సామాన్యులకు కేంద్రం భరోసా
ABN , First Publish Date - 2020-03-27T12:00:31+05:30 IST
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించే క్రమంలో కేంద్రం వచ్చేనెల 14వ తారీఖు వరకు
‘కరోనా’ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన
పలు పథకాల ద్వారా అందజేతకు నిర్ణయం
ఇరుజిల్లాల్లో పలువురికి చేకూరనున్న లబ్ధి
ఖమ్మం/కొత్తగూడెం, మార్చి 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించే క్రమంలో కేంద్రం వచ్చేనెల 14వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో అన్ని రంగాలు ఆగిపోయాయి. ఫలితంగా సామాన్యుల జీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు, ఏదో ఒక పనికి వెళ్తే కాని పొట్ట నింపుకోలేని పరిస్థితిలో ఉన్న వారు, చిరు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో గ్రామీణ పేదలు, రైతులు, మహిళలతో పాటు పలు రంగాలపై ఆధారపడిన సామాన్యులకు ఉపాధిలేని సమయంలో కొంత ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ప్రతీ ఒక్కరికి గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం అందిస్తుండగా.. దానికి కేంద్రం ఇవ్వబోయేవి అదనం.
ఇరుజిల్లాల వారికి లబ్ధి జరగనుందిలా..
ఐదు కిలోల బియ్యం : ఖమ్మం జిల్లాలో 4,51,000 రేషన్ కార్డులుండగా 6,38,000 మందికి, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,60,279 మంది కార్డు దారులకు అందనున్నాయి.
ఉజ్వల పథకం.. మూడు గ్యాస్ సిలిండర్లు: ఖమ్మం జిల్లాలో 47,311 మంది, 44,973 మంది ఉజ్వల మహిళా లబ్ధిదారులకు మూడునెలలపాటు మూడు గ్యాస్ సిలిం డర్లను ఉచితంగా అందించబోతున్నారు.
పీఎం కిసాన్ యోజన.. మరో రూ.2వేలు : పంటలు కోయలేక, కోసినా అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులకు కొంత ఊరట కల్పించింది. ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ఒక్కో రైతుకు రూ.6వేల చొప్పున ఇస్తున్న కేంద్రం మరో రూ.2వేలను తక్షణమే ఖాతాల్లో వేసేందుకు నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో 1,89,318 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 92,981 మంది రైతులకు ఈ సాయం అందనుంది.
వైద్య, ఆరోగ్య శాఖ.. బీమా: వైద్య ఆరోగ్యశాఖకు సంబం ధించి కేంద్ర ప్రభుత్వం రూ.50లక్షల బీమా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సుమారు ఇరు జిల్లాలోని సుమారు 16వేల మంది డాక్టర్లు, వైద్య సిబ్బందితోపాటు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది తదితరులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. వీరిలో ఎవరైనా కరోనా సేవల సమయంలో ఆ వైరస్ ప్రభావానికి గురై ఆరోగ్య పరంగా నష్టపోతే వారికి బీమా సొమ్ము అందనుంది.
పీఎం జన్‌ధన్‌యోజన.. మహిళ ఖాతాల్లోకి రూ.500 : జన్ ధన్ పథకం కింద ఇరుజిల్లాల్లో ఉన్న ఖాతాదరులకు మూడు నెలల పాటు వారి వారి బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.500ల చొప్పున రూ.1500 అందజేసేలా చర్యలు తీసుకుంది.
డ్వాక్రా సంఘాలకు రుణపరిమితి పెంపు: ఇరుజిల్లాల్లోని డ్వాక్రా స్వయం సంఘాల మహిళకు అదనంగా బ్యాంకు నుంచి రుణాలు పొందే సౌలభ్యాన్ని కల్పించింది. రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు షరతులు లేకుండా రుణం అందించే అవకాశమిచ్చింది.
‘ఉపాధి’ వేతనం పెంపు: ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.182నుంచి రూ.202కు పెంచారు. తద్వారా ఇరుజిల్లాల్లో ఉన్న మూడులక్షల మందికి పైగా కూలీలకు అదనపు ఆదాయం రానుంది.
అదనంగా పింఛను : ఖమ్మం జిల్లా 60ఏళ్లు నిండిన వృద్దులు 57,931, దివ్యాంగులు26364, వితంతువులు 64892ఉన్నారు. ప్రస్తుతం వృద్ధులు వితంతువులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 పింఛ ను వస్తుండగా.. వారికి అదనంగా మరో రూ.వెయ్యి.. మూడునెలల పాటు అందించనున్నారు.
అసంఘటిత కార్మికులకు కేంద్రం పలు ప్రయోజనకర నిర్ణయాలు ప్రకటించింది. రూ.15వేలలోపు ఆదాయం ఉండే ఈపీఎఫ్ ఉద్యోగులు, కార్మికులకు మూడు నెలలపాటు 24శాతం కేంద్ర ప్రభు త్వమే సొమ్ము చెల్లించనుంది. అలాగే భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు స్తానికంగా వచ్చే ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకుని పలు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.