దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు..
ABN , First Publish Date - 2020-12-11T05:22:27+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందడంతో ఖమ్మం జిల్లా మధిరలో తీవ్ర విషాదం నెలకొంది.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుంటుంబంలో ముగ్గురి దుర్మరణం
కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ప్రమాదం
మధిర పట్టణంలో తీవ్ర విషాదం
మధిరటౌన్, డిసెంబరు 10: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందడంతో ఖమ్మం జిల్లా మధిరలో తీవ్ర విషాదం నెలకొంది. వేములవాడలో దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కృష్ణా జిల్లా గరికపాడు వద్ద గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు జరిగిన ప్రమాదంలో మధిర పట్టణానికి చెందిన పాన్ షాపు నిర్వాహకుడు మాచర్ల శ్యాం(50), అతడి భార్య శారద(45)తో పాటు వదిన మాచర్ల భాగ్యమ్మ ఆమె కుమారుడు మాచర్ల నవీన్, కోడలు మాచర్ల శ్యామల (35), మనుమరాలు మాచర్ల మవ్యతో కలిసి ఎనిమిదిన రాత్రి కారులో వేములవాడకు వెళ్లారు. మార్గమధ్యలో వరంగల్‌లోని భాగ్యమ్మ చిన్న కుమారుడు ప్రవీణ్ ఇంటికి వెళ్లి అతడి పిల్లలు అక్షయ్, మనును తీసుకొని వేములవాడ వెళ్లారు. దైవ దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో ఖమ్మం కరీంనగర్ రహదారి సరిగా లేకపోవడంతో సిద్దిపేట నుంచి సూర్యాపేట జాతీయ రహదారి మీదుగా మధిరకు బయలుదేరారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో ముందు వెళుతున్న లారీని వీరు ప్రయాణిస్తున్నకారు ఢీ కొనటంతో శ్యాంతో పాటు అతని భార్య శారద, శ్యామల అక్కడికి అక్కడే ముృతి చెందారు. కారు డ్రైవర్ సైదులుతో పాటు మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.