యజమాని పేరు, ఆధార్‌నెంబరు, ఫోన్‌ నెంబరు, కుటుంబ యజమాని లేకుంటే తరువాతి కుటుంబ పెద్ద, కుటుంబంలో నివసిస్తున్న సభ్యుల వివరాలను అడిగితెలుసుకున్నారు. డిమాండ్‌ రిజిస్టర్‌లో చివరి వరసలో పక్కా వివరాలను పొందుపరిచారు. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించాలన్న ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో ఆన్‌లైన్‌ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారు.

 

వివరాలు ఇలా...నమోదు

జిల్లాలో 584పంచాయతీల్లో  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా పంచాయతీల్లో రికార్డులో నమోదు కాని ఆస్తులను కార్యదర్శులు వివరాలు సేకరించారు. 20 మండలాల్లో ఇప్పటి వరకు 2లక్షల 55,074 నివాస ప్రాంతాల్లో ఇళ్ల వివరాలు ఆస్తుల వివరాలు రికార్డుల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో కొత్తగా 3లక్షల 05,728 ఇళ్ల వివరాలను సిబ్బంది సేకరించారు. వీటన్నింటినీ ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. దాదాపు ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇప్పటి వరకు 92.62శాతం పూర్తికాగా ఇంకా 22.57శాతం ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. 24వ తేదీవరకు ఆన్‌లైన్‌ నూటికి నూరుశాతం పూర్తిచేయనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.


భద్రాద్రి జిల్లాలో 99.53 శాతం ఆస్తుల నమోదు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వ్యవసాయేతర ఆస్తుల సర్వే ముమ్మరం చేశారు. ఈ నెల 19తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కుటుంబాలకు చెందిన వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 99.53 శాతం నమోదైంది. జిల్లాలో 23 మండలాల్లో మొత్తం 2,75,165 కుటుంబాలకు చెందిన ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో మొత్తం 2,54,125గృహాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించి గుర్తించింది. వీటిలో కూడా డేటా ఎంట్రీ పెండింగ్‌, ప్లాట్స్‌ తదితరాలుగా 7,879 గృహాలున్నాయి.  25వ తేదీ వరకు అవకాశం ఉండటం వల్ల పూర్తిస్థాయిలో వంద శాతం నమోదు చేసేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సర్వే నిర్వహిస్తోంది. దీని కోసం జిల్లాలోని 398 టీములను ఏర్పాటు చేశారు. 


99శాతానికి పైగానే పూర్తి

జిల్లాలో మండలాల వారీగా 99శాతం నమోదు పూర్తయింది. అశ్వాపురం లో 99.92శాతం, భద్రాచలంలో 99.81, బూర్గంపాడులో 99.97, చర్లలో 99.92, దుమ్ముగూడెంలో 99.85, కరకగూడెంలో 99.98, మణుగూరులో 99.98, పినపాకలో 99.93, సారపాకలో 99.89, ఆళ్లపల్లిలో 99.83, అన్నపురెడ్డిపల్లిలో 98.81, అశ్వారావుపేటలో 98.45, చంద్రుగొండలో 99.92, చుంచుపల్లిలో 99.51, దమ్మపేటలో 99.41, గుండాలలో 99.90, జూలూరుపాడులో 99.90, లక్ష్మీదేవిపల్లిలో 99.90, ములకలపల్లిలో 99.01, పాల్వంచలో 98.89, సుజాతనగర్‌లో 99.81, టేకులపల్లిలో 99.68, ఇల్లెందులో 99.78శాతం ఆస్తుల వివరాలు నమోదయ్యాయి. ఇవేగాకుండా జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల పరిధిలో కూడా వంద శాతం ఆస్తుల వివరాలు నమోదయ్యాయి. 


కొత్గగూడెం పురపాలకంలో 96శాతం

కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 20,078 గృహాలు ఉండగా 19,287 గృహాలకు సర్వేలు పూర్తిచేయగా 96.06శాతం నమోదయ్యాయి. పాల్వంచ మునిసిపాలిటీలో 20,347 గృహాలుండగా, 43 బృందాలు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 19,386 గృహాలను సర్వే పూర్తిచేశారు. 961 గృహాల సర్వేకు వీలు లేకుండా ఉంది. ఇప్పటి వరకు అక్కడ వంద శాతం పూర్తయింది. మణుగూరు మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 7,383 గృహాలుండగా మొత్తం 31 టీములు సర్వేలు జరిపాయి. 7,020 ఇళ్లను సర్వే పూర్తిచేశారు. ఇల్లెందు మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 8,645గృహాలు ఉండగా, మొత్తం 30 టీములు సర్వేలు జరపగా, 8,286 గృహాలకు సర్వే పూర్తయింది. అయితే 53,979 గృహాలు సర్వే పూర్తయ్యాయి. 2,474 ఇళ్లు సర్వే చేయడానికి వీలు కాలేదు.

Updated Date - 2020-10-24T10:38:32+05:30 IST