క‘రెంట్‌’ షాక్‌

ABN , First Publish Date - 2020-05-18T10:03:08+05:30 IST

కరోనా విపత్తుతో జన జీవనం స్తంభించిపోగా విద్యుత్‌శాఖ బిల్లులతో బెంబేలెత్తిస్తోంది.

క‘రెంట్‌’ షాక్‌

గత ఏడాది బిల్లులు చెల్లించాలంటున్న అధికారులు

అద్దెకు ఉంటున్న వారికి రూ. వేలల్లో భారం

పాత రీడింగ్‌తో తమకేం సంబంధం అంటున్న వినియోగదారులు


ఖమ్మం కమాన్‌బజార్‌, మే 17: కరోనా విపత్తుతో జన జీవనం స్తంభించిపోగా విద్యుత్‌శాఖ బిల్లులతో బెంబేలెత్తిస్తోంది. ఉపాధి కరవై చేతిలో చిల్లి గవ్వలేకున్నా రూ. వేలల్లో చెల్లించాల్సిందే అని హుకుం జారీచేస్తోంది. దాతల సహాయంతో నెట్టుకొస్తున్న తమను డబ్బుల కోసం వేధిస్తున్నారని విద్యుత్‌ వినియోగదారులు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో మీటర్‌ రీడింగ్‌ సిబ్బంది రీడింగ్‌ నమోదు చేయలేదు. అయినా గత ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో చెల్లించిన బిల్లునే ప్రస్తుత నెలల్లో కట్టాలని విద్యుత్‌ శాఖ అధికారులు ఆదేశిస్తున్నారు. ఈ నిర్ణయం అద్దెకు ఉంటున్న వారికి శాపంలా పరిణమించింది. ఎవరో వినియోగించుకున్న కరెంట్‌కు తమనుంచి ఎలా బిల్లు వసూలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


బిల్లు చెల్లించకుంటే కనెక్షన్‌ కట్‌

కరోనాటైమ్‌లో కరెంటు బిల్లులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఎవరిని గడపదాటొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తుండటంతో పనుల కోసం వెతుక్కుంటున్నారు. అద్దెకు ఉంటున్న వారి ప్రస్తుత పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. అద్దెతో పాటు కరెంటు బిలు ్లలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారు. మీటరు రీడింగ్‌ తీయకున్నా కరెంటుబిల్లు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశిస్తున్నారు. బిల్లు చెల్లించకుంటే విద్యుత్‌  సరఫరా తొలగించాలని.. సీఎం ఆదేశించారని వినియోగదారులను భయపెడుతున్నారు. దీంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగ మారింది. 


గత బిల్లులు ఎలా చెల్లిస్తారు..?

విద్యుత్‌శాఖ సిబ్బంది లాక్‌డౌన్‌ ఆంక్షలతో రీడింగ్‌ నమోదు చేయడానికి ఇళ్లకు రావడం లేదు. అధికారులు వినూత్నంగా ఆలోచించి గత ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలలో ఎన్ని యూనిట్ల విద్యుత్‌  వినియోగించారో ఆ బిల్లులనే ఈ ఏడాది చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.  ఈ నిర్ణయంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంట్లో గత ఏడాది అద్దెకు ఉన్న వారికి ఏసీ, వాషింగ్‌మిషన్‌ ఇతర విద్యుత్‌ గృహోపకరణలు ఉండొచ్చు. వాటిని ఉపయోగించినందుకు సదరు వ్యక్తికి రూ.2వేలకు పైగా కరెంటుబిల్లు వస్తుంది.


కానీ ఆ వ్యక్తి ఇల్లు ఖాళీ చేశాక.. కొత్తగా అద్దెకు వచ్చిన వ్యక్తి పెద్దగా విద్యుత్‌ పరికరాలు ఉపయోగించకున్నా అంతే బిల్లు చెల్లించాల్సి వస్తోంది. ఒక ట్యూబులైటు, ఫ్యాన్‌ మాత్రమే ఉన్న కుటంబాలకు ప్రతీనెలా రూ.200 నుంచి రూ.300 వరకు మాత్రమే బిల్లు వస్తుంది. కానీ గత ఏడాది నమోదైన వేలాది రూపాయల బిల్లులు చిరు జీవులను చెల్లించాలని హకుం జారీ చేయడం సరికాదని బాధితులు అంటున్నారు.


ఏసీలేకున్నా బిల్లు మోత

కరోనా ప్రభావంతో చాలా మంది ఫ్రిజ్‌లు, ఏసీలు ఉపయోగించడం లేదు. అయినా  కరెంటుబిల్లుల మోత మోగుతోంది. దీనికి ప్రధాన కారణం గత ఏడాది వేసవి ప్రభావమేనని  వినియోగదారులు వాపోతున్నారు. ఆన్‌లైన్‌లో రూ.5వేల నుంచి రూ. 10 వేల వరకు  కరెంటు బిల్లులు చూపిస్తున్నాయని పలువురు అంటున్నారు. నెల జీతం కంటే కరెంటు బిల్లే అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈసమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుకుంటున్నారు.


ఎప్పుడూ రూ.500 మించి బిల్లు రాలేదు.. మాచర్ల మురళీ, ఖమ్మం

నేను శ్రీనగర్‌కాలనీలో ఓ ఇంట్లో ఆరు నెలల క్రితం అద్దెకు దిగాను. ప్రతీ నెల  రూ.500లోపు మాత్రమే బిల్లు వచ్చేది. కానీ మార్చి బిల్లు మాత్రం రూ. 2వేలు వచ్చింది. అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదు. ఏప్రిల్‌ మాసంలో బిల్లు రూ.3 వేలు వచ్చింది. గత ఏడాది బిల్లు ఇదే అని.. అంతే చెల్లించాలని అధికారులు అంటున్నారు. గత ఏడాది వినియోగించిన విద్యుత్‌బిల్లుతో నాకేం సంబంధమని అధికారులను అడిగితే దురుసుగా సమాధానం చెబుతున్నారు.  

Updated Date - 2020-05-18T10:03:08+05:30 IST