కొవిడ్‌ రెండో దశలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-07T04:56:14+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపధ్యంలో రాష్ట్రం ప్రజలు ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు తెలిపారు.

కొవిడ్‌ రెండో దశలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహమ్మారిని అదుపుచేయగలిగాం 

రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు 


కొత్తగూడెం, డిసెంబరు 6: దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపధ్యంలో రాష్ట్రం ప్రజలు ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌రావు తెలిపారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో ఆదివారం భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు చెందిన వైద్యశాఖ అధికారులతో కొవిద్‌-19 నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కొవిడ్‌ మహమ్మారిని సమర్థవంగా నియంత్రించగలుగుతున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8,125 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయన్నారు.రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటివరకు 57.79లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 60వేల పరీక్షలు చేస్తునట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 1.53శాతం ఉండగా మన రాష్ట్రంలో 0.5 శాతం మాత్రమే నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రతిరోజు సుమారు 600కేసులు మాత్రమే నమోదవుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గత పది రోజుల్లో రెండుసార్లు సమీక్షలు నిర్వహించి రెండో విడత కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించాలని ఆదేశించినట్లు తెలిపారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. త్వరలోనే  కొవిడ్‌ వ్యాక్సిన్‌ అవకాశాలున్నాయన్నారు. ముందుగా వైద్యశాఖ, పోలీసుశాఖ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ అందచేసే అవకాశం ఉందన్నారు. చలికాలం సీజన్‌లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజల్లో కొందరు ప్రస్తుతం కరోనా పట్ల అజాగ్రత్తగా ఉన్నారని, మాస్క్‌లు ధరించకుండా గుంపులుగా తిరుతున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక, మైనింగ్‌ ప్రాంతం కావడంతో కాలుష్యం కారణంగా ఇక్కడ ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులు అధికంగా ఉంటాయిని, ఈ నేపధ్యంలో కొవిడ్‌ పట్ల ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కరోనా పాజిటివ్‌ వస్తే ప్రవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్య సహాయం పొందాలని సూచించారు. భద్రాద్రి జిల్లాలో గతం కంటే జ్వరాలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయన్నారు. ఆసుపత్రులకు జనం రావడం కూడా బాగా తగ్గిందన్నారు. సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్‌ఓలు డాక్టర్‌ మాలతి, డాక్టర్‌ బాస్కర్‌నాయక్‌, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌వో డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, డిప్యూటి డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బావ్‌సింగ్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ సుజాత, సుక్రుత, ఆర్డినేటర్‌ కోటి రత్నం, డాక్టర్‌ చేతన్‌తో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-12-07T04:56:14+05:30 IST