వెల్లువెత్తిన దాతృత్వం..రైతు వేదికలకు భూముల వితరణ

ABN , First Publish Date - 2020-07-18T10:20:20+05:30 IST

రైతులందరిని సంఘటిత పరిచి పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం, వ్యవసాయంలో అనుసరించాల్సిన ఆధునిక పద్దతుల గురించి

వెల్లువెత్తిన దాతృత్వం..రైతు వేదికలకు భూముల వితరణ

జిల్లాకే ఆదర్శం తల్లాడ మండలం


తల్లాడ, జూలై 17: రైతులందరిని సంఘటిత పరిచి పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం, వ్యవసాయంలో అనుసరించాల్సిన ఆధునిక పద్దతుల గురించి అవగాహన సదస్సులు నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన రైతు వేదికల నిర్మాణానికి అవసరమైన భూములను వితరణగా అందజేసేందుకు దాతలు ముందుకొచ్చారు. లక్షలాదిరూపాయలు విలువచేసే భూములను రైతువేదికల నిర్మాణానికి వితరణగా అందజేయడంలో జిల్లాలోనే తల్లాడ మం డలం ముందుంది. ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి దాని పరిధిలో ఒక్కొక్క రైతువేదికను సుమారు 20 గుంటల విస్తీర్ణంలో రూ.22లక్షల వ్యయంతో నిర్మించాలని ప్రభు త్వం నిర్ణయించింది. తల్లాడ మండలంలో తల్లాడ, అన్నారుగూడెం, మల్లవరం, పినపాక, కుర్నవల్లి, మిట్టపల్లి, నూతనకల్‌, బిల్లుపాడు కేంద్రాలుగా క్లస్టర్లు ఉన్నాయి. మండలంలోని తల్లాడ, మల్లవరం, అన్నారుగూడెం, నూతనకల్‌ క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణానికి అవసరమైన ప్ర భుత్వ భూములను గుర్తించారు.


మండలంలో మిగిలిన మిట్టపల్లి, కుర్నవల్లి, పినపాక, బిల్లుపా డు క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణానికి అవసరమైన లక్షలాదిరూపాయలు విలువ చేసే భూములను దాతలు వితరణ చేసేందుకు ముందుకొచ్చారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో 20 గుంటల భూమిని మాజీ సర్పంచ్‌ మువ్వా దర్గమ్మ దానమిచ్చారు. కుర్నవల్లిలో కొనుగోలు చేసిన 20 గుంటల భూమిని ప్రజల తరపున సర్పంచ్‌ అయిలూరి లక్ష్మీ దానంగా అందజేశారు. బిల్లుపాడు గ్రామంలో పది గుంటల భూమిని స్వాతంత్య్ర సమరయోధుడైన జక్కంపూడి బాపనయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు జక్కంపూడి కృష్ణమూర్తి, జక్కంపూడి చంద్రశేఖర్‌ దానమిచ్చారు. రామానుజవరం గ్రామంలో 23కుంటల భూమిని సర్పంచ్‌ శీలం కోటిరెడ్డి, వైస్‌ఎంపీపీ శీలం శివపార్వతి దంపతులు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మండలంలో మొత్తం 8క్లస్టర్లలో రైతువేదికలకుగానూ నాలుగు క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణానికి భూములను వితరణగా దాతలు ఇవ్వటం విశేషం.

Updated Date - 2020-07-18T10:20:20+05:30 IST