లాక్‌డౌన్‌లోను కరెంట్‌ కనెక్షన్‌ కట్‌

ABN , First Publish Date - 2020-04-25T10:37:07+05:30 IST

లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమం లో ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఎన్నో వెసులుబాటులు కల్పించింది.

లాక్‌డౌన్‌లోను కరెంట్‌ కనెక్షన్‌ కట్‌

కాసులిస్తేనే కరెంట్‌ ఉంటుంది

బిల్లు చెల్లించినా కరెంట్‌ కట్‌

బల్లేపల్లి లైన్‌మెన్‌ అరాచకం

ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు


కమాన్‌బజార్‌ ఏప్రిల్‌ 24: లాక్‌డౌన్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమం లో ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఎన్నో వెసులుబాటులు కల్పించింది. అయినా విద్యుత్‌ అధికారులు మాత్రం దానిని తుంగలో తొక్కి లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నారు. బిల్లు చెల్లించాలని లేకుంటే కరెంట్‌ కట్‌ చేస్తామని హుకుం జారీ చేస్తున్నారు. నగరంలోని బల్లేపల్లి లైన్‌మెన్‌ మాత్రం తన అరాచకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇష్టానుసారంగా కరెంట్‌ కనెక్షన్లు కట్‌ చేస్తు పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చేయి తడిపితే మాత్రం కనెక్షన్‌ ఉంచుతున్నారు.


ఇతడి వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. ఈక్రమంలోనే ఈనెల 22న ఓ సర్వీస్‌ నెంబర్‌కు సంబంధించిన కరెంట్‌ కనెక్షన్‌ కట్‌ చేశాడు. దీంతో లబ్ధిదారులు కేవలం రూ.2,257 బిల్లుకే కరెంట్‌ కనెక్షన్‌ ఎలా కట్‌ చేస్తారు అని అడిగితే దురుసుగా ప్రవర్తించారని అంటున్నారు. చేసేదేం లేక వేరే వారి సహాయంతో ఆన్‌లైన్‌లో 23న బిల్లును చెల్లించారు. అయినా 24న మళ్లీ కరెంట్‌ కనెక్షన్‌ కట్‌చేశాడు అంటే సదరు లైన్‌మెన్‌ అరాచకం ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


చెప్పేదానికి చేసే దానికి పొంతనలేదు

విద్యుత్‌ బిల్లుల విషయంలో అధికారులు పట్టణ ప్రాంతాల్లో ఒకింత కఠినంగానే ఉన్నారు. అయితే అది 2019కి సంబంధించిన బిల్లుల విషయంలో మాత్రమే. 2020 బిల్లులకు సంబంధించి మాత్రం ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలని ఆవగాహన కల్పిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.


ఆన్‌లైన్‌ చెల్లింపులు అందరికి రాకపోవటంతోనే లైన్‌మెన్‌ ఆగడాలకు హద్దులేకుండా పో తోందని పలువురు అంటున్నారు. ఇటీవల కాలంలో జయనగర్‌లో ఓ వ్యక్తి నూతన కనెక్షన్‌కు డబ్బులు డిమాండ్‌ చేశాడు అంటే అతని వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సదరు లైన్‌మెన్‌ డబ్బులు ఇస్తేనే వెంటేనే పని చేస్తాడని లేకుంటే ఆవైపు కూడా చూడడని పలువురు అంటున్నారు. కొంచెం పెద్ద పని అయితే శాఖపరమైన అన్ని పన్నులు చెల్లించినప్పటికి సదరు లైన్‌మెన్‌కు మాత్రం మందు, విందు పెద్ద కవర్‌ ఇస్తేనే పని అవుతుందనే ఆరోపణలున్నాయి. 


పై అధికారులకు ఫిర్యాదు చేశానన్న కక్షతోనే: ఆవుదొడ్డి శ్రీనివాస్‌

నేను బల్లేపల్లిలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాను. స్లాబ్‌కు దగ్గరగా విద్యుత్‌ తీగలు ఉం డటంతో వాటిని మార్చేందుకు అధికారులను ఆశ్రయించాను. లైన్‌మెన్‌ వచ్చి 20వేలు డిమాం డ్‌ చేశాడు. నేను 10వేలు ఇచ్చాను. వాటికి పైప్‌లు అమర్చకుండా సగం పని మాత్రమే చేశాడు. పైప్‌లు తొడగాలని అడగగా మరో రూ. ఐదువేలు డిమాండ్‌ చేశాడు. చేసేది లేక పై అధికారులను ఆశ్రయించాను. దీంతో సదరు లైన్‌మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


అది మనసులో పెట్టుకొని తరుచు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. రెండు నెలలు బకాయి ఉన్నందుకు కనెక్షన్‌ కట్‌చేశాడు. బిల్లు చెల్లించినప్పటికీ కనెక్షన్‌ కట్‌చేశాడు. నా ఇల్లు నిర్మాణంలో ఉంది దానికి ప్రతి రోజు రెండుసార్లు క్యూరింగ్‌ చేయాల్సి ఉంది కరెంట్‌ లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నాను. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికి సదరులైన్‌మెన్‌ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 


Updated Date - 2020-04-25T10:37:07+05:30 IST